
సాక్షి,విశాఖ: ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. కర్నూల్, నెల్లూరు, తిరుపతి,చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
బంగాఖాతంలో ఏర్పడిన వాయిగుండం కారణంగా మరో మూడు రోజులపాటు కొనసాగనున్న భారీ వర్షాలు కురియనున్నాయి. ప్రస్తుతం తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ సమయంలో మరో మూడు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ
దక్షిణ ఛత్తీస్‌గడ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆదివారం నుంచి మంగళవారం వరకు రాష్ట్రంలో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. 19న కోస్తాంధ్ర అంతటా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రఖర్ జైన్ సూచించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.