breaking news
shortage of candidates
-
బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో నిపుణుల కొరత
బీఎఫ్ఎస్ఐ రంగంలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) వేగంగా విస్తరిస్తుండడంతో నిపుణులకు తీవ్ర కొరత నెలకొన్నట్టు క్వెస్కార్ప్ తెలిపింది. అంతేకాదు, నైపుణ్యాల్లో అంతరంతోపాటు మానవ వనరులపై అధిక వ్యయాలు చేయాల్సి వస్తున్నట్టు తెలిపింది. భారత్లో బీఎఫ్ఎస్ఐ జీసీసీల విలువ 2023లో 40–41 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2032 నాటికి 125–135 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఈ రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) డేటా నిపుణులకు కొరత ఉందని.. నైపుణ్యాల్లోనూ 42 శాతం మేర అంతరం ఉన్నట్టు పేర్కొంది. దీంతో కంపెనీలు మానవ వనరుల పరంగా తమ వ్యూహాలను సమీక్షించుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశీయంగా బీఎఫ్ఎస్ఐ రంగానికి సంబంధించి 190 జీసీసీలు ఉండగా, ఇవి 5,40,000 మందికి ఉపాధి కలి్పస్తున్నట్టు వెల్లడించింది. కేవలం బ్యాంక్ ఆఫీస్లుగా కాకుండా, ఆవిష్కరణలకు కేంద్రాలుగా జీసీసీలు మారినట్టు తెలిపింది. టైర్–1 పట్టణాలు అధిక విలువ కలిగిన ఆవిష్కరణలకు కేంద్రాలుగా ఉన్నప్పటికీ.. టైర్–2 పట్టణాలు మెరుగైన వసతులు, తక్కువ వ్యయాలతో జీసీసీలకు ఆకర్షణీయంగా మారినట్టు పేర్కొంది. బీఎఫ్ఎస్ఐ జీసీసీ రంగం భవిష్యత్తు అన్నది.. అవి ఎంత వేగంగా ఆవిష్కరణలను అందించగలవన్న దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది. -
అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వేట
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ వేట ప్రారంభించింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు అభ్యర్థుల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా అధిష్టానం దూత బసవరాజు శనివారం ఒంగోలు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగలిగే అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఉండరో అనే మీమాంస ఆ పార్టీ నేతల్లో నెలకొంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..ఒకటి, రెండు మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్కు అభ్యర్థులు కరువయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అద్దంకి నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులను పరిశీలిస్తుండగా..వీరు మరో పార్టీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో బసవరాజు అయోమయంలో పడినట్లు సమాచారం. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అధికార పార్టీకి చెందిన వారే. అయితే సీఎం కొత్తపార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఆ పార్టీలోకి లేదా మరో పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి. ఒంగోలులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను పరిశీలిస్తుండగా వీరు కూడా పాదరసంలా ‘చే’జారిపోయే అవకాశం ఉందని సమాచారం. దర్శి నియోజకవర్గం నుంచి మాత్రమే ఇప్పటివరకు ఒక అభ్యర్థి ఖరారయినట్లు తెలిసింది. ఇతను కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యక్తి కాగా..ఆయన తన పరపతి ఉపయోగించి ఆ వ్యక్తిని ఒప్పించినట్లు తెలుస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులతో కూడా అధిష్టానం దూత చర్చించినట్లు సమాచారం. అయితే వీరిలో ఎందరు పార్టీలో కొనసాగుతారో, ఎంతమంది చేజారిపోతారో తెలుసుకోలేక తల పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్పార్టీకి చెందిన నాయకుడు ఒకరు మాట్లాడుతూ సీఎం కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంటే, ఆ విషయం ఈనెలలో తేలిపోతుందని అన్నారు. సీఎం పార్టీ విషయంలో నిర్ణయం వెలువడితే, దాన్ని బట్టి పార్టీలో ఎంతమంది ఉంటారో తెలుస్తుందని చెప్పారు. అయితే అందరూ సీఎం పెట్టే పార్టీలోకి వెళతారనే నమ్మకం లేదని, ఇతర పార్టీల వైపు వెళ్లేందుకు కూడా పలువురు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.