Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Aarogyasri suspends services to patients due to non payment of dues1
కుప్పం నుంచి కుట్రలకు క్లాప్‌!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్‌’ (డిజిటల్‌ నెర్వ్‌ సెంటర్‌) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్‌ ద్వారా మెడికల్‌ కాలేజీల్లోని హబ్‌లతో పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది. గతంలో అందించిన టెలీ మెడిసిన్‌ సేవలకే కలరింగ్‌ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్‌ క్లినిక్స్‌కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్‌’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనా­నికి టెండర్‌ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్‌’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ‘డింక్‌’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ‘డింక్‌’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్‌ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్‌ క్లినిక్‌లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్‌ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్‌ స్క్రీనింగ్‌ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టు­లు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్‌ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్‌ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజె­క్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ‘డింక్‌’ ప్రాజెక్టు ఏమిటంటే..?‘డింక్‌’ పేరిట కుప్పంలో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్‌ హెల్త్‌ అకౌంట్‌ జారీచేసి ఈ సెంటర్‌ ద్వారా ఫోన్‌లో స్పెషలిస్ట్‌ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్‌ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్‌లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సల­హాలు, సూచనలు ఇస్తుంటారు. స్థూలంగా చెప్పాలంటే ‘డింక్‌’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్‌ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. టెలీ మెడిసిన్‌తో అంతకంటే మెరుగ్గా..గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్‌ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్‌సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియా­ట్రిక్స్‌ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్‌ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్ల సేవలు అందుబా­టులో ఉంచింది. పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యు­లను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్‌ సూచించేవారు. పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు. స్మార్ట్‌ఫోన్‌ లేనివారు, విని­యోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయప­డ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశా­వర్క­ర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్‌ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్‌ సేవలు పారదర్శకంగా అందాయి.నాడు దేశానికే ఆదర్శంగా..నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్‌ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్‌లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.ప్రివెంటివ్‌ కేర్‌ బలోపేతం.. వైఎస్‌ జగన్‌ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్‌ కేర్‌ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్‌సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు/ఒక పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు. అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ను నెలకొల్పారు.వైద్యులే ప్రజల వద్దకు..వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవే­శ­పెట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు. ఇందులో భాగంగా ఊరూ­వాడా స్పెషలిస్ట్‌ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్ర­స్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్‌ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది.

Senior Cpi Leader Suravaram Sudhakar Reddy Passed Away In Hyderabad2
సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌/మహబూబ్‌నగర్‌/ నల్లగొండ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి(83) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతోసుధాకర్‌రెడ్డి మరణించినట్లు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు. ఆయనకు భార్య విజయలక్ష్మీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్‌రెడ్డి గతంలో పార్టీలో అత్యున్నత పదవి అయిన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.నల్లగొండ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. సురవరం మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా..రెండుసార్లు ఎంపీగా సుధాకర్‌రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొండ్రావుపల్లిలో సురవరం వెంకట్రామ్‌రెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. అయితే ఆయన సొంతూరు జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని కంచుపాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.సీపీఐ అనుబంధ ఆల్‌ ఇండియా విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో ఏఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా.. 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లోనూ కర్నూలులోని డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు.అయితే 1998 (12వ లోక్‌సభ), 2004 (14 లోక్‌సభ)లో నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలో సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా, 2012లో పాటా్నలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ (కారి్మక) చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విద్యుత్‌ చార్జీల ఆందోళనలో కీలక పాత్ర 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులు పెంచగా.. దీనిపై వామపక్షాలు పెద్దయెత్తున పోరాటం నిర్వహించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళనల్లో సురవరం కీలక పాత్ర పోషించారు. ఎంపీగా పార్లమెంటులో కారి్మకులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నిరాడంబర జీవనశైలి, ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత. దేశంలో వామపక్ష శక్తుల ఐక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి ఈయనకు పెదనాన్న. మహబూబ్‌నగర్‌లో జననం..నల్లగొండతో అనుబంధం సురవరం సుధాకర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జని్మంచినా నల్లగొండతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. పార్టీ కార్యక్రమాలైనా, రాజకీయాలైనా నల్లగొండ గడ్డ నుంచే క్రియాశీలంగా వ్యవహరించారు. నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొంది సేవలందించారు. ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంగా అనేక వామపక్ష పోరాట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2024 డిసెంబర్‌లో నల్లగొండలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగసభలో పాల్గొన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా ఆయన సభలో పాల్గొని మాట్లాడారు. జాతీయ నాయకులతో కలిసి వేదికపై ప్రసంగించారు. చిరస్మరణీయుడు సురవరం సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సీపీఐ పార్టీకే, తెలంగాణకు, దేశ వామపక్ష రాజకీయ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ నేతలు నివాళులు అర్పించారు. గొప్ప నాయకుడిని కోల్పోయాం: సీఎం రేవంత్‌ సురవరం సుధాకర్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్ధంచారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుధాకర్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి జాతీయ స్థాయి నేతగా ఎదిగిప గొప్ప నాయకుడని, వామపక్ష ఉద్యమాలు, ఎన్నో ప్రజా పోరాటాల్లో పాలు పంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచి దేశ రాజకీయాల్లో తన దైన ముద్ర వేశారని కొనియాడారు. కేసీఆర్, సీపీఐ నేతల సంతాపం మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సురవరం మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ స్మరించుకున్నారు. శోకతప్తులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, నర్సింహ, కలవేణ శంకర్, మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతల సంతాపం సుధాకర్‌రెడ్డి మృతిపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. కమ్యూనిస్టు నాయకుడిగా దేశ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన సుధాకర్‌ రెడ్డి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేర్వేరు ప్రకటనల్లో ఆకాంక్షించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.

Telangana High Court Comments on Congress Govt Report on Kaleshwaram Project3
చర్చించాకే చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ సమర్పించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీంతో కమిషన్‌ నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని మంత్రిమండలి నిర్ణయించినప్పుడు.. అంతకుముందే మీడియాకు వివరాలు వెల్లడించడాన్ని తప్పుబట్టింది.పిటిషనర్లు ఆరోపిస్తున్నట్లు ఒకవేళ నివేదికను అధికారిక వెబ్‌సైట్‌ లో పెడితే వెంటనే తీసివేయాలని ఆదేశించింది. కమిషన్‌ 8బీ, 8సీ కింద నోటీసులు జారీ చేయకుండా పిటిషనర్లను నిందితులుగా చూపడం సరికాదని పేర్కొంది. పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలపై పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తదుపరి వారంలోగా సమాధాన కౌంటర్‌ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది.తదుపరి విచారణను అక్టోబర్‌ 7వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కమిషన్‌ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అమలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ మొహియుద్దీన్‌ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామ శేషాద్రినాయుడు, ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, కమిషన్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా భేటీ వెనుక దురుద్దేశం ఉందన్న పిటిషనర్లు ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై 2024, మార్చి 14న విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 6 జారీ చేసింది. పిటిషనర్లు సహా పలువుర్ని కమిషన్‌ విచారించింది. ఈ ఏడాది జూలై 31న సర్కార్‌కు నివేదిక సమర్పించింది. అయితే కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ యాక్ట్‌ 1952లోని సెక్షన్‌ 8బీ, 8సీ ప్రకారం తమ నోటీసులు జారీ చేయలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. నివేదికలోని అంశాలు తమ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని, ఈ నెల 4న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చెప్పడంతో తమ పరువుకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు.నిబంధనలు పాటించకుండా ప్రభుత్వం మీడియాకు వివరాలు వెల్లడించిందని తెలిపారు. ఈ మేరకు సెక్షన్‌ 8బీ, 8సీకి సంబంధించి కిరణ్‌ బేడీ వరెŠస్‌స్‌ కమిటీ ఆఫ్‌ ఎంక్వైరీ, స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ వర్సెస్‌ ఎల్‌కె అద్వానీ తీర్పు కాపీలను కూడా అందజేశారు. నివేదిక కాపీని తమకు అందించకుండా పదే పదే వివరాలు వెల్లడించడం ఏకపక్షం, చట్టవిరుద్ధమని.. దీని వెనుక దురుద్దేశం ఉందని.. సహజ న్యాయ సూత్రాలను సర్కార్‌ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. జీవో 6ను రద్దు చేయాలని, కమిషన్‌ నివేదిక పిటిషనర్ల పరువుకు నష్టం కలిగించేదిగా ఉందని ప్రకటించాలని కోరారు..’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అసెంబ్లీలో చర్చకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్న ఏజీ ‘కమిషన్‌ సమర్పించిన నివేదికను అధ్యయనం చేయడానికి, పరిశీలనాంశాలను మంత్రిమండలికి సమర్పించడానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శితో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని ఏజీ తెలిపారు. తమ నివేదిక సారాంశాన్ని ఈ కమిటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో పాటు మంత్రిమండలి పరిశీలనకు సమర్పించిందని చెప్పారు.కాగా కమిషన్‌ నివేదికను ఆమోదించాలని, చర్చ కోసం అసెంబ్లీ ముందుంచాలని ఈ నెల 4న కేబినెట్‌ నిర్ణయించిందని వివరించారు. అయితే అసెంబ్లీలో చర్చకు ముందే ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని గురువారం ఏజీని అడిగాం. అసెంబ్లీలో చర్చ తర్వాతే నివేదికపై తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచి్చన లిఖిత పూర్వక వివరణను ఏజీ శుక్రవారం కోర్టుకు సమర్పించారు. రిపోర్టును అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందని తెలిపారు’ అని హైకోర్టు తన ఉత్తర్వుల్లో వివరించింది. స్టే, రద్దు ఉత్తర్వులివ్వని ధర్మాసనం ‘నివేదికలోని అంశాలను మీడియాకు వెల్లడించడం ద్వారా ప్రభుత్వం పక్షపాత వైఖరితో వ్యహరించిందన్నది పిటిషనర్ల ఆరోపణ. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా నివేదిక ఉంచినట్లు పేర్కొన్నారు. కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ముందు, నివేదికను మంత్రిమండలి ఆమోదించి, చర్చ కోసం అసెంబ్లీ ముందు ఉంచాలని నిర్ణయించుకున్న తర్వాత నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. నివేదికను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినట్లయితే, దానిని తొలగించాలి. 8బీ, 8సీ కింద నోటీసులు ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి పిటిషనర్ల ప్రతిష్టను కించపరిచేలా కమిషన్‌ నివేదికలోని ఆంశాలు ఉంటే అంటే అది సరికాదు. లాగే, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని సర్కార్‌ చెబుతున్నందున పిటిషనర్లకు ‘ముందస్తు చర్యలు’ అనే భావన అవసరం లేదు. నివేదికపై స్టే ఇస్తూ, రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయవలసిన అవసరం లేదు. కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చట్టం వీలు కల్పిస్తుంది. అక్కడ దానిని చర్చించాలి. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. మూడు వారాలు సమయం ఇస్తున్నాం..’ అని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

Rasi Phalalu: Daily Horoscope On 23-08-2025 In Telugu4
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: అమావాస్య ప.11.18 వరకు, తదుపరి భాద్రపద శుద్ధ పాడ్యమి, నక్షత్రం: మఖ రా.1.32 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.1.21 నుండి 2.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.42 నుండి 7.27 వరకు, అమృత ఘడియలు: రా.11.14 నుండి 12.50 వరకు, పోలాల అమావాస్య.సూర్యోదయం : 5.47సూర్యాస్తమయం : 6.19రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.వృషభం: కొత్త రుణయత్నాలు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.మిథునం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత ఉంటుంది.కర్కాటకం: ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమకు ఫలితం అంతంత మాత్రమే. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.సింహం: నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు.కన్య: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. సోదరులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ప్రయాణాలు వాయిదా.తుల: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.వృశ్చికం: పనులలో మరింత పురోగతి. ఆస్తి విషయంలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.మకరం: సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.కుంభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. పురస్కారాలు అందుతాయి.

The Constitution Amendment Bill was recently introduced in the Lok Sabha5
ప్రభుత్వాలను దించే ఆయుధమా?

రాజ్యాంగంలోని 75, 164, 239ఎఎ అధికరణలకు సవరణలను ప్రతిపాదిస్తూ రాజ్యాంగ (130వ) సవరణ బిల్లును ఇటీవల లోక్‌ సభలో ప్రవేశపెట్టారు. దానిని కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్ము–కశ్మీర్‌కు వర్తింపజేసే విధంగారెండు అనుబంధ బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. మూడింట రెండొంతుల మెజారిటీ ప్రభుత్వానికి కొరవడినందు వల్ల ఈ ప్రతిపాదనలు చట్ట రూపం ధరించకపోవచ్చు. అయినప్పటికీ, వాటి వెనుక ఆలోచన గమనార్హమైనది. ప్రధాని లేదా ముఖ్యమంత్రితో సహా ఏ కేంద్ర లేదా రాష్ట్రమంత్రి అయినా ఐదేళ్ళు లేదా అంతకు మించి శిక్షపడగల ఆరోపణ లను ఎదుర్కొంటూ అరెస్టు అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే సదరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే, వారు ఆయా పదవుల నుంచి ఆటోమేటిక్‌గా వైదొలగినట్లు పరిగణి స్తారన్నది సవరణ మూల సారాంశం. బిల్లును సమర్థించుకునేందుకు చెబుతున్న ఆశయాలు గొప్పవిగానే ఉన్నాయి. అవి: రాజ్యాంగ నైతిక తను కాపాడటం, ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం, ఉన్నత పద వుల్లో ఉన్నవారు తాము చట్టానికి అతీతులమనే భావనకు లోను కాకుండా చూడటం. కానీ, ఉన్నతాశయాలు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఫలితాలనే ఇస్తాయనే పూచీ ఏమీ లేదు. రాజకీయాలలో వ్యూహం తరచు నైతికతను పక్కకు నెడుతున్న పరిస్థితుల్లో ఈ రాజ్యాంగ సవరణ ఆయుధంగా పరిణమించవచ్చు. పరిశుద్ధ రాజకీయాలపై వాగ్దానమేనా?మంత్రులు నిజాయతీకి ప్రతీకలుగా ఉండి తీరాలనీ, వారు కస్టడీలో ఉన్నపుడు పరిపాలనకు భంగం కలుగకుండా నివారించ వలసి ఉందనీ ఈ బిల్లును తేవడంలోని లక్ష్యాలు, కారణాలపత్రంలో పేర్కొన్నారు. రాజకీయ వాస్తవికత ముందు ఈ నైతిక విజ్ఞాపన తేలిపోవచ్చు. అరెస్టయి, కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరూ దోషి కారు. అధికారంలో ఉన్నవారికి జీ హుజూర్‌ అనే పోలీసు వ్యవస్థ ఉన్న ప్రజాస్వామ్యంలో నిజాన్ని రాబట్టడానికి, వేధించడానికి మధ్య నున్న రేఖ బహు పల్చనైనది. ఈ సవరణ, అరెస్టు చేసేందుకు ఉన్న అవకాశాలను తక్కువ చేసే బదులు, అరెస్టు చేయడానికి మరిన్ని అవకాశాలను సృష్టించేలా ఉంది. దీనిలో కొట్టొచ్చినట్లు కనిపించే అంశం 30 రోజుల వ్యవధి. ఒక మంత్రి 30 రోజులకు మించి నిర్బంధంలో ఉంటే రాజీనామా చేసి తీరాలి. ఆచరణలో, ప్రభుత్వాన్ని మార్చేందుకు రాజ్యాంగం ప్రసా దించిన ‘కూల్చివేత ఆయుధం’గా ఇది ఉపకరించవచ్చు. ప్రతిపక్షా నికి చెందిన ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు అనుకుందాం. పోలింగ్‌కు ఒక నెల ముందు పన్నాగంతో చేయించిన అరెస్టుతో అతని పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ప్రభుత్వాలనుదించడానికి బ్యాలట్‌ కన్నా లాకప్‌ ఒక మార్గంగా మారుతుంది. వ్యవస్థలు రాజకీయమయంఈ నిబంధన తటస్థంగా ఉండవలసిన వ్యవస్థలను అనివార్యంగా రాజకీయమయం చేస్తుంది. ఇప్పటికే రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయేవారిగానున్న పోలీసు అధికారులు తాము ఒక ముఖ్య మంత్రిని అరెస్టు చేస్తే అతను లేదా ఆమె ప్రభుత్వం కూలిపోవచ్చని గ్రహించుకుంటారు. బెయిలు దరఖాస్తులను నిర్ణయించే జడ్జీలు ఎవరు పాలించారో నిర్ణయించే శక్తిమంతులుగా మారతారు. బెయిలు సంపాదించి పెట్టడంలో వ్యూహాత్మక మాయోపాయాలకు పాల్పడే యుక్తిపరులైన న్యాయవాదులు భారీ ప్రయోజనాలుపణంగా పెట్టే రాజకీయ పోరాటంలో ముఖ్యమైన పాత్రధారులుగా మారతారు. చట్టాలను అమలుపరచవలసిన వ్యవస్థలకూ, రాజకీయ ఇంజనీరింగ్‌కూ మధ్య రేఖ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. పాకిస్తాన్‌ నేర్పుతున్న పాఠాలులీగల్‌ సాధనాలు ప్రజాస్వామ్యాన్ని ఎలా డొల్ల చేయగలవో తెలుసుకునేందుకు పాకిస్తాన్‌ ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయ ప్రేరేపి తమైనవిగా చాలా మంది భావించిన ఆరోపణలపై సుప్రీం కోర్టు 2017లో నవాజ్‌ షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటించింది. ఆయన తొల గింపు ప్రజాస్వామిక ప్రక్రియలను అస్థిరపరచి, ఎన్నిక కాని పాత్ర ధారులను బలోపేతులను చేసింది. ఒకప్పుడు పాకిస్తాన్‌ అసలైన పాలక వ్యవస్థకు ప్రీతిపాత్రుడుగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ అనర్హుడుగా ప్రకటితుడై ఇపుడు జైలులో మగ్గు తున్నారు. ఓటర్లలో ఇమ్రాన్‌ ఖాన్‌కు ఉన్న ప్రజాదరణ జుడీషియల్‌ మాయోపాయాల నుంచి ఆయనను కాపాడలేకపోయింది. నైతికత ముసుగు కప్పుకున్న చట్టాలు అనర్హత వేటు వేసేందుకు, చట్టబద్ధ తను తొలగించడానికి సాధనాలుగా ఎలా ఉపయోగపడగలవో ఆ రెండు కేసులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వాల మార్పులో కోర్టులు కూడా ఒక పావుగా మారిపోబట్టే పాకిస్తాన్‌లో ప్రజా స్వామ్యం బలహీనపడింది. అదే దారిని రాజ్యాంగంలో చొప్పించే ప్రమాదంలో ఇపుడు భారతదేశం ఉంది. వ్యాధికన్నా దుర్భరమైన వైద్యంసుదీర్ఘ కాలం కస్టడీలో ఉన్న మంత్రి విధులను నిర్వర్తించలేడని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు. అది నిజమే. కానీ, దానికి విరుగుడులు ఇప్పటికే ఉన్నాయి. మంత్రిత్వ శాఖలను ఒకరి నుంచి మరొకరికి మార్చవచ్చు. తాత్కాలిక అధిపతులను నియమించ వచ్చు. కస్టడీలో ఉన్న నాయకునికి మద్దతు కొనసాగించాలో వద్దో చట్ట సభలు నిర్ణయించుకుంటాయి. ఈ ప్రక్రియలను పక్కనపెట్టేసి, ఒక నిర్దిష్ట గడువును విధించడం ద్వారా, ఈ సవరణ నియమాని కన్నా అవసరానికి పెద్ద పీట వేస్తోంది. అరెస్టు అయిన వ్యక్తి నిర్దోషి కూడా కావచ్చుననే సూత్రానికి నీళ్ళు వదులుతోంది. ప్రతి సవరణ ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ఈ రోజున మంత్రులను 30 రోజులు కాగానే పదవుల నుంచి తొలగిస్తే, రేపు 15 రోజులు కాగానే, శాసన సభ్యులను లేదా పార్లమెంట్‌ సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. రాజకీయాలను ప్రక్షాళన చేసే ప్రయత్నం కాస్తా, అరెస్టును రాజకీయాల్లో సర్వ సాధారణమైనదిగా రూపొందించవచ్చు. నాయకత్వం బ్యాలెట్‌ ద్వారా కాకుండా పోలీసు స్టేషన్లు, కోర్టులలో నిర్ణయమవుతుందని పౌరులు భావించడం ప్రారంభిస్తారు. ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని ఉద్దేశించారు కానీ, ప్రత్యర్థులను దునుమాడే కత్తులను సమకూర్చడానికి కాదు. 130వ సవరణ బిల్లు అభిమతం మంచిదే కానీ, అది అరెస్టులను ప్రోత్సహించేదిగా, సంకుచిత రాజకీయాలకు ధైర్యం కల్పించేదిగా, న్యాయవ్యవస్థను కూడా రాజకీయమయం చేసే ప్రమాదాలను కొనితెచ్చేదిగా ఉంది. అంతిమంగా, పాలకుడు అంటే, పోలీసు అధికారో లేదా మేజిస్ట్రేటో కాదు, ఓటరు. ఎవరు అధికారంలోఉండాలో ఎవరు వైదొలగాలో ఓటరు మాత్రమే నిర్ణయించాలి.-వ్యాసకర్త సుప్రీం కోర్టు న్యాయవాది(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)- సంజయ్‌ హెగ్డే

