
ఐదేళ్లలో రాష్ట్రంలో 917 శాతం పెరిగిన అబార్షన్లు
2020–21లో 1,578 అబార్షన్లు జరగ్గా.. 2024–25 నాటికి 16,059
రాష్ట్రంలో పెరుగుతున్న అబార్షన్ల తీరుపై ఆందోళన
గర్భస్రావాలకు భిన్న కారణాలు
హైదరాబాద్‌లో ఉంటున్న హరీశ్, సుష్మ దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. పెళ్లయిన ఐదేళ్లకు సుష్మ గర్భం దాల్చింది. డాక్టర్ సిఫారసు మేరకు ఐదు నెలల తరువాత స్కానింగ్ సెంటర్‌లో పరీక్షలు చేయించుకోగా, గర్భంలోని శిశువు కుడికాలులో చిన్న దోషం ఉన్నట్లు ఆధునాతన స్కానర్ ద్వారా తెలిసింది. దీంతో లోపం ఉన్న శిశువు వద్దంటూ దంపతులు అబార్షన్‌కు మొగ్గుచూపారు.
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో పెరుగుతున్న గర్భస్రా వాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యా ప్తంగా గణనీయంగా అబార్షన్లు పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో అధికారి కంగా 1,578 అబార్షన్లు జరగగా, 2024–25 నాటికి 16,059కి పెరిగాయి. అంటే ఐదేళ్లలో ఏకంగా 917 శాతం గర్భస్రావాలు పెరిగినట్లు ఇటీవల రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు.
దేశంలో 2024– 25లో 8,93,372 ఆబార్షన్లు జరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. అధికారికంగానే ఒక ఏడాదిలో దేశవ్యాప్తంగా దాదాపు 9 లక్షల అబార్షన్లు జరిగాయంటే, అనధికారికంగా గ్రామాల్లో ఆర్‌ఎంపీలు, ఇతర గుర్తింపు లేని డాక్టర్ల ద్వారా జరుగుతున్న అబార్షన్ల సంఖ్య ఎంత ఉంటుందో అంచనాకు అందని పరిస్థితి.
ఏ చిన్న వైకల్యాన్నైనా గుర్తించేలా...
గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు టిఫ్ఫా (టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ అనొమాలిస్) స్కాన్ అనే సరికొత్త సాంకేతిక పరికరం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ఈ యంత్రం ద్వారా శిశువు కడుపులో పడిన నాలుగు నెలల నుంచి ఆరు నెలల్లోపు శిశువుకు సంబంధించిన పూర్తి ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు. శిశువు మెదడు, గుండె, వెన్నుముక, పక్కటెముకలు, అంతర్గత అవయవాల గురించి ఈ యంత్రం సమగ్ర వివరాలిస్తుంది. దీంతో గర్భస్థ శిశువు ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా దంపతులు అబార్షన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఓ ప్రముఖగైనకాలజిస్టు ‘సాక్షి’కి తెలిపారు.

2017 నుంచి రికార్డులు తప్పనిసరి
గతంలో అబార్షన్ కేసులు రికార్డుల్లో ఉండేవి కావు. ఇప్పుడు హెచ్‌ఎంఐఎస్ (హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) ద్వా రా గర్భస్రావాల సమాచారం సక్రమంగా నమోదవుతోంది. 2017 లో అమల్లోకి వచ్చిన కొత్త గర్భస్రావ చట్టం కారణంగా మరింత స్పష్టమైన గణాంకాలు వెల్లడవుతున్నాయి. దీంతో కరీంనగర్, ఖమ్మం వంటి అధిక గర్భస్రావాలు జరిగే జిల్లా కేంద్రాల్లో ఇప్పు డు లెక్కలు బహిర్గతమవుతున్నాయని ఓ అధికారి తెలిపారు.
తెలంగాణలో 608 హెల్త్‌కేర్ సెంటర్లు
దేశంలో గర్భస్రావ సేవల కోసం ప్రత్యేకంగా 12,434 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో రాష్ట్రంలో 608 కేంద్రాల్లో గర్భస్రావ సేవలున్నాయి. ప్రతి సెంటర్‌కు సగటున 26 కేసులు వస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. అత్యధికంగా తమిళనాడులో 2,623 ఉండగా, ఏపీలో 833 ఉన్నాయి.
ప్రధాన కారణాలివీ..
» ఆరోగ్య సమస్యలు, జన్యుపరమైన లోపాలతోపాటు పెరుగు తున్న జీవన వ్యయాలు కూడా ప్రైవేటు ఉద్యోగులు, రైతులను గర్భవిచ్ఛిత్తి వైపు ఉసిగొల్పుతున్నట్లు ఓ నివేదిక చెబుతోంది.
» గర్భవిచ్ఛిత్తికి సమయాన్ని గర్భదారణ తరువాత 20 వారాల నుంచి 24 వారాల వరకు పొడిగిస్తూ 2021లో మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టాన్ని సవరించడం.
» అవాంఛిత గర్భధారణలు కూడా అబార్షన్‌కు ఓ కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
» గర్భస్థ శిశువు ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకునే పరిస్థితి ఇప్పటికీ ఉండటం.
» ప్రస్తుత పరిస్థితుల్లో 30 ఏళ్ల వరకు యువతీ యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. గర్భం దాల్చే యువతుల వయస్సు 30 దాటినప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా గర్భవిచ్ఛిత్తి జరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటున్నాయి. అదీగాక గర్భస్థ శిశువు ఏమాత్రం అనారోగ్యంతో ఉన్నా అబార్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
» కోవిడ్ అనంతరం ఉద్యోగ భద్రత, జీవన విధానం మార్పులతో దంపతులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలను మాత్రమే కోరుకుంటుడటం కూడా అబార్షన్లు పెరగడానికి కారణమని అంటున్నారు.
» కుటుంబ ప్రణాళిక, మహిళల ఆరోగ్య రక్షణ, సామాజిక అవగాహన వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.