
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) గత కొన్నాళ్లుగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. భార్య ధనశ్రీ వర్మ (Dhanashree Verma)తో విడాకుల నేపథ్యంలో ఆర్జే మహ్‌వశ్ (RJ Mahvash)తో అతడు తరచూ కలిసి కనిపించడం డేటింగ్ వదంతులకు ఊతమిచ్చింది. ధనశ్రీతో విడిపోయే ముందు నుంచే వీరిద్దరు చెట్టాపట్టాలు వేసుకుని జంటగా కనిపించడంతో చహల్‌పై ట్రోల్స్ వచ్చాయి.
మానసికంగా కుంగిపోయా..
ఇటీవల ఈ విషయంపై స్పందిస్తూ.. మహ్‌వశ్ తనకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పిన చహల్.. తన వైవాహిక జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను మనస్ఫూర్తిగా ధనశ్రీని ప్రేమించానని.. అయినప్పటికీ పరిస్థితి విడాకుల దాకా వచ్చిందని పేర్కొన్నాడు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయి ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశానని వెల్లడించాడు.
ఆ మాట వినగానే ఏడ్చేశా
ఈ నేపథ్యంలో చహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తాజాగా విడాకుల అంశంపై స్పందించింది. హ్యూమన్స్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘విడాకుల కోసం మేము మానసికంగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాము. కానీ.. ఆరోజు జడ్జిగారు తీర్పు ఇస్తున్నపుడు నేను భావోద్వేగాలను అదుపుచేసుకోలేకపోయాను.
అందరి ముందే గట్టిగా ఏడవడం నాకింకా గుర్తుంది. అసలు అప్పుడు నా మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో వేరెవరూ అర్థం చేసుకోలేరు. నేను అలా ఏడుస్తూ ఉండిపోయానంతే. అయినా ఇది జరిగిపోయిన విషయం.
అతడే వదిలేశాడు
అతడే (చహల్) ముందుగా వైవాహిక జీవితం నుంచి బయటకు వెళ్లిపోయాడు’’ అంటూ ధనశ్రీ వర్మ తన ఆవేదనను పంచుకుంది. ఇక విడాకుల మంజూరు సందర్భంగా చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కోట్ రాసి ఉన్న టీ షర్టు ధరించడం గురించి ధనశ్రీకి ప్రశ్న ఎదురైంది.
డ్రామాలు అవసరమా?
ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఎదుటి వాళ్లు మనల్ని నిందిస్తారు. ఇలాంటి టీ- షర్టు స్టంట్ ఉంటుందని నాకు ముందుగానే తెలుసు. ఈ విషయంలో తప్పంతా నాదేనని చిత్రీకరించేందుకు వాళ్లు సిద్ధంగా ఉంటారనీ తెలుసు.
అయినా.. వాట్సాప్‌లో నాకు ఆ మెసేజ్ పెట్టి ఉంటే సరిపోయేది కదా!.. ఈ టీ-షర్టు డ్రామా ఎందుకు?’’ అంటూ ధనశ్రీ చహల్‌కు కౌంటర్ ఇచ్చింది. ఇక తన వైవాహిక జీవితంలో భాగస్వామికి ఎల్లవేళలా మద్దతుగా ఉన్నానని ధనశ్రీ స్పష్టం చేసింది.
‘‘నా జీవిత భాగస్వామికి ఎల్లప్పుడూ అండగా ఉన్నాను. ప్రతీ చిన్న, పెద్ద విషయంలో అతడికి తోడుగా ఉన్నాను. మా అన్యోన్యత గురించి అందరికీ తెలుసు. అందుకే విడిపోతున్నామని తెలిసినపుడు నా మనసు అంతగా వేదనకు గురైంది’’ అని ధనశ్రీ తాను చహల్ పట్ల ప్రేమ, అంకితభావంతో మెలిగానని పేర్కొంది.
కాగా కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మను 2020లో చహల్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లైన రెండేళ్లకే విభేదాలు తలెత్తగా ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడిపోయారు.
భరణంగా రూ. 4 కోట్ల 75 లక్షలు
ఈ క్రమంలో కోర్టుకు హాజరైన చహల్.. ‘‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’’ అన్న కొటేషన్ ఉన్న నలుపు రంగు టీ- షర్టు ధరించాడు. భరణంగా మాజీ భార్యకు రూ. 4 కోట్ల మేర చెల్లించేందుకు అంగీకరించిన చహల్ ఈ చర్య ద్వారా పరోక్షంగా ధనశ్రీకి కౌంటర్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే?