శతక్కొట్టిన హార్దిక్‌ పాండ్యా.. కెరీర్‌లో ‘తొలి’ సెంచరీ! | VHT: Hardik Pandya Slams 68 Ball Maiden List A century | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన హార్దిక్‌ పాండ్యా.. కెరీర్‌లో ‘తొలి’ సెంచరీ!

Jan 3 2026 1:18 PM | Updated on Jan 3 2026 3:22 PM

VHT: Hardik Pandya Slams 68 Ball Maiden List A century

టీమిండియా జెర్సీలో హార్దిక్‌ (ఫైల్‌ ఫొటో)

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా విధ్వంసకర శతకం బాదాడు. బరోడా తరఫున కేవలం 68 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మరీ హార్దిక్‌ పాండ్యా ఈ మేర తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడటం విశేషం.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాలకు అనుగుణంగా టీమిండియా తరఫున విధుల్లో లేని స్టార్లంతా దేశీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) సైతం శనివారం బరోడా తరఫున రంగంలోకి దిగాడు. రాజ్‌కోట్‌ వేదికగా విదర్భతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన బరోడా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

టాపార్డర్‌ విఫలం
అయితే, విదర్భ పేసర్‌ నచికేత్‌ భూటే ఆరంభంలోనే బరోడాకు షాకిచ్చాడు. ఓపెనర్లలో అమిత్‌ పాసీ (0) డకౌట్‌ చేసిన ఈ రైటార్మ్‌ బౌలర్‌.. నిత్యా పాండే (15)ను సైతం పెవిలియన్‌కు పంపాడు.

ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాన్షు మొలియా (16).. ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌ చేసిన అతిత్‌ షేత్‌ (21), కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా (23) నిరాశపరచగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (9) విఫలమయ్యాడు.

ఎనిమిది ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో
ఇలాంటి దశలో హార్దిక్‌ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై దాడికి దిగాడు. మొత్తంగా 92 బంతులు ఎదుర్కొన్న ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. ఎనిమిది ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 133 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విష్ణు సోలంకి (17 బంతుల్లో 26) ఫర్వాలేదనిపించగా.. రాజ్‌ లింబాని (10) తేలిపోయాడు.

ఆఖర్లో మహేశ్‌ పతియా 18, కరణ్‌ ఉమాట్‌ 13 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా బరోడా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 293 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. విదర్భ బౌలర్లలో యశ్‌ ఠాకూర్‌.. అతిత్‌, జితేశ్‌, హార్దిక్‌, రాజ్‌ రూపంలో నాలుగు కీలక వికెట్లు కూల్చగా.. నచికేత్‌ భూటే, పార్థ్‌ రేఖడే చెరో రెండు, ప్రఫుల్‌ హింగే ఒక వికెట్‌ పడగొట్టారు.

లిస్ట్‌-ఎ క్రికెట్‌లో తొలి సెంచరీ
హార్దిక్‌ పాండ్యాకు లిస్‌-ఎ క్రికెట్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. విదర్భతో మ్యాచ్‌లో అర్ధ శతకానికి 44 బంతులు తీసుకున్న ఈ ఆల్‌రౌండర్‌.. మరో 24 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుని ఆశ్చర్యపరిచాడు.

కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 94 వన్డేలు ఆడిన హార్దిక్‌ పాండ్యా.. వీటితో కలిపి 119 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 2020లో 92 పరుగులతో అజేయంగా నిలిచిన హార్దిక్‌ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో ఆగిపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేసుకున్నాడు.

మొత్తంగా ఇప్పటికి తన ఖాతాలో 2350 లిస్ట్‌-ఎ పరుగులు జమచేసుకున్నాడు. అతడి ఖాతాలో 110 వికెట్లు కూడా ఉండటం విశేషం. న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌కు ముందు పాండ్యా ఇలా శతక్కొట్టడం టీమిండియాకు శుభవార్త. అయితే, కివీస్‌తో ఐదు టీ20లు, టీ20 ప్రపంచకప్‌-2026 దృష్ట్యా హార్దిక్‌ పాండ్యాకు వన్డేల నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: IND vs NZ: పంత్‌పై వేటు.. దేశీ ‘హీరో’ ఎంట్రీ!.. సిరాజ్‌కు చోటిస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement