రూ. 523 కోట్ల మొత్తాన్ని స్తంభింపచేసిన ఈడీ
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు చెందిన రూ. 523 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఇటీవల రియల్ మనీ గేమింగ్‌ని నిషేధించిన తర్వాత ఆ మొత్తాన్ని ప్లేయర్లకు రిఫండ్ చేయాల్సి ఉన్నప్పటికీ ఆయా కంపెనీలు తమ దగ్గరే అట్టే పెట్టుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. విన్‌జో, గేమ్స్‌క్రాఫ్ట్ తదితర గేమింగ్ కంపెనీల డిపాజిట్లు వీటిలో ఉన్నాయి.
మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా నవంబర్ 18–22 మధ్య ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్‌లోని నిర్దేశ నెట్‌వర్క్స్ (ఎన్‌ఎన్‌పీఎల్), గేమ్స్‌క్రాఫ్ట్ టెక్నాలజీస్ (జీటీపీఎల్), విన్‌జో గేమ్స్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రియల్ మనీ గేమ్స్‌లో (ఆర్‌ఎంజీ) మనుషులతో కాకుండా సాఫ్ట్‌వేర్‌తో ఆడుతున్న విషయాన్ని కస్టమర్లకు తెలియనివ్వకుండా విన్‌జో అనైతిక వ్యాపార విధానాలు అమలు చేసిందని, క్రిమినల్ కార్యకలాపాలు నిర్వహించిందని ఈడీ ఆరోపించింది. గేమర్లకు రిఫండ్ చేయాల్సిన మొత్తాన్ని తమ ఖాతాల్లో అట్టే పెట్టుకుందని పేర్కొంది. గేమ్స్‌క్రాఫ్ట్‌పై కూడా ఇదే తరహా ఆరోపణలున్నట్లు వివరించింది.


