
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh Gopi), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించిన సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki vs State of Kerala).. కోర్ట్‌రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించారు. అయితే, టైటిల్ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీతాదేవి మరో పేరు జానకి కావడం.. ఈ మూవీలో దాడికి గురైన మహిళా పాత్రకు ఆ పేరు పెట్టడంతో సెన్సార్ బోర్డు అడ్డుచెప్పింది. దీంతో టైటిల్‌లో చిన్న మార్పు చేసి (‘వి’ యాడ్ చేశారు) (Janaki v vs State of Kerala) కేవలం మలయాళంలో మాత్రమే జులైలో విడుదల చేశారు. అయితే, తాజాగా 'జీ 5'లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగులో త్వరలో విడుదల కావచ్చు. అయితే, సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్ ఉంది.

థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ రూపొందింది. న్యాయం కోసం పోరాడే యువతి కథే ఈ చిత్రం. జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ.. పండగ కోసం కేరళలోని తన సొంత ఊరికి వస్తుంది. అయితే, అక్కడ ఆమెపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో ఆమె న్యాయ పోరాటం చేస్తుంది. కానీ, నిందితుల తరఫున డేవిడ్ అనే ప్రముఖ లాయర్ (సురేశ్ గోపి) వాదిస్తాడు. దీంతో కేసు ఓడిపోవడం, తండ్రిని కోల్పోవడం, గర్భం దాల్చడం వంటి సంఘటనలు ఆమె జీవితాన్ని కుదిపేస్తాయి. జానకి ప్రభుత్వాన్ని తన బిడ్డను చూసుకోవాలని కోరుతుంది. దీనిపై కేరళ హైకోర్టు ఎలా స్పందించింది..? అనే అంశం కథలో కీలకం. ఒక కానిస్టేబుల్ సహాయంతో కేసు తిరిగి ఓపెన్ చేయడంతో కథ కొత్త మలుపులు తిరుగుతుంది. జానకి చేసిన న్యాయ పోరాటంలో ఫైనల్‌గా ఎవరు గెలిచారు..? నిందితుల పక్షాన సురేశ్ గోపి ఎందుకు వాదించాల్సి వచ్చింది. జానకికి జన్మించిన బిడ్డ బాధ్యతను చివరగా ఎవరు తీసుకుంటారు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈ చిత్రం న్యాయ వ్యవస్థ, మహిళల హక్కులు, సామాజిక బాధ్యతలపై ప్రశ్నలు వేస్తూ.. భావోద్వేగంగా సాగుతుంది. మీరు లీగల్ డ్రామా సినిమాలు ఇష్టపడితే, ఇది తప్పక చూడవచ్చు. కథలో చెప్పిన అంశం చిన్నదైనా సరే చాలామందిని ఆలోచింపచేస్తుంది. అయితే, ఇలాంటి కథలు వెండితెరపై చాలానే కనిపించాయి. కానీ, ప్రవీణ్ నారాయణన్ తెరకెక్కించిన ఈ చిత్రం కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎక్కువ సమయం సాగదీశారనిపిస్తుంది. ఇలాంటి కథలకు కోర్టు రూమ్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉండాలి. కానీ, చాలా పేలవంగా దర్శకుడు చూపించాడు. అడ్వకేట్‌గా సురేశ్ గోపి వంటి స్టార్ నటుడు ఉన్నప్పటికీ బలమైన డైలాగ్స్ చెప్పించలేకపోయాడు.
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ స్టోరీ ప్రారంభం నుంచే నెమ్మదిగా సాగుతుంది. జానకి విద్యాధరన్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా నటించింది. అయితే, ఆమె పాత్రను ఇంకా బలంగా చూపించాల్సి ఉంది. మరోవైపు జానకి కేసులో నిందితుల తరఫున వాదించేందుకు డేవిడ్ (సురేశ్ గోపి) ముందుకు రావడంతో కథలో కాస్త స్పీడ్ అందుకుంటుంది. అక్కడక్కడ జానకిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలతో ఆయన విసిగించినా ప్రేక్షకులకు నచ్చుతుంది. గర్భం దాల్చకుండానే ఆమె ఇలాంటి నేరం జరిగిందని ఆరోపణలు చేస్తుందా అనే ఫీల్ కలిగించేలా కొన్ని సీన్లు ఉంటాయి. అవి బాగానే కనెక్ట్ అవుతాయి. డేవిడ్ వంటి లాయర్ ఎంట్రీ ఇవ్వడంతో జానకి కేసును కోర్టు కొట్టివేస్తుంది.
అయితే, ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలౌతుంది. తండ్రిని కోల్పోయి ఆపై లైంగికి దాడికి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెకు సాయంగా కానిస్టేబుల్ ఫిరోజ్ (అస్కర్ అలీ) ఎంట్రీ ఇస్తాడు. అతను చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠను రేకిత్తిస్తుంది. ఆ సమయంలో కేసును వాదించేందుకు డేవిడ్ కూతురు అడ్వకేట్ నివేదిత (శృతి రామచంద్రన్) రంగంలోకి దిగుతుంది. ఫైనల్‌గా కోర్టు రూమ్ డ్రామాలో జానకికి ఎలాంటి న్యాయం జరిగింది అనేది పెద్దగా ఉత్కంఠత లేకుండానే దర్శకుడు కథ ముగిస్తాడు. కానీ, కోర్టు డ్రామా సినిమాలు చూసేవారికి తప్పకుండా ఈ చిత్రం నచ్చుతుంది. జీ5లో అందుబాటులో ఉంది. అయితే, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. త్వరలో తెలుగులో కూడా విడుదల కావచ్చు. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి చూసేయండి. ఎలాంటి అశ్లీలత లేదు.