
దులీప్ ట్రోఫీ 2025 తొలి రౌండ్ మ్యాచ్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అగ్రహం వ్యక్తం చేసింది. ఈ మెరకు ఆయా రాష్ట్ర క్రికెట్ ఆసోయేషిన్‌లకు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనెజర్ అబే కురువిల్లా లేఖ రాశారు.
ముఖ్యంగా సౌత్ జోన్ జట్టులో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి సుదర్శన్,మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ ప్లేయర్లు లేకపోవడంతో బీసీసీఐ స్పందించాల్సి వచ్చింది. వీరందరూ ప్రస్తుతం భారత టెస్టు జట్టులో భాగంగా ఉన్నారు. ఇంగ్లండ్ టూర్ తర్వాత వీరిందరికి నెలకు పైగా విశ్రాంతి లభించింది.
అంతేకాకుండా ఆసియాకప్ జట్టులో వీరివ్వరూ భాగం కాకపోవడంతో దులీప్ ట్రోఫీలో ఆడుతారని అంతా భావించారు. కానీ సౌత్ జోన్ జట్టులో వారిలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. దీంతో ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్ వరకు వారికి విశ్రాంతి లభించనుంది. కాగా దులీప్ ట్రోఫీకి జట్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కాకుండా, జోన్ సెలెక్టర్లు ఎంపిక చేస్తారు.
"దులీప్ ట్రోఫీ ప్రతిష్టను కాపాడుకునేందుకు, సరైన పోటీ అందించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లను వారి సంబంధిత జోనల్ జట్లకు కచ్చితంగా ఎంపిక చేయాలి. కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు లేదా టీమిండియాలో ఎంపిక కోసం ఎదురు చూస్తున్న ఆటగాళ్లందరూ బీసీసీఐ నిర్వహించే దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలి.
ఒకవేళ ఎవరైనా ఆటగాడు అందుబాటులో ఉన్నప్పటికి సరైన కారణం లేకుండా దేశీయ క్రికెట్ టోర్నీల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంటే సదరు ప్లేయర్‌ను జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకోరు" అని లేఖలో కురువిల్లా పేర్కొన్నారు.
కాగా గతేడాదే సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌లో ఆడాలి అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు గత రంజీ సీజన్‌లో ఆడారు. దులీప్ ట్రోఫీ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: భారత్, పాక్ పోరుకు రాజముద్ర