
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే చాన్స్ ఉంది.
అంతకుముందు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ..‘వరంగల్ పంచాయతీపై నలుగురిని అక్కడికి పంపాలని నిర్ణయం తీసుకున్నాం. వారు ఎవరెవరు అనేది పార్టీ సూచిస్తుంది. నేను మంటలు పెట్టడానికి లేను. చల్లార్చే పనిలో ఉన్నాను. నా పని ఫైరింజన్ చేసే పని. పీసీపీ చీఫ్ మహేష్ గౌడ్ నాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్లపై చర్చ చేశారు.. పరిశీలిస్తాం’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరితే మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు చెప్పారని, కానీ మాట తప్పారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంత్రి పదవి లభించలేదనే కారణంతో అసహనానికి గురైన రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు.