సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26లో భాగంగా నిన్న (జనవరి 7) ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈ భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో సూపర్ జెయింట్స్‌పై క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది.
షాయ్ హోప్ (69 బంతుల్లో 118 నాటౌట్; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. ఛేదనలో జోస్ బట్లర్ (52 బంతుల్లో 97 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత పోరాటం చేసినా సూపర్ జెయింట్స్‌ను గెలిపించలేకపోయాడు.
బట్లర్‌కు మరో ఎండ్ నుంచి సహకారం లభించకపోవడంతో సూపర్ జెయింట్స్ 19.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో చివరి ఆరుగురు ఆటగాళ్లలో ఏకంగా ఐదుగురు డకౌటయ్యారు. లుంగి ఎంగిడి హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగి సూపర్ జెయింట్స్‌ను దెబ్బకొట్టాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో ఇదే తొలి హ్యాట్రిక్.
ఇన్నింగ్స్ 18వ ఓవర్ రెండు, మూడు, నాలుగు బంతులకు ఎంగిడి డేవిడ్ వీస్, సునీల్ నరైన్, కొయెట్జీ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ పరిణామంతో అప్పటిదాకా గెలుపు దిశగా సాగిన సూపర్ జెయింట్స్ ఒక్కసారిగా మొమెంటమ్ కోల్పోయింది. ఆతర్వాతి ఓవర్‌లో (19వ ఓవర్) బట్లర్ 2 సిక్సర్లు, ఓ బౌండరీ బాది 22 పరుగులు పిండుకున్నా, చివరి ఓవర్‌లో చేతులెత్తేశాడు.
తొలి రెండు బంతులను వృధా చేయగా.. ఆతర్వాత రెండు బంతులకు మపాకా, నూర్ అహ్మద్ రనౌటయ్యారు. దీంతో సూపర్ జెయింట్స్‌కు ఓటమి తప్పలేదు. చివరి దాకా వీరోచితంగా పోరాడిన బట్లర్ చివరి ఓవర్‌లో ఏమీ చేయలేకపోయాడు. వెరసి సూపర్ జెయింట్స్ లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది.


