
సౌతాఫ్రికా స్టార్ మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) వన్డేల్లో పరుగుల ప్రవాహం కొనసాగిస్తున్నాడు. ఆడిన తొలి మూడు వన్డేల్లో అద్భుత రీతిలో చెలరేగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఆస్ట్రేలియాతో రెండో మ్యాచ్‌లోనూ దుమ్ములేపాడు.
ఇరవై మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి సౌతాఫ్రికా కష్టాల్లో ఉన్న వేళ.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన బ్రీట్జ్కే ధనాధన్ దంచికొట్టాడు. ట్రిస్టన్ స్టబ్స్ (Trisran Stubbs- 74)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
కేవలం 78 బంతుల్లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 88 పరుగులు సాధించాడు. అయితే, నాథన్ ఎల్లిస్ ట్రాప్‌లో పడిన బ్రీట్జ్కే.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఏదేమైనా అద్భుత మెరుపు శతకంతో ఆకట్టుకున్న బ్రీట్జ్కే ఈ సందర్భంగా అరుదైన ప్రపంచ రికార్డును సాధించాడు. వన్డేల్లో ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌లలో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
నవజ్యోత్ సింగ్ కూడా సాధించినా..
ఇంతకు ముందు టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు తొలి నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఇందుకు అతడికి ఐదు మ్యాచ్‌లు అవసరమైతే.. బ్రీట్జ్కే మాత్రం నాలుగు వన్డేల్లోనే ఈ ఘనత అందుకున్నాడు.
కాగా 1987 ప్రపంచకప్ సందర్భంగా సిద్ధు ఆస్ట్రేలియా మీద 73, న్యూజిలాండ్ మీద 75, ఆస్ట్రేలియా మీద 51, జింబాబ్వే మీద 55 పరుగులు సాధించాడు. అయితే, మధ్యలో మూడో వన్డేను అతడు మిస్సయ్యాడు.
అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు
మరోవైపు.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా 2025లో వన్డేల్లో అడుగుపెట్టిన 26 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కే.. అరంగేట్రంలోనే భారీ సెంచరీ సాధించాడు. పాకిస్తాన్ వేదికగా జరిగిన ట్రై సిరీస్‌లో కివీస్ జట్టుతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి.. 148 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. తద్వారా వన్డే అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
అనంతరం పాకిస్తాన్‌తో వన్డేలో 83 పరుగులు చేశాడు బ్రీట్జ్కే. తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 57 పరుగులు సాధించిన బ్రీట్జ్కే.. రెండో వన్డేల్లో 88 పరుగులు చేశాడు. తద్వారా ఆడిన తొలి నాలుగు వన్డేల్లో 96.67 సగటుతో 378 పరుగులు సాధించాడు బ్రీట్జ్కే.
సౌతాఫ్రికా ఆలౌట్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (8), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ (0) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జీ (38) ఫర్వాలేదనిపించాడు.
మాథ్యూ బ్రీట్జ్కే (88) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ట్రిస్టన్ స్టబ్స్ (74) కూడా రాణించాడు. మిగిలిన వారిలో వియాన్ ముల్దర్ 26, కేశవ్ మహరాజ్ 22* ఫర్వాలేదనిపించారు. ఇక ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్, మార్నస్ లబుషేన్, నాథన్ ఎల్లిస్ రెండేసి వికెట్లు కూల్చారు. జోష్ హాజిల్‌వుడ్‌కు ఒక వికెట్ దక్కింది.
బవుమాకు రెస్ట్
మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియాకు వచ్చిన సౌతాఫ్రికా.. టీ20 సిరీస్‌లో ఆసీస్ చేతిలో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో టెంబా బవుమా సారథ్యంలో 98 పరుగుల తేడాతో గెలిచిన ప్రొటిస్ జట్టు.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో టెస్టుకు బవుమా విశ్రాంతి తీసుకోగా.. మార్క్రమ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
చదవండి: Asia Cup 2025: మెగా టోర్నీకి ముందు సంజూ శాంసన్ కీలక నిర్ణయం!