Heavy rains expected again in Mumbai6
ముంబై చేస్తున్న హెచ్చరిక!

ప్రణాళికాబద్ధంగా లేని పట్టణీకరణను పరిహసిస్తూ తరచు ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడుతున్నా పాలకులు మేల్కొనటం లేదనటానికి మళ్లీ నీట మునిగిన ముంబై మహానగరమే సాక్ష్యం. ముంబై దక్షిణ ప్రాంతంలో గురువారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 300 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతంలో 200 మి.మీ. వర్షం కురిసిందంటే కుంభవృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నిన్నంతా దాదాపు ప్రశాంతంగానే ఉన్నట్టు కనబడిన ఆ మహానగరం, మళ్లీ భారీ వర్షాలుంటాయన్న హెచ్చ రికలతో బెంబేలెత్తుతోంది. ఏటా వర్షాకాలంలో కనీసం ఒక్కసారైనా వరదలు ముంబైని పలకరించటం ఆనవాయితీ. ఈసారి మే నెలలోనే ఒక రోజు నడుంలోతు వరదల్లో నగరం నానా యాతనలూ పడింది. ఆ నెలలో కొత్తగా ప్రారంభమైన వొర్లి మెట్రో స్టేషన్‌ భారీ వరదతో వణికిపోయింది. రెండు నెలలు గడిచాయో లేదో మళ్లీ నగరానికి కుంభవృష్టి తప్పలేదు. నిరుడు 21 దఫాలు 100 మి.మీ. వర్షం పడిందని గణాంకాలు చెబుతు న్నాయి. వాతావరణంలో పెనుమార్పులు విపత్తుల తీవ్రతను పెంచాయి. అస్తవ్యస్థ పట్టణీకరణ ఈ సమస్యను వందల రెట్లు పెంచింది. ఈసారి వర్షాలవల్ల సంపన్నులు, సినీతారలు నివసించే ప్రాంతాలు సైతం వరద నీటన మునిగాయి. ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించిన మోనోరైల్‌ సైతం భారీ వర్షాలతో విద్యుత్‌ సరఫరా అందక గంటసేపు నిలిచిపోయింది. చివరకు అద్దాలు బద్దలుకొట్టి వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ముంబై తూర్పు శివారులోని మీథి నది ఆ మహానగరంపై విరుచుకుపడింది. అయిదు రోజులపాటు వరసగా కురిసిన వర్షాలతో ఆ నది కట్టు తెంచుకుని అటువైపుగల రైల్వే ట్రాక్‌లన్నిటినీ ముంచెత్తింది. అరేబియా సముద్రం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా ఉండటంతో దానిలో కలవాల్సిన మీథి వరద నీరు కాస్తా వెనక్కొచ్చి నగరంలోని అనేక ప్రాంతాలను జలమయం చేసింది. హైదరాబాద్‌ నగరంలో మూసీ మాదిరిగా ముంబైలో మీథి నదిని కూడా మురికిమయం చేశారు. అందులో 70 శాతం మురికినీరు కాగా, 30 శాతం చెత్తాచెదారం, 10 శాతం పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యా లుగా కనబడు తున్నవన్నీ సారాంశంలో మానవ తప్పిదాల పర్యవసానం. గత యేభైయ్యే ళ్లుగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవటమే తప్ప అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినవారు లేరు. అలాగని మీథి నది ప్రక్షాళనకు ప్రయత్నాలు జరగ లేదని కాదు. 2013–23 మధ్య బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) రూ. 2,000 కోట్లు వ్యయం చేసింది. కానీ చివరకు తాజా వర్షాల ధాటికి మురికి నీటితో, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నివాస ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 70వ దశకం వరకూ పరిశుభ్రంగా ఉండే ఆ నది మురికి కూపంగా మారిందంటే పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం.భౌగోళికంగా ముంబై తీరం పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉంది. వాటివల్ల నైరుతి రుతుపవనాల్లో గాలుల తీవ్రత హెచ్చుగా ఉంటుంది. అందుకే ఏటా భారీవర్షాలు, వరదలు తప్పవు. దేశ ఆర్థిక రాజధానిగా, ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల నగరంగా ముంబై మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైనది. దేశ జీడీపీలో ఆ నగరం వాటా దాదాపు 7 శాతం. కానీ వరదలు ముంచుకొచ్చిన ప్రతిసారీ మౌలిక సదుపాయాలు దెబ్బతినటం, ఉత్పాదకత పడకేయటం రివాజైంది. పునర్నిర్మాణానికి ఏటా రూ. 550 కోట్ల వ్యయమవుతోంది. నిజానికి ఈ సంక్షోభం అక్కడే కాదు... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాలకులనూ పునరాలోచనకు పురిగొల్పాలి. నగర నిర్మాణాల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో, పెద్ద నగరాల నిర్మాణంపై మోజువల్ల చివరకు జరిగేదేమిటో గ్రహించేలా చేయాలి. కానీ అదెక్కడా కనబడదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి తాజా వర్షాలకు ఎంత దయనీయ స్థితిలో పడిందో కనబడుతూనే ఉంది. పెద్ద నగరాల నిర్మాణంవల్ల జనసాంద్రత పెరిగి మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతుందనీ, పైగా అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించటం వల్ల ఇతర ప్రాంతాలు ఎప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తలకెక్కటం లేదు. మన కోసం ప్రకృతి మారదు. మనమే దానికి అనుగుణంగా మారాలన్న స్పృహ పాలకులకు కలగాలి. మళ్లీ మళ్లీ మునుగుతున్న ముంబై మహానగరాన్ని చూసైనా గుణపాఠం నేర్వకపోతే భవిష్యత్తు క్షమించదు.

