
రియల్ మనీ గేమ్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంతో ఆయా కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వెంచర్ క్యాపిటల్ (వీసీ), ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు నష్టపోతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో దేశంలో ప్రముఖంగా ఉన్న డ్రీమ్ 11, నజారా టెక్నాలజీస్, జూపీ, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్), గేమ్స్ 24×7 వంటి సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 2.4 బిలియన్ డాలర్లను సమీకరించాయి. అందుకు టైగర్ గ్లోబల్, కలారి క్యాపిటల్, బేస్ పార్టనర్స్ వంటి సంస్థలు ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీటికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌ను నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు 2025కు పార్లమెంట్ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా డ్రీమ్ 11 భారతదేశపు అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఒకటిగా నిలుస్తుంది. ఇది 2014 నుంచి 1.6 బిలియన్ డాలర్లకు పైగా నిధులను ఆకర్షించింది. టెన్సెంట్, కలారి క్యాపిటల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టాయి. ఒక్క కలారి క్యాపిటల్ మాత్రమే 100 మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేసింది. వీసీలు, పీఈలు వేగంగా విస్తరిస్తున్న ఈ రంగాన్ని అధిక వృద్ధి అవకాశం భావించాయి. అయితే రియల్ మనీ గేమింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ పెట్టుబడుల విలువను దెబ్బతీస్తుందని, ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు.
విలువను విస్మరించడం ఆశ్చర్యం
రియల్ మనీ గేమింగ్‌పై నిషేధం విధించడంపై ఇండస్ట్రీ పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డ్రీమ్ 11 పాలసీ కమ్యూనికేషన్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్ స్మృతి సింగ్ చంద్ర లింక్డ్ఇన్‌లో తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి, గేమింగ్ రంగం సృష్టించిన గణనీయమైన విలువకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఎత్తిచూపారు. ఆర్టికల్ 19(1)(జీ) ప్రకారం నైపుణ్య క్రీడలకు రాజ్యాంగ రక్షణ ఉన్నప్పటికీ కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు డ్రీమ్ 11 వంటి వేదికలను నేరంగా పరిగణిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ పరిశ్రమ సృష్టించిన విలువను ప్రభుత్వం విస్మరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 2025 నాటికి భారత ఫాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ 1.82 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 5.05 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.