స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ముగించుకున్న టీమిండియా.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే, టీ20లు ఆడనుంది. జనవరి 11 - జనవరి 31 మధ్య భారత్- కివీస్ జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే, ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన జట్టునే కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఫైనల్ చేసింది బీసీసీఐ.
వన్డేల్లోనూ పునరాగమనం!
అయితే, వన్డేలకు మాత్రం శనివారం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది. అనూహ్య రీతిలో టీ20 ప్రపంచకప్‌తో టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చిన జార్ఖండ్ డైనమైట్.. వన్డేల్లోనూ పునరాగమనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ కోటాలోని రిషభ్ పంత్ వరుస వైఫల్యాల(VHT) నేపథ్యంలో.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఇషాన్ రేసులోకి వచ్చాడు.
ఈ నేపథ్యంలో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో.. శనివారం నాటి మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ప్రదర్శన ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కర్ణాటకతో మ్యాచ్‌లో 33 బంతుల్లోనే శతక్కొట్టిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా కేరళతో మ్యాచ్‌లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.
సెలక్షన్ రోజు విఫలం
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు సెలక్షన్ రోజు ఇషాన్ (Ishan Kishan).. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. జార్ఖండ్ తరఫున కెప్టెన్ ఇషాన్ విఫలం కాగా.. కుమార్ కుశాగ్రా అజేయ, భారీ శతకం (143)తో అదరగొట్టగా.. అనుకూల్ రాయ్ (72) కూడా ఆకట్టుకున్నాడు.
వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా జార్ఖండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగలిగింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఫెయిలైనా కివీస్‌తో వన్డేలకు అతడు ఎంపికయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాగా దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ ఇరగదీసిన విషయం తెలిసిందే.
ఏకంగా ప్రపంచకప్ జట్టులోకి
జార్ఖండ్ సారథిగా.. బ్యాటర్‌గా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్.. జట్టుకు తొలి దేశీ టీ20 టైటిల్ అందించాడు. 500కు పైగా పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గానూ నిలిచాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి రిషభ్ పంత్‌ను కాకుండా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. సంజూ శాంసన్‌కు బ్యాకప్ కీపర్, ఓపెనర్‌గా అతడు ఉపయోగపడతాడన్న ఆలోచనతో రీఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు.
కాగా క్రమశిక్షణా రాహిత్యం కారణంగా రెండేళ్లకు పైగా ఇషాన్ టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, తన అద్భుత ఆట తీరు, నైపుణ్యాలతో తిరిగి జట్టులో స్థానం సంపాదించాడు.
చదవండి: శతక్కొట్టిన హార్దిక్ పాండ్యా.. కెరీర్‌లో ‘తొలి’ సెంచరీ!


