అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వేట | Shortage of candidates for constituencies in congress | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల కోసం కాంగ్రెస్ వేట

Jan 19 2014 5:46 AM | Updated on Aug 14 2018 4:44 PM

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ వేట ప్రారంభించింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు అభ్యర్థుల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ వేట ప్రారంభించింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు అభ్యర్థుల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా అధిష్టానం దూత బసవరాజు శనివారం ఒంగోలు చేరుకున్నారు.

 కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగలిగే అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారో ఉండరో అనే మీమాంస ఆ పార్టీ నేతల్లో నెలకొంది. జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..ఒకటి, రెండు మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  అద్దంకి నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులను పరిశీలిస్తుండగా..వీరు మరో పార్టీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలియడంతో బసవరాజు అయోమయంలో పడినట్లు సమాచారం.

  చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు అధికార పార్టీకి చెందిన వారే. అయితే సీఎం కొత్తపార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఆ పార్టీలోకి లేదా మరో పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వదంతులు వస్తున్నాయి.

 ఒంగోలులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను పరిశీలిస్తుండగా వీరు కూడా పాదరసంలా ‘చే’జారిపోయే అవకాశం ఉందని సమాచారం.
  దర్శి నియోజకవర్గం నుంచి మాత్రమే ఇప్పటివరకు ఒక అభ్యర్థి ఖరారయినట్లు తెలిసింది. ఇతను కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యక్తి కాగా..ఆయన తన పరపతి ఉపయోగించి ఆ వ్యక్తిని ఒప్పించినట్లు తెలుస్తోంది.
  మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులతో కూడా అధిష్టానం దూత చర్చించినట్లు సమాచారం.

 అయితే వీరిలో ఎందరు పార్టీలో కొనసాగుతారో, ఎంతమంది చేజారిపోతారో తెలుసుకోలేక తల పట్టుకుంటున్నారు.  ఇదిలా ఉండగా,  కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకుడు ఒకరు మాట్లాడుతూ సీఎం కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉంటే,  ఆ విషయం ఈనెలలో తేలిపోతుందని అన్నారు. సీఎం పార్టీ విషయంలో నిర్ణయం వెలువడితే,  దాన్ని బట్టి పార్టీలో ఎంతమంది ఉంటారో తెలుస్తుందని చెప్పారు.

 అయితే అందరూ సీఎం పెట్టే పార్టీలోకి వెళతారనే నమ్మకం లేదని, ఇతర పార్టీల వైపు వెళ్లేందుకు కూడా పలువురు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement