
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి (Devisha Shetty)ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) మాజీ భార్య ధనశ్రీ వర్మకు మద్దతు తెలుపుతూ ఓ షార్ట్ వీడియోను దేవిశా షేర్ చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.
ఈ ఏడాది విడాకులు మంజూరు
అసలేం జరిగిందంటే.. కొరియోగ్రాఫర్, నటి అయిన ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్ 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే వైవాహిక బంధంలో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉంటున్న ఈ జంటకు.. ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి.
చహల్ స్పందన ఇది
ఈ విషయం గురించి చహల్ స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించినా.. విడిపోక తప్పలేదంటూ ధనశ్రీని పరోక్షంగా విమర్శించాడు. ఇక విడాకులకు ముందే ఆర్జే మహ్‌వశ్‌తో కలిసి ట్రిప్పులకు వెళ్లిన చహల్.. ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తమ మధ్య ప్రేమ లేదని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల తీర్పు కోసం వెళ్లిన సమయంలో చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కొటేషన్ ఉన్న కస్టమైజ్డ్ టీ షర్టు వేసుకున్నాడు. దీనర్థం.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’. దీనిని బట్టి ధనశ్రీ భరణం అడుగుతున్న కారణంగానే చహల్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేశారు.
‘గోల్డ్ డిగ్గర్’ పోస్టుకు లైక్ కొట్టిన రితికా
మరోవైపు.. చహల్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్‌వశ్ సైతం.. ధనశ్రీని నిందించేలా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి అదే సమయంలో పోస్ట్ పెట్టింది. ఇంకోవైపు.. జర్నలిస్టు శుభంకర్ మిశ్రా ధనశ్రీని ‘గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే మహిళ)’ అంటూ అసభ్యకర రీతిలో విమర్శించాడు.
ఇందుకు.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ కొట్టి.. పరోక్షంగా ధనశ్రీపై ఆ జర్నలిస్టులాగే నిందలు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధనశ్రీ వర్మ తన విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడింది.
గట్టిగా ఏడ్చేశా
తన జీవిత భాగస్వామి కోసం చేయాల్సినవన్నీ చేశానని.. అయితే, అతడే ముందుగా వైవాహిక బంధం నుంచి వైదొలిగాడని ధనశ్రీ తెలిపింది. అంతేకాదు.. తనపై నిందలు మోపేలా చహల్ అలాంటి టీ షర్టు ధరిస్తాడని ముందుగానే తనకు తెలుసునంది. తన పార్ట్‌నర్‌ను ఎంతో ప్రేమించానని.. అందుకే విడాకుల తీర్పు వినగానే కోర్టులోనే గట్టిగా ఏడ్చేశానంటూ ఆవేదనను పంచుకుంది.
విడాకుల నేపథ్యంలో తనపై విపరీతమైన నెగటివిటీ వచ్చిందని.. అయితే, తన తల్లిదండ్రుల కోసం స్ట్రాంగ్‌గా ఉన్నట్లు నటిస్తున్నానని ధనశ్రీ చెప్పుకొచ్చింది. సున్నితమైన ఈ అంశంలో తన గోప్యతకు భంగం కలిగించేలా ఎంతో మంది ఎన్నో విధాలుగా పిచ్చి కూతలు కూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అత్యంత గౌరవం, ప్రేమ.. హ్యాట్సాఫ్
ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన దేవిశా శెట్టి.. ‘‘నీ పట్ల అత్యంత గౌరవం, ప్రేమ ఉన్నాయి’’ అంటూ ధనశ్రీ వర్మకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ధనశ్రీ పట్ల టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల సతీమణులు.. రితికా సజ్దే, దేవిశా శెట్టి వైఖరిని పోలుస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
తొలుత తప్పంతా ధనశ్రీ వర్మదే అని భావించినా.. కొత్త మహిళ రాక (మహ్‌వశ్)తో అంతా అర్థమైపోయిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే ధనశ్రీనే నిందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఆసియా కప్-2025 టోర్నీతో బిజీ కానున్నాడు. మరోవైపు.. టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ వన్డే రీఎంట్రీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక చహల్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే?