
రాజ్యాంగంలోని 75, 164, 239ఎఎ అధికరణలకు సవరణలను ప్రతిపాదిస్తూ రాజ్యాంగ (130వ) సవరణ బిల్లును ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టారు. దానిని కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్ము–కశ్మీర్‌కు వర్తింపజేసే విధంగారెండు అనుబంధ బిల్లులను కూడా ప్రవేశపెట్టారు. మూడింట రెండొంతుల మెజారిటీ ప్రభుత్వానికి కొరవడినందు వల్ల ఈ ప్రతిపాదనలు చట్ట రూపం ధరించకపోవచ్చు. అయినప్పటికీ, వాటి వెనుక ఆలోచన గమనార్హమైనది. ప్రధాని లేదా ముఖ్యమంత్రితో సహా ఏ కేంద్ర లేదా రాష్ట్రమంత్రి అయినా ఐదేళ్ళు లేదా అంతకు మించి శిక్షపడగల ఆరోపణ లను ఎదుర్కొంటూ అరెస్టు అయి, వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే సదరు మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి.
లేకపోతే, వారు ఆయా పదవుల నుంచి ఆటోమేటిక్‌గా వైదొలగినట్లు పరిగణి స్తారన్నది సవరణ మూల సారాంశం. బిల్లును సమర్థించుకునేందుకు చెబుతున్న ఆశయాలు గొప్పవిగానే ఉన్నాయి. అవి: రాజ్యాంగ నైతిక తను కాపాడటం, ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం, ఉన్నత పద వుల్లో ఉన్నవారు తాము చట్టానికి అతీతులమనే భావనకు లోను కాకుండా చూడటం. కానీ, ఉన్నతాశయాలు ఎల్లప్పుడూ ఉన్నతమైన ఫలితాలనే ఇస్తాయనే పూచీ ఏమీ లేదు. రాజకీయాలలో వ్యూహం తరచు నైతికతను పక్కకు నెడుతున్న పరిస్థితుల్లో ఈ రాజ్యాంగ సవరణ ఆయుధంగా పరిణమించవచ్చు.
పరిశుద్ధ రాజకీయాలపై వాగ్దానమేనా?
మంత్రులు నిజాయతీకి ప్రతీకలుగా ఉండి తీరాలనీ, వారు కస్టడీలో ఉన్నపుడు పరిపాలనకు భంగం కలుగకుండా నివారించ వలసి ఉందనీ ఈ బిల్లును తేవడంలోని లక్ష్యాలు, కారణాలపత్రంలో పేర్కొన్నారు. రాజకీయ వాస్తవికత ముందు ఈ నైతిక విజ్ఞాపన తేలిపోవచ్చు. అరెస్టయి, కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరూ దోషి కారు. అధికారంలో ఉన్నవారికి జీ హుజూర్ అనే పోలీసు వ్యవస్థ ఉన్న ప్రజాస్వామ్యంలో నిజాన్ని రాబట్టడానికి, వేధించడానికి మధ్య నున్న రేఖ బహు పల్చనైనది. ఈ సవరణ, అరెస్టు చేసేందుకు ఉన్న అవకాశాలను తక్కువ చేసే బదులు, అరెస్టు చేయడానికి మరిన్ని అవకాశాలను సృష్టించేలా ఉంది.
దీనిలో కొట్టొచ్చినట్లు కనిపించే అంశం 30 రోజుల వ్యవధి. ఒక మంత్రి 30 రోజులకు మించి నిర్బంధంలో ఉంటే రాజీనామా చేసి తీరాలి. ఆచరణలో, ప్రభుత్వాన్ని మార్చేందుకు రాజ్యాంగం ప్రసా దించిన ‘కూల్చివేత ఆయుధం’గా ఇది ఉపకరించవచ్చు. ప్రతిపక్షా నికి చెందిన ఒక ముఖ్యమంత్రి ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు అనుకుందాం. పోలింగ్‌కు ఒక నెల ముందు పన్నాగంతో చేయించిన అరెస్టుతో అతని పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ప్రభుత్వాలనుదించడానికి బ్యాలట్ కన్నా లాకప్ ఒక మార్గంగా మారుతుంది.
వ్యవస్థలు రాజకీయమయం
ఈ నిబంధన తటస్థంగా ఉండవలసిన వ్యవస్థలను అనివార్యంగా రాజకీయమయం చేస్తుంది. ఇప్పటికే రాజకీయ ఒత్తిడులకు లొంగిపోయేవారిగానున్న పోలీసు అధికారులు తాము ఒక ముఖ్య మంత్రిని అరెస్టు చేస్తే అతను లేదా ఆమె ప్రభుత్వం కూలిపోవచ్చని గ్రహించుకుంటారు. బెయిలు దరఖాస్తులను నిర్ణయించే జడ్జీలు ఎవరు పాలించారో నిర్ణయించే శక్తిమంతులుగా మారతారు. బెయిలు సంపాదించి పెట్టడంలో వ్యూహాత్మక మాయోపాయాలకు పాల్పడే యుక్తిపరులైన న్యాయవాదులు భారీ ప్రయోజనాలుపణంగా పెట్టే రాజకీయ పోరాటంలో ముఖ్యమైన పాత్రధారులుగా మారతారు. చట్టాలను అమలుపరచవలసిన వ్యవస్థలకూ, రాజకీయ ఇంజనీరింగ్‌కూ మధ్య రేఖ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది.
పాకిస్తాన్ నేర్పుతున్న పాఠాలు
లీగల్ సాధనాలు ప్రజాస్వామ్యాన్ని ఎలా డొల్ల చేయగలవో తెలుసుకునేందుకు పాకిస్తాన్ ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయ ప్రేరేపి తమైనవిగా చాలా మంది భావించిన ఆరోపణలపై సుప్రీం కోర్టు 2017లో నవాజ్ షరీఫ్‌ను అనర్హుడిగా ప్రకటించింది. ఆయన తొల గింపు ప్రజాస్వామిక ప్రక్రియలను అస్థిరపరచి, ఎన్నిక కాని పాత్ర ధారులను బలోపేతులను చేసింది.
ఒకప్పుడు పాకిస్తాన్ అసలైన పాలక వ్యవస్థకు ప్రీతిపాత్రుడుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ అనర్హుడుగా ప్రకటితుడై ఇపుడు జైలులో మగ్గు తున్నారు. ఓటర్లలో ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న ప్రజాదరణ జుడీషియల్ మాయోపాయాల నుంచి ఆయనను కాపాడలేకపోయింది. నైతికత ముసుగు కప్పుకున్న చట్టాలు అనర్హత వేటు వేసేందుకు, చట్టబద్ధ తను తొలగించడానికి సాధనాలుగా ఎలా ఉపయోగపడగలవో ఆ రెండు కేసులు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రభుత్వాల మార్పులో కోర్టులు కూడా ఒక పావుగా మారిపోబట్టే పాకిస్తాన్‌లో ప్రజా స్వామ్యం బలహీనపడింది. అదే దారిని రాజ్యాంగంలో చొప్పించే ప్రమాదంలో ఇపుడు భారతదేశం ఉంది.
వ్యాధికన్నా దుర్భరమైన వైద్యం
సుదీర్ఘ కాలం కస్టడీలో ఉన్న మంత్రి విధులను నిర్వర్తించలేడని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు. అది నిజమే. కానీ, దానికి విరుగుడులు ఇప్పటికే ఉన్నాయి. మంత్రిత్వ శాఖలను ఒకరి నుంచి మరొకరికి మార్చవచ్చు. తాత్కాలిక అధిపతులను నియమించ వచ్చు. కస్టడీలో ఉన్న నాయకునికి మద్దతు కొనసాగించాలో వద్దో చట్ట సభలు నిర్ణయించుకుంటాయి. ఈ ప్రక్రియలను పక్కనపెట్టేసి, ఒక నిర్దిష్ట గడువును విధించడం ద్వారా, ఈ సవరణ నియమాని కన్నా అవసరానికి పెద్ద పీట వేస్తోంది. అరెస్టు అయిన వ్యక్తి నిర్దోషి కూడా కావచ్చుననే సూత్రానికి నీళ్ళు వదులుతోంది.
ప్రతి సవరణ ఒక ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. ఈ రోజున మంత్రులను 30 రోజులు కాగానే పదవుల నుంచి తొలగిస్తే, రేపు 15 రోజులు కాగానే, శాసన సభ్యులను లేదా పార్లమెంట్ సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. రాజకీయాలను ప్రక్షాళన చేసే ప్రయత్నం కాస్తా, అరెస్టును రాజకీయాల్లో సర్వ సాధారణమైనదిగా రూపొందించవచ్చు. నాయకత్వం బ్యాలెట్ ద్వారా కాకుండా పోలీసు స్టేషన్లు, కోర్టులలో నిర్ణయమవుతుందని పౌరులు భావించడం ప్రారంభిస్తారు.
ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా రాజ్యాంగాన్ని ఉద్దేశించారు కానీ, ప్రత్యర్థులను దునుమాడే కత్తులను సమకూర్చడానికి కాదు. 130వ సవరణ బిల్లు అభిమతం మంచిదే కానీ, అది అరెస్టులను ప్రోత్సహించేదిగా, సంకుచిత రాజకీయాలకు ధైర్యం కల్పించేదిగా, న్యాయవ్యవస్థను కూడా రాజకీయమయం చేసే ప్రమాదాలను కొనితెచ్చేదిగా ఉంది. అంతిమంగా, పాలకుడు అంటే, పోలీసు అధికారో లేదా మేజిస్ట్రేటో కాదు, ఓటరు. ఎవరు అధికారంలోఉండాలో ఎవరు వైదొలగాలో ఓటరు మాత్రమే నిర్ణయించాలి.
-వ్యాసకర్త సుప్రీం కోర్టు న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
- సంజయ్ హెగ్డే