అంతరిక్ష యాత్రలో మరో ముందడుగు: ఇస్రో
బెంగళూరు: గగన్‌యాన్ యాత్రకు సంబంధించి కీలకమైన పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మంగళవారం ప్రకటించింది. భారత అంతరిక్ష యాత్రలో ఇదొక ముందుడుగు అని అభివర్ణించింది. ఈ నెల 3వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్(బీఎఫ్‌ఎఫ్‌ఆర్)లో గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ కోసం పారాషూట్ల టెస్టు నిర్వహించామని ఇస్రో తెలియజేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటిగ్రేటెట్ మెయిన్ పారాషూట్ ఎయిర్‌డ్రాప్ పరీక్షల(ఐమ్యాట్) శ్రేణిలో ఇదొక భాగమని ఒక ప్రకటనలో పేర్కొంది.
గగన్‌యాన్ మిషన్ కోసం పారాషూట్ వ్యవస్థ అర్హతను పరీక్షించమే వీటి ఉద్దేశమని స్పష్టంచేశారు. మొట్టమొదటి మానవ సహిత స్పేస్‌ఫ్లైట్‌ను అంతరిక్షంలోకి పంపించడమే గగన్‌యాన్ యాత్ర లక్ష్యం. ముగ్గురు స్వదేశీ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తారు. అనంతరం భూమిపైకి క్షేమంగా తిరిగివస్తారు. ఇది మొత్తం మూడు రోజుల యాత్ర.
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో ఒక ప్రత్యేక లాంచ్ వెహికల్, ఆర్బిటాల్ మాడ్యూల్, క్రూ–ఎస్కేప్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఆయా పరికరాలు, వ్యవస్థలను పరీక్షించడానికి తొలుత మానవ రహిత యాత్రలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లు తేలిన తర్వాత మానవ సహిత యాత్ర జరుగుతుంది. గగన్‌యాన్ క్రూ మాడ్యూల్‌లోని పారాషూట్ సిస్టమ్‌లో నాలుగు రకాల పారాషూట్‌లు మొత్తం 10 ఉంటాయి.
వ్యోమగాములు భూమిపైన క్షేమంగా దిగడానికి ఇవి తోడ్పడుతాయి. తాజా పరీక్షలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్–76 విమానం ద్వారా పారాషూట్లను 2.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, కిందికి జారవిడిచారు. ఎలాంటి లోపాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం అవి భూమిపైకి చేరుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రోతోపాటు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, డీఆర్‌డీఓ, భారత సైన్యం, వైమానిక దళం కూడా ఈ టెస్టులో పాల్గొన్నాయి.