Famine declared in Gaza City7
మరణం అంచున గాజా 

గాజా స్ట్రిప్‌: రెండేళ్ల యాజన్‌.. గాజా నగరంలోని బీచ్‌లో ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్నాడు. ఆ శిబిరానికి రెండు నెలలుగా పిండే కాదు.. ఎలాంటి ఆహార సహాయం అందడం లేదు. విశాలమైన అతని కళ్లు.. ఆహారం కోసం ఎదురుచూసి.. చూసి.. అలసటతో బరువెక్కాయి. ఎముకలు తేలిన శరీరం అతని ఆకలిని చెబుతోంది. ఏడవడానికి కాదు కదా.. చివరికి తిండి తినడానికి కూడా ఓపికలేక.. చిరిగిపోయిన పరుపుపై జీవచ్ఛవంలా కూర్చున్నాడు. ఇది ఒక్క యాజన్‌ స్థితి కాదు.. గాజా స్ట్రిప్‌లోని పిల్లలందరి సామూహిక దుంఖః. ప్రస్తుతం గాజాలో పోషకాహార లోపం వేగంగా వ్యాపిస్తోంది. గాజా నగరంలో ఆకలి మరణాలు ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. ప్రస్తుతం గాజాలో 5లక్షల మంది తీవ్రమైన కరువును ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సిండీ మెక్‌ కెయిన్‌ హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో అధికారికంగా కరువు నిర్ధారించడం ఇదే మొదటిసారి. రాబోయే రోజుల్లో ఇది గాజా గవర్నరేట్‌ నుంచి డెయిర్‌ అల్‌ బలాహ్, ఖాన్‌ యూనిస్‌కు వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ‘రోజుల తరబడి తినడానికి ఏమీ లేక లక్షలాది మంది బతుకీడిస్తున్నారు. పోషకాహార లోపం స్థాయి వేగంగా పెరుగుతోంది. ఆకలి మరణాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో తక్షణ, పూర్తి స్థాయి మానవతా సాయం అవసరమని ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నొక్కి చెప్పాయి. కరువును ఎలాగైనా ఆపాలని ఆమె పిలుపునిచ్చారు. ఆ ప్రజల ప్రాణాలు కాపడేందుకు అడ్డంకులు లేని మానవతా సహాయం, తక్షణ కాల్పుల విరమణ అవసరమని సూచించారు. లేని పక్షంలో సెప్టెంబర్‌ చివరి నాటికి, గాజా స్ట్రిప్‌ అంతటా దాదాపు 7 లక్షల మంది కరువును ఎదుర్కొంటారని ఆమె హెచ్చరించారు. ప్రాణాంతకంగా మారిన పోషకాహార లోపం రెండు సంవత్సరాల సంఘర్షణ ప్రజలను పదేపదే నిరాశ్రయులను చేస్తే.. మానవతా సాయంపై ఆంక్షలు ప్రజలను ఆకలిలోకి నెట్టాయి. ఇక్కడ ఆహారం దొరకడం లేదు. జూలై, మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ఇక గాజా నగరంలో మూడు రెట్లు ఎక్కువైంది. ప్రతి ముగ్గురిలో ఒకరికి రోజుల తరబడి ఆహారం దొరకడం లేదు. దొరికిన కొద్ది మొత్తంతో పిల్లల కడుపు నింపి, పెద్దలు పస్తులుంటున్నారు. పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది. నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అది అత్యంత ప్రాణాంతకం. జూన్‌ 2026 చివరి నాటికి పోషకాహార లోపం వల్ల మరణించే ప్రమాదం ఉన్న పిల్లల సంఖ్య 14,100 నుంచి 43,400 కు అంటే మూడు రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 98 శాతం పంట భూములు దెబ్బతిన్నాయి. వ్యవసాయం లేదు. ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. జూలై నుంచి గాజాలోకి వచ్చే ఆహారం, సహాయ సామగ్రి పెరిగింది. కానీ.. అవసరంతో పోలిస్తే అది చాలా తక్కువ. సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు. వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించొచ్చు. మనుషులు సృష్టించిన కరువు అయితే ఈ కరువు మనుషులు సృష్టించిందని, అవకాశం ఉన్నా నివారించలేకపోవడం వెంటాడే విషయమని ఐక్యరాజ్యసమితి సహాయ అధిపతి టామ్‌ ఫ్లెచర్‌ అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇజ్రాయెల్‌ విధిస్తున్న అడ్డంకుల కారణంగా పాలస్తీనా భూభాగానికి ఆహారం చేరుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మమ్మల్ని అనుమతిస్తే మనం నివారించగలిగే కరువు ఇది. ఇజ్రాయెల్‌ అడ్డంకుల కారణంగానే సరిహద్దుల వద్ద ఆహారం నిల్వలు నిలిచిపోయాయి’ అని తెలిపారు.

DSC 2025 merit lists released8
డీఎస్సీ–2025 మెరిట్‌ లిస్టుల విడుదల

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ–2025 మెరిట్‌ జాబితాలను శుక్రవారం అర్ధరాత్రి ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జోన్, జిల్లా స్థాయిలో అన్ని సబ్జెక్టుల వారీగా మెరిట్‌ లిస్టులను ప్రకటించింది. వీటిని డీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ (http;//apdrc.apcfrr.in/లోనూ, సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచామని డీఎస్సీ–2025 కన్వినర్‌ ఎంవీ కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీ పోస్టులకు సంబంధించి జోన్‌ ఆఫ్‌ కన్సిడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత డీఎస్సీ లాగిన్‌ ఐడీల ద్వారా కాల్‌ లెటర్లు అందిస్తామన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో సూచనలను అనుసరించాలని ఆయన పేర్కొన్నారు. సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు తాజాగా తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్‌ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. అంతకుముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, టైముకి సర్టిఫికెట్ల పరిశీలనకు వ్యక్తిగతంగా హాజరుకావాలి. హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దుచేస్తారు. మెరిట్‌ లిస్టులో తదుపరి ఉన్న అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలకులు పిలుస్తారు. ఇక సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చినంత మాత్రాన అభ్యర్థులు ఎంపిక అయినట్లు కాదని డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి స్పష్టంచేశారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్, అర్హత, సంబంధిత నియమ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని స్పష్టంచేశారు. ఇక రాష్ట్రస్థాయి పోస్టులైన ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు రాష్ట్రస్థాయి, జోనల్‌ స్థాయిలో ర్యాంకులను ప్రకటించగా.. స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌జీటీలకు ఉమ్మడి జిల్లాల వారీగా ర్యాంకులు, స్కోర్‌ను విడుదల చేశారు. పీజీటీ రాష్ట్ర టాపర్లు వీరే.. ఇంగ్లిష్‌ : వారణాశి లక్ష్మీ స్వరూప (87 స్కోరు) హిందీ : రమేష్‌ రామనుకొలను (93.5 స్కోరు) సంస్కృతం: తునికిపాటి భాను (94 స్కోరు) తెలుగు: పట్నాన ధర్మారావు (85.5 స్కోరు ) బయాలజీ (ఇంగ్లిష్‌ మీడియం): చోడవరం శివకుమార్‌ (81.5 స్కోరు) గణితం (ఇంగ్లిష్‌ మీడియం): సంకరణం విజయ్‌ (78.5 స్కోరు) ఫిజిక్స్‌ (ఇంగ్లిష్‌ మీడియం): బాలకిశోర్‌ కురాకుల (74.5 స్కోరు) సోషల్‌ స్టడీస్‌ (ఇంగ్లిష్‌ మీడియం): నిరోషా కురమాన (85 స్కోరు) ప్రిన్సిపాల్‌: చింతల గౌతమ్‌ (75.5 స్కోరు) పీఈటీ రాష్ట్ర ర్యాంకర్లు.. అన్నెపు జగదీశ్వరరావు: 90.5 స్కోరు టీజీటీ ఇంగ్లిష్.. వెలగల రమ్యశ్రీ : 85.43 స్కోరు టీజీటీ హిందీ.. గొల్లపల్లి పవన్‌ నారాయణ్‌ కౌశిక్‌ శాస్త్రి: 88.53 స్కోరు టీజీటీ సంస్కృతం.. తునికిపాటి భాను: 93.60 స్కోరు టీజీటీ తెలుగు.. కల్లె మహేశ్‌బాబు: 85.20 స్కోరు టీజీటీ మ్యాథ్స్‌.. సుంకరణం విజయ్‌: 87.33 స్కోరు టీజీటీ సైన్స్‌.. బోకం అనిత: 77.89 స్కోరు టీజీటీ సోషల్‌ స్టడీస్‌.. బొమ్మిడి డిల్లేశ్‌: 84.20

Amit Shah accuses Opposition VP candidate Sudershan Reddy of helping Naxalism9
ఆయన నక్సలైట్ల మద్దతుదారుడు 

