
కదిరి అర్బన్: స్పెషల్ సర్వీసు పేరుతో ఆర్టీసీ అధికారులు మహిళల ఉచిత ప్రయాణానికి బ్రేక్ వేశారు. దీనిపై మహిళల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రావణ శనివారం సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పాలపాటిదిన్నె ఆంజనేయస్వామిని దర్శించుకుందామని ఎంతో ఆశతో బయలుదేరిన మహిళా భక్తులకు నిరాశ మిగిలింది.
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులకే ‘స్పెషల్ సర్వీసులు’ అని పేర్కొంటూ.. స్త్రీ శక్తి పథకం కింద ‘మహిళలకు ఉచిత ప్రయాణం లేదు’ అని పోస్టర్లు అతికించారు. దీంతో మహిళా భక్తులు అధికారులు, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణమని గొప్పులు చెబుతూనే ఇలా మెలికలు పెట్టడం ఏంటని ప్రశి్నంచారు. దీనిపై కదిరి ఆర్టీసీ డీఎం మైనోద్దీన్ మాట్లాడుతూ.. పాలపాటిదిన్నెకు మొత్తం 7 స్పెషల్ సర్వీసులు వేశామని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం లేదని చెప్పారు.