
ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం
ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు నో
కొత్తగా మార్గదర్శకాలు జారీ
ఒకవైపు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారతీయుల్లో తీవ్ర ఆగ్రహం... మన దేశంలో ఉన్న పాక్ జాతీయులను వెంటనే వెనక్కి పంపడంతో పాటు అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటూ ప్రభుత్వ స్పందన... ఇలాంటి స్థితిలో శత్రుదేశం పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు... స్వయంగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ తటస్థ వేదికల్లో కూడా ఆడకూడదంటూ వ్యాఖ్యలు ... వెటరన్ ఆటగాళ్ల ‘వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాక్‌తో రెండు మ్యాచ్‌ల్లో బరిలోకి దిగకుండా తప్పుకున్న భారత బృందంపై ప్రశంసలు...
మరోవైపు ‘ఆ మ్యాచ్’ కోసమేనా అన్నట్లుగా ఆసియా కప్ వేదిక భారత్ నుంచి యూఏఈకి మారడం... కొద్ది రోజులకే షెడ్యూల్ విడుదల... జోరుగా ప్రచారం మొదలు పెట్టిన ప్రసారకర్తలు... భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు 10 సెకన్ల ప్రకటనకు రూ. 16 లక్షల రేటు... చూస్తుండగానే టోర్నీలో పాల్గొనే జట్ల ప్రకటన... అయినా సరే చివరి నిమిషంలో మ్యాచ్ రద్దు కావచ్చని, లేదా భారత్ ఆడకుండా పాయింట్లు ఇవ్వవచ్చని చర్చ... కానీ అలాంటి అవసరం లేదని తేలిపోయింది. ఇప్పుడు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చి భారత్, పాక్ పోరుకు ఆమోద ముద్ర వేసింది.
న్యూఢిల్లీ: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరిగే మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు అమితోత్సాహంతో సిద్ధం కావచ్చు! ఆసియా కప్‌లో పాక్‌తో తలపడేందుకు కేంద్ర ప్రభుత్వం మన జట్టుకు అనుమతి ఇచ్చింది. ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న ‘మల్టీలేటరల్ ఈవెంట్’ కావడంతో ఈ మ్యాచ్‌లో ఆడటంపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం లేదని ప్రకటించింది.
టోర్నీ షెడ్యూల్ ప్రకారం చూస్తే ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ మ్యాచ్‌లపై ఉన్న ఆసక్తి, ప్రాధాన్యతను బట్టి చూస్తే తాజా ప్రకటనతో వాణిజ్యపరంగా భాగస్వాములందరూ సంతోషించే నిర్ణయం వెలువడటం విశేషం. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేసింది.
మార్గదర్శకాలతో స్పష్టత...
భారత్, పాకిస్తాన్ మధ్య నిజానికి 2012–13 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కానీ ఇరు జట్లు ఐసీసీ టోర్నీలైన వన్డే, టి20 వరల్డ్ కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ మ్యాచ్‌లలో తలపడుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ప్రకటనలో కొత్తగా పేర్కొన్న అంశం ఏమీ లేదు. అయితే దీనికే మరింత స్పష్టతనిస్తూ అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేసింది. సరిహద్దు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో క్రీడా సంబంధాల విషయంలో కేంద్రం వీటిని ప్రకటించింది.
‘క్రీడలకు సంబంధించి పాకిస్తాన్‌తో ఎలా వ్యవహరించాలనే విషయంపై ప్రభుత్వం తమ విధానాన్ని వెల్లడిస్తోంది. ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు. మన జట్టు అక్కడికి వెళ్లి ఆడేందుకు లేదా ఆ జట్టు ఇక్కడికి వచ్చే ఆడేందుకు కూడా అనుమతించేది లేదు. అయితే పలు ఇతర జట్లతో ముడిపడి ఉన్న టోర్నీల విషయంలో ఆయా క్రీడల అంతర్జాతీయ సంఘాల నిబంధనలను, మన ఆటగాళ్లను కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
భారత్ పెద్ద ఈవెంట్ల వేదికగా మారుతున్న అంశాన్ని కూడా చూడాలి. కాబట్టి ఇలాంటి ఈవెంట్లలో పాక్ ఆడుతున్నా సరే మన జట్టు పాల్గొనవచ్చు. భారత్ ఆతిథ్యం ఇచ్చే ఇలాంటి టోర్నీల్లో కూడా పాకిస్తాన్ ఆడేందుకు అభ్యంతరం లేదు’ అని కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది.
అధికారుల కోసం వీసా సడలింపులు...
భవిష్యత్‌లో కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ కూడా నిర్వహించాలని ఆశిస్తున్న నేపథ్యంలో మన దేశానికి అత్యుత్తమ వేదికగా గుర్తింపు రావాలని కూడా కేంద్రం భావిస్తోంది. అందుకే వివిధ క్రీడా ఈవెంట్ల సమయంలో వీసాలు జారీ చేసే విషయంపై కూడా ప్రకటనలో వివరంగా పేర్కొంది.
‘క్రీడాకారులు, అధికారులు, సాంకేతిక సిబ్బందితో పాటు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులకు వారి అధికారిక పర్యటన సమయం, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వీసాలు జారీ చేస్తాం. ఇది గరిష్టంగా ఐదేళ్లు ఉంటుంది. టోర్నీల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి వచ్చే అధికారులకు ఇబ్బంది లేకుండా తమ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఇది ఉపకరిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది.