
ఒడిదుడుకులకు లోనవుతున్న జాబ్ మార్కెట్
అనిశ్చితిని ఎదుర్కోవడానికి ‘ఫండ్’ తప్పనిసరి
అదనపు ఆదాయ వనరులపైనా దృష్టిపెట్టాల
ప్రపంచవ్యాప్తంగా 2023లో 1,193 టెక్ కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులను.. గతేడాది 551 టెక్ సంస్థలు 1,52,922 మందిని తొలగించాయి. ఈ ఏడాది ఇప్పటికే 186 కంపెనీలు 81,567 మందిని ఇంటికి సాగనంపాయి. ఒక్క టెక్ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటే ఇతర రంగాల్లో పరిస్థితి? ఇదంతా ఎందుకంటే.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఉండే మానసిక వేదన అంతా ఇంతా కాదు.
ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఏ ఇబ్బందీ లేదు. నెల జీతం మీద బతికేవారికే సమస్యల్లా. నిత్యావసరాలు, ఇంటి అద్దె, నెల వాయిదాలు, పిల్లల ఫీజులు, వైద్యం.. ఇలా తప్పించుకోలేని ఖర్చుల జాబితా పెద్దదిగానే ఉంటుంది. అనుకోని కష్టం ఎదురైతే ఎదుర్కొనే ప్రణాళిక లేకపోతే చాలామంది ఆర్థికంగా చితికిపోతారు. అప్పుల ఊబిలో కూరుకుపోతారు. జాబ్ మార్కెట్‌లో ప్రస్తుత తరుణంలో ఉన్న అనిశ్చితి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని సూత్రాలు పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
అత్యవసర నిధి
సగటు ఉద్యోగికి.. అలాగే కుటుంబానికి ఇదే పెద్ద ధీమా. కనీసం 6–12 నెలల ఇంటి ఖర్చులకు సమానమైన మొత్తంలో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. తద్వారా ఆర్థిక భద్రత పెరుగుతుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే.. ఊహించని, అత్యవసర ఖర్చులను తీర్చడానికి ఈ ఫండ్ సమయానికి ఆదుకుంటుంది.
» ఈ నిధి లేకపోతే అధిక వడ్డీతో అప్పులు, లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడవలసి వస్తుంది. ఇదే జరిగితే ఆర్థిక సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
» ఆర్థికంగా బలంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది. అన్నింటికీ మించి ఒత్తిడి తగ్గుతుంది.
» ఆహారం, వైద్య బిల్లులు, బీమా ప్రీమియం వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం మాత్రమే ఈ అత్యవసర ఫండ్‌ను ఉపయోగించండి.
» జాబ్ కోల్పోయిన తర్వాత కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఈ నిధుల నుంచి కొంత మొత్తాన్ని కేటాయించండి. కొత్త కోర్సు, శిక్షణ పూర్తి అయితే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
అదనపు ఆదాయ మార్గాలు
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం, అభిరుచి, ఆసక్తి దాగి ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పాటు వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి ప్రయత్నించండి. ఆదాయ నష్టాలను అధిగమించడంలో ఇవి మీకు సహాయపడతాయి. ఇదే సమయంలో వీలైనంత పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కూడా మర్చిపోవద్దు.
ఆరోగ్య బీమా
చాలా మంది ఉద్యోగులు సంస్థ అందించే గ్రూప్ హెల్త్ కవరేజీపైనే ఆధారపడతారు. సొంతంగా బీమా పాలసీ తీసుకోరు. కంపెనీ నుంచి ఉంది కదా అన్న ధీమా, నిర్లక్ష్యపు ధోరణి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఈ బీమా వర్తించదు. అందుకే కుటుంబం అంతటికీ వర్తించే సమగ్ర వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. వ్యక్తిగత బీమా ఉంటే జాబ్ పోయినా, మానేసినా చింత ఉండదు. కుటుంబంలోని వారందరికీ నిరంతర ఆరోగ్య బీమా రక్షణ ఉంటుంది.
తక్కువ అప్పు
ఉద్యోగం కోల్పోతామన్న అభద్రతకు లోనైతే.. అప్పులు / రుణాలను కనిష్ట స్థాయిలో ఉంచడానికి ప్రయత్నించండి. కొత్త రుణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. వీలైతే ముందస్తుగా ఈఎంఐలు చెల్లించండి.
» బ్యాంకులకు చెల్లించాల్సిన వాయిదాల క్రమం తప్పితే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇదే జరిగితే భవిష్యత్తులో రుణం పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
» ఉద్యోగాన్ని కోల్పోయినట్టయితే రుణదాతకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు మారటోరియం, నెల వాయిదాల (ఈఎంఐ) గడువు పెంచడం (రీషెడ్యూల్) గురించి విన్నవించండి.
» బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి నుంచి అప్పు తీసుకున్నట్టయితే పరిస్థితిని నిజాయితీగా వివరించండి.
బడ్జెట్‌లో మార్పులు
అనిశ్చితి సమయాల్లో విచ్చలవిడి ఖర్చులను తగ్గించుకోండి. అత్యవసరమైతే తప్ప ఖర్చు చేయండి.
» అనవసర ఖర్చులు తగ్గిస్తే చేతిలో డబ్బులు మిగులుతాయి. ఉద్యోగ నష్టానికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది.
» ఉద్యోగం కోల్పోవడం వల్ల తలెత్తే ఆర్థిక పరిణామాలు, తదుపరి ఉద్యోగ అన్వేషణ, జాబ్ మార్కెట్ గురించి మీ ఆలోచనలు, భావాలు, ప్రణాళికలను కుటుంబంతో పంచుకోండి.
» కుటుంబ సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించడానికి, నిర్ణయం తీసుకునే ప్రక్రియకు దోహదపడే సుహృద్భావ వాతావరణాన్ని కల్పించండి. ఈ విధానం కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది.
» మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ కదిలించొద్దు.