రైలులో లగేజీ మరింత 'భారం' | Passengers luggage will no longer be allowed on trains | Sakshi
Sakshi News home page

రైలులో లగేజీ మరింత 'భారం'

Aug 23 2025 3:41 AM | Updated on Aug 23 2025 3:41 AM

Passengers luggage will no longer be allowed on trains

విమానాల తరహాలో వాతపెట్టేందుకు సిద్ధం

ఎప్పట్నుంచో ఆంక్షలున్నా.. ఇక పక్కాగా అమలు 

ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులకు 70 కిలోలే గరిష్టం 

స్లీపర్‌ క్లాస్‌ అయితే 40 కిలోలు దాటితే జరిమానా 

ఎక్కువ బరువు ఉంటే.. ముందస్తు బుకింగ్‌ అవసరం 

లేదంటే ఒకటిన్నర రెట్లుఫైన్‌ కట్టాల్సిందే.! 

బ్యాగ్‌ పెద్దదైనా బాదుడు తప్పదు 

సాక్షి, విశాఖపట్నం: రైలు ప్రయాణం..అన్నీ సర్దేసుకుని పట్టేసుకుందాం. సీటు కింద బ్యాగులు ఇష్టం వచ్చినట్లు  పెట్టేసుకుందాం అంటే కుదరదిక. మీ లగేజీ.. మీకు మరింత భారమవ్వనుంది. ఇకపై రైలులో ప్రయాణికుల లగేజీకి విమాన ప్రయాణంలో మాదిరిగా బాదుడు షురూ చెయ్యనున్నారు. ఎప్పటి నుంచే ఈ నిబంధనలున్నా.. ఇకపై తూ.చా. తప్పకుండా అమలు చెయ్యాలని నిర్ణయించారు. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ లగేజీ ఉంటే ఒకటిన్నర రెట్లు ఫైన్‌ పడనుంది. సీటు కంటే బ్యాగ్‌ సైజ్‌ పెద్దదైనా బాదుడు తప్పదని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యతరగతి ప్రయాణికులపైనే అధిక భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. 

ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లో 70 కిలోల వరకూ అనుమతి ఉండగా సెకెండ్‌ క్లాస్‌ ప్రయాణికులకు కేవలం 40 కిలోల పరిమితికి మాత్రమే అనుమతించనున్నారు. విమానం ఎక్కేందుకు వెళ్లే ప్రయాణికుల లగేజీ బరువు కొలిచే పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు రైలు ప్రయాణికులకూ అదే విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై లగేజీ కొలిచే విధానం రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది. కొత్త నిబంధనల ప్రకారం, ప్యాసింజర్లు తమ లగేజీని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్‌ వెయింగ్‌ మెషిన్లలో తనిఖీ చేయించుకోవాలి. 

రైల్వే శాఖ ప్రతి కోచ్‌కు నిర్దిష్ట లగేజీ బరువు పరిమితులను నిర్ణయించింది. నిర్దేశించిన బరువు మించితే అదనపు చార్జీలు, జరిమానాలు చెల్లించాల్సిందేనంటూ ఇండియన్‌ రైల్వేస్‌ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే బోర్డు చెబుతున్నా.. ఈ నూతన నిబంధనలు.. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టబోతున్నాయి.  

మధ్యతరగతిపైనే అధిక భారం 
ఈ నిబంధనలు గతంలో ఉన్నవే అయినా.. ఇకపై కచ్చితంగా అమలు చెయ్యాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు రైల్వే కోచ్‌ ప్రకారం నిర్ణయించారు. ఇందులో మధ్యతరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే సెకెండ్‌క్లాస్, థర్డ్‌ ఏసీ పైనే భారం ఎక్కువగా ఉండనుంది. ప్రయాణికుల తరగతిని బట్టి ఉచిత లగేజీ పరిమితిని నిర్ణయించారు. దీని ప్రకారం, ఫస్ట్‌ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. సెకండ్‌ ఏసీ ప్రయాణికులు 50 కిలోలు, థర్డ్‌ ఏసీ ప్రయాణికులు 40 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు.  

స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణికులకు కూడా కేవలం 40 కిలోలు మాత్రమే పరిమితి విధించవచ్చు. జనరల్, సెకండ్‌ సిట్టింగ్‌ ప్రయాణికులకు కేవలం 35 కిలోల వరకు ఉచిత పరిమితి విధించారు. రైల్వే నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన పరిమితి కంటే 10 నుంచి 15 కిలోల వరకు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడంలో సడలింపు ఉంటుంది. కానీ బరువు అంతకంటే ఎక్కువగా ఉంటే, ప్రయాణికులు స్టేషన్‌కు వెళ్లి లగేజీని బుక్‌ చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికుల్లో 5 నుంచి 12 ఏళ్ల వయసున్న వారు ఉన్నట్‌లైతే అనుమతించిన దానిలో సగం లగేజీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది.

బ్యాగ్‌ సైజ్‌ పెరిగినా వాత పడుద్ది 
నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ తీసుకెళ్లినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక ప్రయాణికుడు బుకింగ్‌ పరిమితి కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్తున్నట్లు తేలితే.. సాధారణం కంటే 1.5 రెట్లు అధికంగా జరిమానా విధిస్తారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణ సమయంలో ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు మాత్రమే కాకుండా బ్యాగ్‌ పరిమాణంపైనా భారం పడనుంది. ప్రయాణికుల బ్యాగ్‌ చాలా పెద్దదిగా ఉండి, కోచ్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే, దానిపైనా జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. 

అంటే బరువు తక్కువగా ఉన్నప్పటికీ, పెద్ద సైజు బ్యాగ్‌ పట్టు­కెళ్లినా భారం తప్పదన్న విషయం ప్రయాణికులు గుర్తుపెట్టుకోవాలి. అంటే బుకింగ్‌ లేకుండా పరి­మితి కంటే ఎక్కువ బరువు తీసుకెళ్లడం ఇక జేబుకు చిల్లు పడటమేనని ప్రయాణికులు వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తుండటం వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై ఈ సమస్య లేకుండా ఉండేందుకే నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. 

వృద్ధుల చేతి కర్రలు, హ్యాండ్‌ బ్యాగులు, టిఫిన్‌ బాక్సులపై ఈ లగేజీ పరిమితి వర్తించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తొలుత ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌¯లోని ప్రధాన స్టేషన్లైన ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్, కాన్పూర్‌ సెంట్రల్, అలీగఢ్‌ జంక్షన్‌ మొదలైన జంక్షన్లలో అమలుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే మిగిలిన స్టేషన్లలో అమలు చేయనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement