
చారిత్రక భవనానికి రాజసం ఉట్టిపడేలా ఏర్పాట్లు
ప్రధాన భవనం చుట్టూ ఉన్న ఇతర నిర్మాణాల తొలగింపు
ఉద్యానవన విభాగ స్థలాలు సేకరించి వాటిలో నిర్మాణాలు
జూబ్లీహాలు, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, బాలభవన్‌ల రీమోడలింగ్... 3 రకాల ప్రణాళికలకు రూపు..
సీఎం ఆమోదించే తుది ప్రణాళిక ప్రకారం పనులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో పార్లమెంటు భవనం పరిసరాలు ప్రత్యేకంగా ఉన్న తరహాలోనే తెలంగాణ శాసనసభ ప్రాంగణాన్ని కూడా రాజసం ఉట్టిపడేలా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఉభయసభలున్న ప్రాంగణం యావత్తు కొంత గందరగోళంగా ఉంది. వారసత్వ భవనం అయినప్పటికీ, ప్రధాన భవనానికి చేరువలో ఇతర భవనాలుండటంతో ఆ భవన ప్రత్యేకతకు కొంత భంగంవాటిల్లుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
సభ జరిగే సమయంలో వాహనాలకు సరైన పార్కింగ్ వసతి లేకపోవటంతో ప్రధాన భవనం చుట్టూరా నిలుపుతున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న భవనం అయినప్పటికీ, దాని ప్రత్యేకతను ఇనుమడింపజేసేలా పచ్చిక బయళ్లు లేకపోవటం వెలితిగా ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధాన భవనానికి అతి చేరువలో ఉన్న ఇతర భవనాలను తొలగించి.. కొంచెం దూరంగా, క్రమపద్ధతిలో కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
శాసనసభ్యులు, మండలి సభ్యులు, వీఐపీలకు ఆ భవనంలో చాలినన్ని వసతులు లేవని, అందుకు ప్రత్యేకంగా మరో భవనం నిర్మించి వసతులు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రోడ్లు, భవనాల శాఖ ఓ బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
ఉద్యానవన శాఖ స్థలాన్ని సేకరించి..
శాసన మండలి కూడా శాసనసభ ఉన్న ప్రధాన భవనంలోకే మారనుంది. ఇప్పటికే పాత అసెంబ్లీ హాల్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ప్రస్తుతం జూబ్లీహాలు వెనకవైపు కొనసాగుతున్న మండలి ప్రాంగణాన్ని ఖాళీ చేయనున్నారు. దీంతో ఆ ప్రాంగణం మొత్తాన్ని రీమోడలింగ్ చేయబోతున్నారు. ఇందుకోసం ఉద్యానవన విభాగం ఆదీనంలోని స్థలాలను సేకరించి దానికి మరోచోట ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చి ఇక్కడ నుంచి తరలించాలని నిర్ణయించారు.
అలా సేకరించిన నర్సరీ, ఉద్యానవన స్థలాలను కొత్త నిర్మాణాలకు వాడబోతున్నారు. జూబ్లీహాలు భవనానికి కూడా వారసత్వ హోదా ఉండటంతో దానిని తొలగించే వీలులేదు. దీంతో ఆ భవనాన్ని రీమోడలింగ్ చేయబోతున్నారు. దాని చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాలను కూడా వినియోగించుకోనున్నారు. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా భారీ పార్కింగ్ యార్డును రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
సాధారణ పార్కింగ్ స్థలం వాహనాలకు సరిపోని పక్షంలో ప్రత్యేకంగా పార్కింగ్ టవర్‌ను నిర్మించే యోచనలో ఉన్నారు. మొత్తంమీద వాహనాలను ప్రధాన భవనం ఛాయల్లో పార్క్ చేయకుండా చేస్తారు. ఇక పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, ప్రింటింగ్ ప్రెస్ ఉన్న భవనాలు తొలగించి ఆ ప్రాంతాన్ని లాన్‌గా మార్చబోతున్నారు. ముందు వైపు, ఆ చుట్టు పక్కల ఎలాంటి ఇతర నిర్మాణాలు లేకుండా క్రమబద్ధం చేస్తారు.
వాటికీ రీమోడలింగ్..
ఇక పబ్లిక్ గార్డెన్‌లో ఉన్న ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, జవహర్ బాలభవన్, హెల్త్ మ్యూజియంలు వినియోగంలో లేవు. వాటిని కూడా రీమోడలింగ్ చేయటం ద్వారా ఎలాంటి అవసరాలకు వినియోగించవచ్చనే విషయంలో ప్లాన్ చేస్తున్నారు. వీఐపీలకు, సందర్శకులకు వేర్వేరు ప్రధాన ద్వారాలు ఏర్పాటు చేయబోతున్నారు.
పార్లమెంట్‌లో ఉన్న సెంట్రల్ హాల్ మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి హాల్ నిర్మాణం, అక్కడ శాసన సభ్యులు కలసి కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా ఏర్పాట్లు, సమావేశాల నిర్వహణకు వినియోగించుకునేలా నిర్మాణం చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు మూడు రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిల్లో ముఖ్యమంత్రి ఆమోదించే ప్రణాళిక ప్రకారం త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నారు.