
ఓ హెడ్‌మాస్టర్ నిర్వాకం!
తప్పించుకునే ప్రయత్నంలో కిటికీ గ్రిల్‌లో ఇరుక్కున్న చిన్నారి తల
కాపాడిన గ్రామస్థులు
భువనేశ్వర్: ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నిర్వాకమిది. బెంచీపై నిద్రిస్తున్న రెండో తరగతి చదివే ఎనిమిదేళ్ల చిన్నారిని అలాగే క్లాస్ రూంలో వదిలి, తాళమేసి ఇంటికి వెళ్లిపోయాడు. మెలకువ వచ్చాక ఆ చిన్నారి కేకలు వేసినా ఎవరికీ వినిపించలేదు. రాత్రంతా చీకట్లో, ఒంటరిగా అలాగే భయంభయంగా ఉండిపోయింది. చివరికి కిటికీలోంచి దూరి బయటకు వచ్చేందుకు శతథా ప్రయత్నించింది. వీలుకాక కిటికీ గ్రిల్‌లో తల ఇరుక్కుపోయింది.
ఉదయం గ్రామస్తులు వచ్చి చూసే వరకు కొన్ని గంటలపాటు అలాగే వేదన అనుభవించింది. కియోంఝర్ జిల్లాలో అన్జార్‌లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఘటన చోటుచేసుకుంది. రెండో తరగతి చదువుతున్న జోత్య్స దెహురి(8) అనే చిన్నారి తరగతి గదిలో ఓ బెంచీపై పడుకుని అలాగే నిద్రపోయింది. ఆమెను పట్టించుకోకుండా ఉపాధ్యాయుడు తరగతి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. చిన్నారి చీకటిపడిన రాకపోయేసరికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊరంతా వెదికారు. శుక్రవారం ఉదయం ఆ స్కూలు వైపుగా వెళ్లిన గ్రామస్తులకు కిటికీ గ్రిల్‌లో తల ఇరుక్కుపోయిన స్థితిలో జోత్స్న రోదిస్తూ కనిపించింది.
వెంటనే గ్రిల్స్‌ను తొలగించి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో స్కూలు ఇన్‌ఛార్జి హెడ్మాస్టర్ గౌరహరి మహంతాను అధికారులు సస్పెండ్ చేశారు. తరగతి గది కిటికీ గ్రిల్‌లో చిన్నారి తల ఇరుక్కున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఉపాధ్యాయుల వైఖరిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సాయంత్రం 4 గంటల తర్వాత తరగతి గదికి తాళాలు వేయాలంటూ 8వ తరగతి విద్యార్థులకు హెడ్మాస్టర్ చెప్పినట్లు విచారణలో తేలిందని డీఈవో వెల్లడించారు.