
టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో రాహుల్ ద్రవిడ్ (Rahu Dravid) ఒకడు. కర్ణాటక తరఫున దేశీ క్రికెట్ ఆడిన ద్రవిడ్.. అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. సంప్రదాయ టెక్నిక్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లను మప్పుతిప్పలుపెట్టడంలో దిట్ట. ఇక టెస్టుల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు ప్రయోజనాలు చేకూర్చిన ద్రవిడ్.. ‘ది వాల్’గా ప్రసిద్ధి చెందాడు.
అంతర్జాతీయ స్థాయిలో 1996- 2012 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ద్రవిడ్.. మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని తదితరుల కెప్టెన్సీలో ఆడాడు. అంతేకాదు.. 2005- 2007 మధ్య తానే స్వయంగా కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.
నా బెస్ట్ కెప్టెన్ అతడే
అయితే, తనను ప్రభావితం చేసిన కెప్టెన్ ఎవరన్న అంశంపై తాజాగా స్పందించిన ద్రవిడ్.. ఊహించని పేరు చెప్పాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘వక్కడై బిక్షేశ్వరన్ చంద్రశేఖర్ (Vakkadai Biksheswaran Chandrasekhar) సారథ్యంలో క్రికెట్ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదించాను.
చిన్నతనంలో తమిళనాడులో ఆయన మార్గనిర్దేశనంలో లీగ్ క్రికెట్ ఆడాను. గెలుపుకోసం ఆయన పరితపించే తీరు, పోటాపోటీగా ముందు సాగే విధానం నాకెంతగానో నచ్చుతాయి. కెరీర్ తొలినాళ్లలో నాకు నచ్చిన కెప్టెన్లలో వీబీ ముఖ్యులు’’ అని ద్రవిడ్ తెలిపాడు.
ధోనికి కూడా అంత ఈజీ ఏం కాదు
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ధోని మంచి కెప్టెన్. జట్టు పరివర్తన సమయంలో వెనకుండి.. అతడు జట్టును ముందుకు నడిపించిన తీరు ప్రశంసనీయం. యువ ఆటగాడి నుంచి సీనియర్లు ఉన్న జట్టుకు కెప్టెన్‌గా ఎదగడం అంత తేలికేమీ కాదు’’ అని ద్రవిడ్... మహేంద్ర సింగ్ ధోనిని ప్రశంసించాడు.
కాగా ధోని 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన విషయం తెలిసిందే.
గంగూలీ స్టైల్‌వేరు.. కుంబ్లే కూల్
అదే విధంగా.. ‘‘తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపిస్తూ.. గెలుపే పరమావధిగా ఎంతకైనా వెళ్లే కెప్టెన్ గంగూలీ. ఇక అనిల్ కూడా గుడ్ కెప్టెన్. తన మనసులో ఏముందో ఆటగాళ్లకు అర్థమయ్యేలా వివరించేవాడు’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.
కాగా మధ్యప్రదేశ్‌లో జన్మించిన రాహుల్ ద్రవిడ్.. తండ్రి ఉద్యోగరీత్యా కర్ణాటకకు వచ్చి అక్కడే సెటిలయ్యాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టీమిండియా తరఫున.. 164 టెస్టుల్లో 13288, 344 వన్డేల్లో 10889, ఒక టీ20 మ్యాచ్‌లో 31 పరుగులు సాధించాడు. ఇక టీమిండియా హెడ్‌కోచ్‌గానూ పనిచేసిన ద్రవిడ్.. 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పదవి నుంచి వైదొలిగాడు.
చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్