
క్వెస్ కార్ప్ నివేదిక
బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) వేగంగా విస్తరిస్తుండడంతో నిపుణులకు తీవ్ర కొరత నెలకొన్నట్టు క్వెస్‌కార్ప్ తెలిపింది. అంతేకాదు, నైపుణ్యాల్లో అంతరంతోపాటు మానవ వనరులపై అధిక వ్యయాలు చేయాల్సి వస్తున్నట్టు తెలిపింది. భారత్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీల విలువ 2023లో 40–41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2032 నాటికి 125–135 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) డేటా నిపుణులకు కొరత ఉందని.. నైపుణ్యాల్లోనూ 42 శాతం మేర అంతరం ఉన్నట్టు పేర్కొంది.
దీంతో కంపెనీలు మానవ వనరుల పరంగా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశీయంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి సంబంధించి 190 జీసీసీలు ఉండగా, ఇవి 5,40,000 మందికి ఉపాధి కలి్పస్తున్నట్టు వెల్లడించింది. కేవలం బ్యాంక్ ఆఫీస్‌లుగా కాకుండా, ఆవిష్కరణలకు కేంద్రాలుగా జీసీసీలు మారినట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలు అధిక విలువ కలిగిన ఆవిష్కరణలకు కేంద్రాలుగా ఉన్నప్పటికీ.. టైర్–2 పట్టణాలు మెరుగైన వసతులు, తక్కువ వ్యయాలతో జీసీసీలకు ఆకర్షణీయంగా మారినట్టు పేర్కొంది. బీఎఫ్‌ఎస్‌ఐ జీసీసీ రంగం భవిష్యత్తు అన్నది.. అవి ఎంత వేగంగా ఆవిష్కరణలను అందించగలవన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది.