జంషెడ్‌పూర్: రంజీ ట్రోఫీలో ఆంధ్ర క్రికెట్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో జార్ఖండ్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 34/2తో చివరి రోజు ఆట కొనసాగించిన జార్ఖండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 52.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది.
శరణ్‌దీప్ సింగ్ (65) అర్ధ సెంచరీ చేయగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో సౌరభ్ కుమార్ (5/57) ఐదు వికెట్లతో చెలరేగగా, త్రిపురాణ విజయ్‌కు 3 వికెట్లు దక్కాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచి, 2 ‘డ్రా’ చేసుకున్న ఆంధ్ర గ్రూప్ ‘ఎ’లో 22 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
చిత్తుగా ఓడిన హైదరాబాద్...
జమ్మూ: గ్రూప్ ‘డి’లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 281 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 472 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 169/7తో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ 57.5 ఓవర్లలో 190 పరుగులకే ఆలౌటైంది.
మరో 21 పరుగులు మాత్రమే జోడించి జట్టు మిగిలిన 3 వికెట్లు కోల్పోయింది. జమ్మూ కశ్మీర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆబిద్ ముష్తాక్ (7/68) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. 5 మ్యాచ్‌ల్లో 1 గెలిచి, 1 ఓడి, 3 ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
రంజీకి విరామం...
బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం ఈ దశలో రంజీ ట్రోఫీకి విరామం రానుంది. దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (నవంబర్ 26–డిసెంబర్ 18), వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (డిసెంబర్ 24–జనవరి 18)లను ఈ మధ్య కాలంలో నిర్వహిస్తారు. ఆ తర్వాత రంజీ ట్రోఫీ కొనసాగుతోంది. జనవరి 26 నుంచి జరిగే తమ తర్వాతి రంజీ మ్యాచ్‌ల్లో విదర్భతో ఆంధ్ర, ముంబైతో హైదరాబాద్ తలపడతాయి.


