సీమకు తీరని అన్యాయం
అనంతపురం కల్చరల్: రాయలసీమ ప్రాంతానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని, నిధులు, నీళ్లు రాబట్టుకోవడంలో పాలకులు దారుణంగా విఫలమయ్యారని రచయితలు, ఉద్యమ సంస్థల ప్రతినిధులు ధ్వజమెత్తారు. వేమనా ఫౌండేషన్, రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం రాయలసీమ మహాకవి సమ్మేళనం జరిగింది. సీమ వ్యాప్తంగానే కాకుండా చైన్నె, నెల్లూరు, ప్రకాశం, బళ్లారి, హంపీ నుంచి కవులు, రచయితలు విచ్చేసి సీమ ప్రత్యేకతను చాటేలా కవితలు వినిపించారు. ముఖ్యంగా జనప్రియకవి ఏలూరు యంగన్న, ఒంటెద్దు రామలింగారెడ్డి రాగయుక్తంగా ఆలపించిన కవితాగానం, జూటూరు షరీఫ్, రఘురామయ్య, రియాజుద్దీన్, సడ్లపల్లి చిదంబరరెడ్డి, వన్నప్ప, నరిసిరెడ్డి, టీవీరెడ్డి వచన కవితలు అమితంగా ఆకట్టుకున్నాయి. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు డాక్టర్ శాంతినారాయణ, బండి నారాయణస్వామి, జెట్టీ జైరామ్, మాజీ వీసీ కాడా రామకృష్ణారెడ్డి, కవిసమ్మేళనం సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, తరిమెల అమరనాథరెడ్డి, జిరసం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్ , ఉద్యమ సంస్థల ప్రతినిధులు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. రాజధానిని కర్నూలు నుంచి అమరావతికి తరలించుకుపోతున్నా పాలకులు నిలదీయలేకపోయారని విమర్శించారు. అడుగడుగునా సీమకు జరిగిన అన్యాయాలను ఎండగట్టారు. ప్రజలను సీమ సమస్యలు ప్రతిబింబించే సాహిత్యంతో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రవికుమార్, లోకన్న తదితరులు పాల్గొన్నారు.
రాయలసీమ మహాకవి సమ్మేళనంలో రచయితలు


