
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ ఆడే జట్టులో ఎట్టకేలకు సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టుకు ఈ కేరళ స్టార్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక.. ఈ టోర్నీ ద్వారానే శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ టీ20లలో రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఫస్ట్ ఛాయిస్ అతడే
అంతేకాదు.. వైస్ కెప్టెన్ స్థాయిలో గిల్ (Shubman Gill) జట్టులోకి వచ్చాడు. అతడి గైర్హాజరీలో ఇన్నాళ్లూ ఓపెనర్‌గా ఉన్న సంజూ శాంసన్‌కు ఇది తలనొప్పిగా మారింది. మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా అభిషేక్ శర్మకు పెద్ద పీట వేస్తామని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బహిరంగంగానే వెల్లడించాడు.
అంతేకాదు.. గిల్, యశస్వి జైస్వాల్ లేరు కాబట్టే సంజూను ఓపెనర్‌గా పంపించామని అగార్కర్ స్పష్టం చేశాడు. దీనిని బట్టి కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే సంజూకు జట్టులో స్థానం ఇచ్చారన్నది సుస్పష్టం. కీపర్ కోటాలో జితేశ్ శర్మ కూడా ఉన్నందున సంజూ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
తుదిజట్టులో సంజూ ఉండకపోవచ్చు
ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ సంజూను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్‌మన్ గిల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అంతేకాదు.. అతడు ఇప్పుడు వైస్ కెప్టెన్ కూడా!.. కాబట్టి సంజూ శాంసన్ ప్లేస్ డేంజర్‌లో ఉన్నట్లే!
గిల్‌ను ఓపెనర్‌గా పంపుతారు కాబట్టి సంజూకు భంగపాటు తప్పదు. ఒకవేళ.. సంజూ కోసం గిల్‌ను మూడో స్థానంలో పంపుతారా? అంటే అది కుదరని పని’’ అని అశూ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి తరుణంలో సంజూ చేసిన పని క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది.
సంజూ కీలక నిర్ణయం
ఆసియా కప్ సన్నాహకాల్లో భాగంగా సంజూ ప్రస్తుతం కేరళ క్రికెట్ లీగ్ ఆడుతున్నాడు. ఈ టీ20 టోర్నీలో కొచ్చి బ్లూ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంజూ.. ఓపెనర్‌గా రావాల్సి ఉంది. అయితే, అదానీ త్రివేండ్రం రాయల్స్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో మాత్రం అతడు ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధపడ్డాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టైగర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాయల్స్ జట్టును 97 పరుగులకే కట్టడి చేసింది. ఇక లక్ష్య ఛేదనలో 59 బంతులు మిగిలి ఉండగానే ఎనిమిది వికెట్ల తేడాతో టైగర్స్ జయభేరి మోగించింది. దీంతో సంజూ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది.
ఏదేమైనా తన బ్యాటింగ్ స్థానాన్ని డిమోట్ చేసుకోవడం ద్వారా.. ఆసియా కప్ టోర్నీలో ఏ స్థానంలో వచ్చేందుకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు సంజూ మేనేజ్‌మెంట్‌కు సంకేతాలు ఇచ్చినట్లయింది. కాగా సెప్టెంబరు 9-28 వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది.
చదవండి: నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్