నట్టేట ముంచిన ‘ఆమె’
● అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్‌లో వందల సంఖ్యలో మహిళలు యానిమేటర్ ఆదిలక్ష్మి మోసానికి బలయ్యారు. వందలు... వేలు.. కాదు రూ. కోట్లలో దగా చేసి ఉడాయించడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇళ్లల్లో పాచి పని చేసుకుంటున్న వారిని కూడా వదల్లేదు. చీటీలు, వడ్డీలతో పాటు డ్వాక్రా సభ్యుల పేర్లతో రుణాలు తీసుకుంది. ఈమె బాధితుల్లో ఎక్కువగా కూలీనాలీ చేసుకునే వారే ఉన్నారు.
రాప్తాడు రూరల్: నందమూరి నగర్‌లో చాలా కాలంగా ఉంటూ యానిమేటర్‌గా పనిచేస్తున్న ఆదిలక్ష్మి సుదీర్ఘకాలంగా ఆ ప్రాంతంలో చీటీ వ్యాపారం నిర్వహిస్తోంది. అందరితోనూ మంచిగా ఉండడంతో చాలా మంది ఆమెను నమ్మారు. ఈ నమ్మకంతోనే చీటీలు పూర్తయినా వడ్డీ చెల్లిస్తానంటే చీటీలు వేసిన వారు ఒప్పుకున్నారు. వడ్డీ డబ్బులు ఇవ్వకుండా తిరిగి వారిని కొత్త చీటీల్లోకి సభ్యులుగా చేర్చుకునేది. దీనికి తోడు రూ. 2 వడ్డీతో రూ.లక్షల్లో అప్పులు చేసింది. అంతటితో ఆగకుండా ప్రగతి మహిళా సంఘం సభ్యుల పేరుపై రుణాలు తీసుకుంది. ఇలా మొత్తం రూ. 3 కోట్ల దాకా చేరుకోగానే 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వారం రోజుల క్రితం విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం డీఆర్‌డీఏ అధికారులకు, అనంతపురం రూరల్ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై అటు పోలీసులు కానీ, ఇటు డీఆర్‌డీఏ అధికారులు కాని ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది.
టీడీపీ నేత జోక్యం..
ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే విషయం స్థానిక ఓ టీడీపీ నేతకు ముందుగానే తెలుసుననే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదిలక్ష్మిపై ఒత్తిడి తీసుకెళ్లి ఆమె ఇంటిని బాధితుల్లో ఒకరైన తన సమీప బంధువు పేరిట రాయించినట్లుగా సమాచారం. ఇది ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఆమె కూడా తమలాగానే అప్పులు ఇచ్చిందని, అయితే ఇంటిని ఆమె ఒక్కతే ఎలా రాయించుకుంటుందని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే ముందు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుగానే లాంగ్‌లీవ్‌లో వెళ్లడానికి సదరు టీడీపీ నేతనే పావులు కదిపినట్లుగా తెలిసింది. ఈ విషయంలో అధికారులు ఇప్పటికై నా స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు కోరుతున్నారు.
కోట్లాది రూపాయలు ముంచేసి
పరారైన యానిమేటరు
చీటీలు, వడ్డీలతో పాటు
సభ్యుల పేర్లతో రుణాలు
బాధితులంతా కూలీనాలీ చేసుకునేవారే
అజ్ఞాతంలోకి వెళ్లేముందు ఓ మహిళ పేరుపై ఇంటిని రాయించిన వైనం
వెనుక నుంచి తతంగం నడిపిన
స్థానిక టీడీపీ నేత