కొచ్చి/తిరునల్వేలి: నక్సలైట్లకు గట్టి మద్దతుదారుడైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిని విపక్ష ‘ఇండియా’ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తప్పుపట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లపై పోరాటానికి గిరిజన యువకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సల్వాజుడుం’ చట్టవ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటూ 2011లో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం కేరళలో ఓ కార్యక్రమంలో అమిత్‌ షా మాట్లాడారు. నక్సలైట్ల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి సుప్రీంకోర్టును జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి వాడుకున్నారని ఆరోపించారు. ఆయన ఆ తీర్పు ఇవ్వకుంటే, సల్వాజుడుం అమల్లో ఉంటే నక్సలైట్ల ఉద్యమం 2020 నాటికే అంతమయ్యేదని అన్నారు. నక్సలైట్ల సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి సల్వాజుడుంకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని మండిపడ్డారు. వామపక్షాల ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌ పార్టీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ఎంపిక చేసుకుందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌ రాజీనామా చేసి ఉంటే... ఢిల్లీ మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జైల్లో ఉండగానే పదవికి రాజీనామా చేసి ఉంటే.. రాజ్యాంగ(130 సవరణ) బిల్లు–2025ను తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని అమిత్‌ షా అన్నారు. 30 రోజులపాటు జైల్లో ఉన్న వారిని పదవుల నుంచి తొలగించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను అన్ని రాజకీయ పారీ్టలూ పాటించాలని సూచించారు. ఏ ముఖ్యమంత్రి అయినా జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడపాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. జైల్లో ఉంటూ కూడా పరిపాలన సాగిస్తారని మన రాజ్యాంగ రూపకర్తలు ఊహించలేదని, అందుకే ఈ అంశాన్ని రాజ్యాంగంలోని చేర్చలేదని స్పష్టంచేశారు. జైల్లో ఉన్న నేతలను పదవుల నుంచి తొలగించడంలో తప్పేమీ లేదన్నారు. సోనియా, స్టాలిన్‌ కలలు నెరవేరవు రాజ్యాంగ(130 సవరణ) బిల్లును ‘నల్ల బిల్లు’ అనే హక్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేదని అమిత్‌ షా తేల్చిచెప్పారు. శుక్రవారం తమిళనాడులోని తిరునల్వేలిలో బీజేపీ బూత్‌ కమిటీల సమావేశంలో ప్రసంగించారు. చీకటి పనులు చేసిన చరిత్ర స్టాలిన్‌కు ఉందన్నారు. డీఎంకే ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. స్టాలిన్‌ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. కుమారుడు రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవడం సోనియా గాంధీ ఎజెండా, కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవడం స్టాలిన్‌ ఎజెండా అని దుయ్యబట్టారు. వారి కలలు నెరవేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్‌ కలాంను అప్పట్లో రాష్ట్రపతిని చేసింది, నేడు అదే తమిళనాడు బిడ్డ సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది ఎన్డీయే ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు.

Chinnaswamy Stadium denied permission for Womens ODI World Cup matches10
చిన్నస్వామిలో క్రికెట్‌ బంద్‌!

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ వేదికల జాబితా నుంచి బెంగళూరును తొలగించారు. ఇక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియానికి తరలించారు. టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న భారత్, శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 30న తొలి మ్యాచ్‌తో పాటు మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణకు బెంగళూరు పోలీసుల నుంచి అనుమతి పొందడంలో కర్నాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం (కేఎస్‌సీఏ) విఫలమైంది. ఐపీఎల్‌–2025లో విజేతగా నిలిచిన అనంతరం జూన్‌ 4న ఇక్కడ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) నిర్వహించిన సంబరాల్లో ప్రమాదవశాత్తూ 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన దర్యాప్తులో ఆర్‌సీబీ యాజమాన్యాన్ని, కేఎస్‌సీఏను తప్పు పట్టిన కమిటీ... చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌లు నిర్వహించేదుకు సురక్షితం కాదని తేల్చింది. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అధికారులు ఈ స్టేడియానికి విద్యుత్‌ సరఫరాను కూడా నిలిపివేశారు. ఇలాంటి స్థితిలో వరల్డ్‌ కప్‌ కోసం అనుమతి సాధించడం అసాధ్యంగా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కేఎస్‌సీఏ హామీ ఇచ్చినా పోలీసులు స్పందించలేదు. ఇదే కారణంతో ఇంతకు ముందే అసోసియేషన్‌ తమ ఫ్రాంచైజీ టోర్నీ మహరాజా ట్రోఫీని బెంగళూరు నుంచి మైసూరుకు తరలించింది. తాజా పరిణామాలన్నీ ఐసీసీ మ్యాచ్‌ల నిర్వహణా నిబంధనలకు ప్రతికూలంగా ఉండటంతో బెంగళూరు నుంచి మ్యాచ్‌లు తరలించాల్సి వచ్చింది. బెంగళూరులో సాధ్యం కాకపోతే తాము తిరువనంతపురంలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని కేరళ సంఘం ముందుకు వచ్చినా... అక్కడి నుంచి ప్రధాన నగరాలకు తగినన్ని ఫ్లయిట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టారు. డీవై పాటిల్‌ స్టేడియంలో సెమీఫైనల్‌తో పాటు పాక్‌ అర్హత సాధించకపోతే ఫైనల్‌ను కూడా నిర్వహిస్తారు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి నవీ ముంబైతో పాటు విశాఖపట్నం, గువహటి, ఇండోర్, కొలంబో ఆతిథ్యం ఇస్తాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement