
దేశంలోని మెడికల్ కాలేజీల్లో గత ఏడాది 165 ర్యాగింగ్ కేసులు
అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 33 కేసుల నమోదు
ఏపీలో ఆరు... కేరళలో అత్యల్పంగా ఒక కేసు...
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలోని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చట్టం అమల్లో ఉన్నప్పటికీ... ర్యాగింగ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని వైద్యకళాశాలల్లో గత ఏడాది (2024)లో 165 ర్యాగింగ్ కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 33 కేసులు నమోదైనట్లు తెలిపింది.
ఆ తర్వాత బిహార్‌లో 17, అత్యల్పంగా కేరళలో ఒక కేసు నమోదైనట్లు వివరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి. ర్యాగింగ్ నిరోధంపై వైద్య విద్యాసంస్థల డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా క్రమం తప్పకుండా మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.
ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించకపోతే గుర్తింపు రద్దు
వైద్య విద్యాసంస్థలు ర్యాగింగ్ నిరోధక ప్రొటోకాల్‌ను పాటిస్తున్నాయా.. లేదా.. అని నిర్ధారించేందుకు వార్షిక ర్యాగింగ్ నిరోధక నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ప్రొటోకాల్ పాటించకపోతే జరిమానాలు విధించడంతోపాటు విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు సురక్షిత వాతావరణం ఉండేలా ర్యాగింగ్ నివారణ, నిషేధం నిబంధనలు–2021ను అమలు చేస్తున్నట్లు వివరించింది.
అడ్మిషన్ బ్రోచర్లు, బుక్‌లెట్లలో ర్యాగింగ్ నిరోధక చర్యల గురించి నిర్దిష్ట సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. కళాశాలలు, ఆస్పత్రులు, హాస్టళ్లతోసహా క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు ర్యాగింగ్ నిరోధక పోస్టర్లు, హోర్డింగ్‌లను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థులు ర్యాగింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులను దాఖలు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసిందని, ఫిర్యాదులను యాంటీ ర్యాగింగ్ సెల్ పర్యవేక్షిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది.