
టీమిండియా వెటరన్, ముంబై క్రికెట్ దిగ్గజం అజింక్య రహానే(Ajinkya Rahane) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాబోయే దేశవాళీ సీజన్‌కు ముంబై జట్టు కెప్టెన్సీ నుంచి రహానే తప్పుకొన్నాడు. ఈ సీనియర్ ప్లేయర్ నాయకత్వంలోనే 2023-24 రంజీ ట్రోఫీని ముంబై సొంతం చేసుకుంది.
అంతేకాకుండా 2024లో ఇరానీ కప్‌ను కూడా ముంబైకి అజింక్య అందించాడు. అయితే ముంబై జట్టుకు కొత్త నాయకుడిని తాయారు చేసే సమయం అసన్నమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహానే వెల్లడించాడు.
"ముంబై జట్టు తరపున ఛాంపియన్‌షిప్‌లు గెలవడం, కెప్టెన్‌గా పనిచేయడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. మరి కొన్ని రోజుల్లో కొత్త డొమాస్టిక్ సీజన్ (2025-2026) ప్రారంభం కానుంది. కాబట్టి కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు ఇదే సరైన సమయం.
అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆటగాడిగా మాత్రం కొనసాగనున్నాను. ఆటగాడిగా అత్యుత్తమ ప్రదర్శన చేసి ముంబైకి మరిన్ని ట్రోఫీలను అందించేందుకు ప్రయత్నిస్తాను" అని ఎక్స్‌లో రహానే రాసుకొచ్చాడు.
కాగా రహానే ముంబై కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022-23లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, 2022-23లో దులీప్ ట్రోఫీ, 2023-24లో రంజీ ట్రోఫీ వంటి టైటిల్స్‌ను కెప్టెన్‌గా రహానే గెలుచుకున్నాడు. అంతేకాకుండా రహానే గతంలో టీ20లు, వన్డేలు, టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. రహానే ప్రస్తుతం ఐపీఎల్‌లో కేకేఆర్ సారథిగా ఉన్నాడు.
ఈ ఏడాది రహానే తన 9వ ఫస్ట్-క్లాస్ సీజన్ ఆడనున్నాడు. అయితే రహానేకు దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్ జోన్ జట్టులో చోటు దక్కలేదు. అతడికి బదులుగా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌ను కెప్టెన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో ముంబై జట్టుకు 17 ఏళ్ల ఆయుష్ మాత్రే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇక రహానే వారుసుడిగా ముంబై జట్టు పగ్గాలు చేపట్టేందుకు చాలా మంది ఉన్నారు. వారిలో శార్ధూల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్ ముందంజలో ఉంటారు.
చదవండి: హ్యాట్సాఫ్ ధనశ్రీ: రోహిత్ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా