వీఆర్వోను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు
కదిరి టౌన్: స్థానిక మున్సిపల్ పరిధిలోని సైదాపురం గ్రామ వీఆర్వో టీఎస్ ఇనాయతుల్లాను చంపుతామని బెదిరించి బలవంతంగా సంతకాలు చేయించుకున్న పుట్టపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రేమనాథరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు కదిరి పట్టణ సీఐ నారాయణరెడ్డి తెలిపారు. వివరాలను ఆదివారం సీఐ వెల్లడించారు. సైదాపురం పరిధిలోని సర్వే నంబర్ 36లో గ్రామ కంఠముగా ఉన్న స్థలాన్ని పొరంబోకు రస్తాగా ఇవ్వాలని వీఆర్వోపై కదిరిలోని ఇందిరాకాలనీలో నివాసముంటున్న ప్రేమనాథరెడ్డి ఒత్తిడి చేశాడు. ఇందుకు వీఆర్వో ఒప్పుకోకపోవడంతో చంపుతానని బెదిరించి, తన వద్ద ఉన్న కాగితాలపై బలవంతంగా సంతకాలు పెట్టించి, సీల్ వేయించుకుని వెళ్లాడు. విషయాన్ని తహసీల్దార్‌తో పాటు కదిరి పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రేమనాథరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి దుర్మరణం
సోమందేపల్లి: స్థానిక షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు... రొద్దం మండలం తురకలపట్నం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (30) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆయనకు వివాహమైంది. ఈ క్రమంలో హిందూపురంలో శనివారం జరిగిన ఓ శుభకార్యంలో తన స్నేహితులతో కలసి పాల్గొన్న అనంతరం రాత్రికి స్వగ్రామానికి కారులో ప్రయాణమయ్యాడు. షిర్డీసాయిబాబా ఆలయం వద్దకు చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో నేరుగా వెళ్లి చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై సోమందేపల్లి పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పాలకుల తీరుతో దేశం అప్పుల పాలు
● ఏఐసీసీ పరిశీలకుడు అజయ్‌సింగ్
ధర్మవరం/కదిరి టౌన్: పాలకుల తీరుతో దేశం అప్పుల పాలవుతోందని ఏఐసీసీ పరిశీలకుడు అజయ్‌సింగ్, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే కమలమ్మ విమర్శించారు. కదిరిలోని అత్తార్ రెసిడెన్సీతో పాటు ధర్మవరంలోని ప్రణవ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఆయా నియోజకవర్గాల విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ధర్మవరంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ నరేష్ యనమల, కదిరిలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేఎస్ షనవాజ్ అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం 17 నెలల కాలంలోనే రూ.222 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ.15,485 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పనలోనూ పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు అడుగడుగునా మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్‌పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
అమ్మాజీ ఆలయంలోకి ఎలుగు బంటి
రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో త్రిశక్తి దేవతలుగా విరాజిల్లుతున్న అమ్మాజీ (మారక్క, గ్యారక్క, ముడుపక్క) ఆలయంలో ఆదివారం వేకువజామున ఎలుగుబంటి ప్రవేశించింది. శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు మారన్న, ముడుపన్న పూజాదికాలు ముగించుకున్న అనంతరం గర్భగుడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం వేకువజామున ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడి గర్భగుడి తలుపులు తాకి వెళ్లింది. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న అర్చకులు విషయాన్ని గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి.


