
నేడు నేషనల్ స్పేస్ డే– ఇస్రో
‘ఆకాశంలో సగం’ అనే మాట మనకు సుపరిచితం. అయితే ఆరోజుల్లో ‘స్పేస్ సైన్స్’కు సంబంధించి మహిళా శాస్త్రవేత్తల సంఖ్య చాలా తక్కువ. గతంతో పోల్చితే ఇప్పుడు ఉమెన్ స్పేస్ సైంటిస్ట్‌ల సంఖ్య బాగా పెరిగింది. ‘ఇస్రో’ మంగళ్‌యాన్ మిషన్ నుంచి చంద్రయాన్ మిషన్ వరకు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌లలో కీలక పాత్ర పోషించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో అడుగు పెట్టడానికి ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తిని ఇస్తున్నారు...
ఆకాశమే అపూర్వ పాఠశాల
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన రీతూ కరిధాల్‌కు ఆకాశం ఎప్పుడూ వింతగా అనిపించేది. అంత పెద్దగా కనిపించిన చంద్రుడు ఎందుకు తగ్గుకుంటూ వెళతాడు? పగటి పూట చుక్కలు ఎందుకు కనిపించవు? ఇలాంటి సందేహాలెన్నో ఆ చిట్టి బుర్రకు వచ్చేవి. ఆకాశంపై అమితమైన ఆసక్తే రీతూను సైన్స్ వైపు నడిపించింది. స్కూల్ రోజుల్లో నాసా, ఇస్రోకు సంబంధించిన ప్రాజెక్ట్‌ల సమాచారం గురించి దినపత్రికలలో వెదికేది. కనిపిస్తే వాటిని కట్ చేసి దాచుకునేది.
పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్‌గా ప్రస్థానం ప్రారంభించింది. ప్రతిష్ఠాత్మకమైన మంగళ్‌యాన్ మిషన్‌తో పాటు ఇస్రోలోని ఎన్నో ప్రాజెక్ట్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించింది రీతూ కరిధాల్.
‘మంగళ్‌యాన్ మిషన్ కోసం పనిచేయడం అపూర్వ అనుభవం. నిరంతర మేధోమథనం జరుగుతుండేది. సెలవు అంటూ లేకుండా పనిచేశాం. వృత్తి, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం అంత తేలిక కాదు. అయితే నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్ల అది సాధ్యం అయింది’ అంటుంది రీతూ కరిధాల్.
రీతూ కరిధాల్
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ఇస్రో
ఒకప్పుడు ఇస్రోలో పనిచేసిన మహిళలు రిటైర్ అయిన తరువాత ఇంటికే పరిమితం కావచ్చుగాక, అయితే వారు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్రో కొలువుదీరుతుంది. ఆనాటి శాస్త్రసాంకేతిక విషయాల గురించి చందమామ కథల్లా ఈతరం పిల్లలకు చెబుతుంటారు. అలాంటి వారిలో ఇస్రోలో తొలి మహిళా కెమికల్ ఇంజనీర్ లలితా రామచంద్రన్ ఒకరు. 1969లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్‌ఎస్‌సి)లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరినప్పుడు ఆమె వయసు 22 సంవత్సరాలు. తిరువనంతపురంలో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆమె రిటైర్ అయ్యారు. ‘ఆరోజుల్లో పెద్దగా సౌకర్యాలు లేకపోవచ్చు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది’ అంటారు లలిత.
1972లో ఇస్రోలో చేరారు జె.గీత. ‘ఆరోజుల్లో నెట్ లేదు. డేటా సేకరణ అనేది ప్రధాన సవాలుగా ఉండేది. రిసెర్చ్, రిఫరెన్స్ కోసం లైబ్రరీలకు వెళ్లి గంటల కొద్ది సమయం గడిపేవాళ్లం’ అంటున్న గీత... సతీష్‌ధావన్, వసంత్ ఆర్ గోవరికర్‌లాంటి స్టాల్‌వాల్ట్స్ మార్శదర్శకత్వంలో పనిచేశారు.
ప్రాజెక్ట్‌లకు సంబంధించిన చర్చల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తమ అభిప్రాయలను నిస్సంకోచంగా చెప్పే స్చేచ్ఛ ఉండేది. జూనియర్ చెప్పినా సరే, ఆ అభిప్రాయం నచ్చితే ఆమోదించేవారు’ అంటున్న రాధిక రామచంద్రన్ ‘కేరళ యూనివర్శిటీ’లో పోస్ట్ గ్రాడ్య్రుయేషన్ పూర్తయిన తరువాత 1984లో ఇస్రోలో చేరారు.
లలితా రామచంద్రన్
సైన్స్ ఫిక్షన్‌టుఇస్రో సైంటిస్ట్
తన చిన్నప్పుడు టెలివిజన్‌లో వచ్చే స్టార్ ట్రెక్, సైన్స్ ఫిక్షన్ అంటే నందిని హరినాథ్‌కు చాలా ఇష్టం. టీవిలో వచ్చే సైన్స్ ప్రోగ్రామ్స్‌పై అమిత ఆసక్తి ప్రదర్శించే నందిని తాను స్పేస్ సైంటిస్ట్ అవుతానని అనుకోలేదు. ‘జస్ట్ అలా జరిగింది అంతే!’ అని స్పేస్ సైంటిస్ట్ గా తన ప్రయాణం గురించి నవ్వుతూ చెబుతుంది నందిని. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసిన రోజులు ఉన్నాయి. భోజనం చేయడం కూడా మరిచి పనిచేసిన రోజులు ఉన్నాయి.
‘ఇస్రో సైంటిస్ట్ అని పరిచయం చేసినప్పుడు ప్రజలు గౌరవించే తీరు వృత్తిపట్ల బాధ్యతను మరింత పెంచుతుంది. మంగళ్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం గర్వంగా భావిస్తున్నాను. ఆ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నప్పుడు నిద్ర, తిండి గురించి పట్టించుకునేవాళ్లం కాదు. ఇంట్లో తక్కువ సమయం మాత్రమే గడిపేవాళ్లం. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం’ అంటుంది నందిని హరినాథ్.
నందిని హరినాద్
వివక్ష లేదు... ప్రతిభే ప్రమాణం
‘నేను ఇస్రోలో 1982లో చేరినప్పుడు అక్కడ కొద్ది మంది మహిళా ఉద్యోగులు మాత్రమే కనిపించేవారు. ఊహకు అందని రీతిలో ఇప్పుడు ఎంతోమంది పనిచేస్తున్నారు’ అంటుంది అనురాధ టికె. ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో జియోశాట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన అనురాధ ఎంతోమంది అమ్మాయిలకు రోల్ మోడల్. ‘తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆకాశంపై ఆసక్తి మొదలైంది’ అని తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనురాధ. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగు పెట్టడం గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ద్వారా విన్న అనురాధ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. ‘చంద్రుడిపై మానవుడు’ అనే అంశంపై తన మాతృభాష కన్నడంలో కవిత రాసింది.
‘ఇస్రోలో స్త్రీ, పురుషులు అనే భేదం ఉండదు. ప్రతిభ, అంకితభావం మాత్రమే ప్రమాణం. స్పేస్ ప్రోగ్రామ్స్‌లో ఎంతమంది మహిళలు పనిచేస్తే అంత మంచిది. అది ఎంతో అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. వారు చేస్తున్నారు. మేము కూడా చేయగలం అనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది’ అంటుంది అనురాధ.
అనురాధ టికె
భూదేవి అంత ఓపిక... ఆకాశమంత ప్రతిభ
ప్రతిష్ఠాత్మకమైన మంగళ్‌యాన్ మిషన్ ప్రతిభావంతులైన మహిళా శాస్త్రవేత్తలను లోకానికి పరిచయం చేసింది. ఆ మహిళా శాస్త్రవేత్తలపై ‘ఇస్రో’స్ మాగ్నిఫిసియెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ పేరుతో పుస్తకం రాసింది మిన్నీ వేద్. నందిని, రీతూ కరిధాల్, మౌమిత దత్తా, మినై సంపత్... మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాసింది. ‘స్పేస్’ను కెరీర్‌గా ఎంచుకోవడానికి కారణం ఏమిటి? రకరకాల ఒత్తిళ్లను తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారు? వృత్తి, కుటుంబ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారు?.... ఇలాంటి ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానం చెబుతుంది.
మన దేశంలో ఫస్ట్ ఇండిజినస్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ రిసాట్–1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన వలర్మతి వ్యక్తిగత, ఉద్యోగ జీవిత అనుభవాలు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. మంగళ్‌యాన్ మిషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్‌చార్జిగా పనిచేసిన మినాల్ సంపత్ స్పేస్‌క్రాఫ్ట్ టెస్టింగ్ పనుల్లో భాగంగా బెంగళూరు, అహ్మదాబాద్‌ల మధ్య తరచు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో మూడు సంవత్సరాల తన కుమారుడు గుర్తుకు వచ్చేవాడు. ‘మా బాబు గుర్తుకు వచ్చిన సమయంలో పేలోడ్స్ కూడా నా బిడ్డలే కదా అనుకునేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మినాల్ సంపత్. ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి.