
ప్రభుత్వ వైద్య రంగంలో ఇప్పటికే ఉన్న సమర్థ
వ్యవస్థలను నీరుగారుస్తూ తెరపైకి ‘డింక్’ ప్రాజెక్టు
జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్‌లతో పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు
గొప్పగా నడుస్తున్న వ్యవస్థను అటకెక్కించి ముడుపుల కోసం తెరపైకి బాబు సర్కారు కొత్త ప్రాజెక్టు
గతంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలకే బాబు సర్కారు కలరింగ్.. విలేజ్ క్లినిక్స్‌కు పాతర.. ప్రైవేట్ చేతికి సేవలు
ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ రూ.350 కోట్ల ప్రజాధనానికి టెండర్.. ఇప్పటికే కుప్పంలో మొదలైన ‘పైలెట్’.. ఆపై రాష్ట్రమంతా అమలు
రేషనలైజేషన్ పేరిట దాదాపు మూడువేల ‘విలేజ్ క్లినిక్’లు మూత!.. ఇంత ఖర్చుపెట్టినా అందించేది కేవలం ‘‘టెలీ మెడిసిన్’’ సేవలే
ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో రోగులకు సేవలు బంద్
ఆగిపోయిన ఆరోగ్య ఆసరా.. ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరం
గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసి బాబు సర్కారు ‘ప్రైవేట్’ పాట!
ప్రివెంటివ్ కేర్‌ను బలోపేతం చేస్తూ వైఎస్ జగన్ పాలనలో బలమైన అడుగులు..
ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు ప్రభుత్వ వైద్యుల సేవలు
టెలీ మెడిసిన్ వైద్యసేవల్లో దేశానికే ఆదర్శంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
విప్లవాత్మక రీతిలో తెచ్చిన ‘ఫ్యామిలీ డాక్టర్’ ద్వారా ప్రజల వద్దకే వైద్యులు
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఊరూవాడా స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు.. ఉచితంగా మందులు డోర్ డెలివరీ
రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ప్రజలందరికీ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్’ (డిజిటల్ నెర్వ్ సెంటర్) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్‌లతో పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది.
గతంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలకే కలరింగ్ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్ క్లినిక్స్‌కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘డింక్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.
‘డింక్’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్ క్లినిక్‌లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు.
ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది.
జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి.
‘డింక్’ ప్రాజెక్టు ఏమిటంటే..?
‘డింక్’ పేరిట కుప్పంలో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్ హెల్త్ అకౌంట్ జారీచేసి ఈ సెంటర్ ద్వారా ఫోన్‌లో స్పెషలిస్ట్ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్‌లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
స్థూలంగా చెప్పాలంటే ‘డింక్’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
టెలీ మెడిసిన్‌తో అంతకంటే మెరుగ్గా..
గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్‌సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది.
పీహెచ్‌సీ, విలేజ్ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ సూచించేవారు. పీహెచ్‌సీ, విలేజ్ క్లినిక్‌లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు.
స్మార్ట్‌ఫోన్ లేనివారు, వినియోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు పారదర్శకంగా అందాయి.
నాడు దేశానికే ఆదర్శంగా..
నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్‌లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రివెంటివ్ కేర్ బలోపేతం..
వైఎస్ జగన్ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్ కేర్‌ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్‌సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు/ఒక పీహెచ్‌సీ, ఒక సీహెచ్‌సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు.
అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్‌ను నెలకొల్పారు.
వైద్యులే ప్రజల వద్దకు..
వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్‌సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు.
ఇందులో భాగంగా ఊరూవాడా స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది.
అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది.