
క్యూ2లో 20 శాతం జంప్
30 శాతం వాటాతో యాపిల్ టాప్
క్యూ2పై సైబర్‌మీడియా రీసెర్చ్ నివేదిక
న్యూఢిల్లీ: దేశీయంగా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో గణనీయంగా పెరిగింది. గతేడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 20 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇందులో దాదాపు మూడో వంతు మార్కెట్ వాటా యాపిల్‌దే ఉంది. సైబర్‌మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం యాపిల్ ఐప్యాడ్ సరఫరాలు వార్షికంగా 10 శాతం, త్రైమాసికాలవారీగా 78 శాతం పెరిగాయి.
30 శాతం మార్కెట్ వాటా దక్కించుకున్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఐప్యాడ్ 11 సిరీస్‌కి డిమాండ్ నెలకొనడం ఇందుకు దోహదపడింది. సమీక్షాకాలంలో యాపిల్ మొత్తం విక్రయాల్లో దీని వాటా 70 శాతం పైగా నమోదైంది. ఇక, 15 శాతం వార్షిక వృద్ధి, 27 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండో స్థానంలో నిల్చింది. విస్తృతమైన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో కారణగా అఫోర్టబుల్, ఎంటర్‌ప్రైజ్ సెగ్మెంట్లో కంపెనీ నిలకడగా రాణించింది. మొత్తం శాంసంగ్ ట్యాబ్‌ల విక్రయాల్లో గెలాక్సీ ట్యాబ్ ఏ9 ప్లస్ 5జీ వాటా ఏకంగా 81 శాతంగా నమోదైంది. 2025లో ట్యాబ్లెట్ మార్కెట్ 10–15 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని సీఎంఆర్ అంచనా వేసింది.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ ట్యాబ్లెట్ పీసీల అమ్మకాలు 18 శాతం పెరిగినప్పటికీ లెనోవో మార్కెట్ వాటా ఫ్లాట్‌గా 16 సాతం స్థాయిలోనే కొనసాగింది.
→ షావోమీ, వన్ ప్లస్‌ల అమ్మకాలు వరుసగా 81 శాతం, 95 శాతం పెరగ్గా, మార్కెట్ వాటా 15 శాతం, 6 శాతంగా నమోదైంది.
→ రేటుకు తగ్గ విలువను అందించే షావోమీ, వన్‌ప్లస్ లాంటి బ్రాండ్ల ట్యాబ్లెట్లకు విద్యార్థులు, గిగ్ వర్కర్ల నుంచి డిమాండ్ కనిపించింది.
→ దేశీ మార్కెట్ క్రమంగా మరింత ఉత్పాదకత, వినోదాన్ని అందించే 5జీ ఆధారిత ప్రీమియం, రేటుకు తగ్గ విలువను ఇచ్చే ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ల వైపు మళ్లుతోంది. పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాలు నిలకడగా వృద్ధి చెందవచ్చు.