
రెడ్ బాల్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడనుకున్న భారత అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ యశ్ ధుల్.. టీ20 ఫార్మాట్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీకి ఆడుతున్న ధుల్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు.
కొద్ది రోజుల కిందట నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్‌పై మెరుపు సెంచరీతో (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు) విరుచుకుపడిన చేసిన ధుల్.. తాజాగా అదే జట్టుపై మరోసారి విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 105; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు.
ధుల్ సెంచరీలతో పేట్రేగిపోయిన రెండు సందర్భాల్లో సెంట్రల్ ఢిల్లీ ఘన విజయాలు సాధించింది. తాజాగా నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ 16 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 7 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ధుల్‌తో పాటు యుగల్ సైనీ (28 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటాడు. నార్త్రన్ ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ హర్షిత్ రాణా, అర్జున్ రప్రియ తలో 3 వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నార్త్రన్ ఢిల్లీ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. 16 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఓపెనర్లు సర్తక్ రంజన్ (52), అర్నవ్ బుగ్గా (43) మెరుపు ఇన్నింగ్స్‌లతో గెలుపుకు గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన వారు దాన్ని కొనసాగించలేకపోయారు. మధ్యలో వైభవ్ కంద్‌పాల్ (34) మినహా అంతా విఫలమయ్యారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లు తలో చేయి వేసి నార్త్రన్ ఢిల్లీ గెలుపుకు అడ్డుకున్నారు.
ఆ ముద్రను చెరిపేసిన ధుల్
రెడ్ బాల్ బ్యాటర్‌గా ముద్రపడిన ధుల్.. వరుస టీ20 సెంచరీలతో ఆ ఇమేజ్‌ను చెరిపేశాడు. తాజా ప్రదర్శనలతో ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు. ధుల్‌కు అండర్-19 క్రికెట్ ఆడే రోజుల నుంచి నిదానంగా ఆడతాడన్న చెడ్డ పేరుంది. టెక్నిక్ పరంగా బలంగా ఉన్నప్పటికీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో, ముఖ్యంగా టీ20ల్లో అవేవీ లెక్కలోని రావు.
అందుకే ధుల్ తన శైలిని మార్చుకొని బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డీపీఎల్‌లో రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డాడు. ధుల్‌కు ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గానూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతని సారథ్యంలో భారత్.. అండర్-19 జట్టు 2021 ఆసియా కప్, 2022 వరల్డ్‌కప్ గెలిచింది.
ధుల్ రంజీ అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసి సీనియర్ లెవెల్లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత 2022లో అతనికి ఐపీఎల్ అవకాశం దక్కింది. ఆ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. 3 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 16 పరుగులే చేసి నిరాశపరిచాడు.
ఆ సీజన్‌లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్‌ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్‌ను మరోసారి దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు.