
భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (ఫైల్)
భారత జట్టు స్పాన్సర్‌షిప్ రద్దు చేసే అవకాశం
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తామన్న బీసీసీఐ
న్యూఢిల్లీ: ‘సెబీ’ నిబంధనలు ఉల్లంఘించిన సహారా గ్రూప్, కాంపిటీషన్ కమిషన్ విచారణను ఎదుర్కొన్న స్టార్ ఇండియా, ఆర్థిక సమస్యలతో ఒప్పో, చెల్లింపులు చేయలేక బాకీపడ్డ బైజూస్... భారత క్రికెట్ జట్టు గత నాలుగు ప్రధాన స్పాన్సర్లు ఏదో ఒక వివాదం లేదా సమస్యతో సహవాసం చేయడం బీసీసీఐకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ జాబితాలో ‘డ్రీమ్ 11’ కూడా చేరింది. ఇందులో నేరుగా కంపెనీ పాత్ర లేకపోయినా... ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో పరిస్థితి మారిపోయింది.
ఇకపై ‘డ్రీమ్ 11’ భారత టీమ్ స్పాన్సర్‌గా కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ఆన్‌లైన్ ఫాంటసీ స్పోర్ట్స్, గ్యాంబ్లింగ్ వేదికలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే కేటగిరీలో వచ్చే ‘డ్రీమ్ 11’కు దీని కారణంగా ఆర్థిక పరంగా గట్టి దెబ్బ తగలనుంది. 2023లో రూ. 358 కోట్లతో మూడేళ్ల కాలానికి బీసీసీఐతో ‘డ్రీమ్ 11’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ 2026 మార్చి వరకు ఉంది. అయితే ఆసియా కప్‌కు ముందే స్పాన్సర్‌షిప్ ఒప్పందం రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ‘ఫలానా సంస్థతో ఒప్పందానికి అనుమతి లేదంటే మేం ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్లం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతీ పాలసీ, నిబంధనలను బీసీసీఐ పాటిస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ స్పాన్సర్‌షి-ప్‌కు సంబంధించి త్వరలోనే మరింత స్పష్టత రావచ్చు. తక్కువ సమయంలో బోర్డు మళ్లీ కొత్త స్పాన్సర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుందా అనేది ఆసక్తికరం. మరోవైపు డ్రీమ్ 11 శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది.
‘డబ్బులు చెల్లించి ఆడే పోటీలన్నింటినీ మేం నిలిపివేశాం. ఉచితంగా ఆడుకునే ఆన్‌లైన్ సోషల్ గేమ్‌లుగా వాటిని మార్చేశాం. ఇన్నేళ్లు మేం నిబంధనల ప్రకారమే పని చేశాం. భారత ప్రభుత్వ చట్టాలను మేం గౌరవిస్తే. ఇకపై మా ఇతర సంస్థలు ఫ్యాన్ కోడ్, డ్రీమ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా క్రీడలతో అనుబంధాన్ని కొనసాగిస్తాం’ అని పేర్కొంది.