breaking news
Government Medical sector
-
కుప్పం నుంచి కుట్రలకు క్లాప్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య రంగంలో అందుబాటులో ఉన్న వనరులను నిర్వీర్యం చేస్తున్న కూటమి సర్కారు పీపీపీ ప్రాజెక్టుల పేరిట ప్రజాధనాన్ని దారి మళ్లిస్తోంది. ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలను నీరుగారుస్తూ ‘డింక్’ (డిజిటల్ నెర్వ్ సెంటర్) పేరుతో ఓ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్‌లతో పీహెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లను అనుసంధానించి స్పెషలిస్టులతో వైద్య సేవలు అందించగా గొప్పగా నడుస్తున్న ఈ వ్యవస్థలను అటకెక్కించిన బాబు సర్కారు ముడుపుల కోసం కొత్త ప్రాజెక్టును తెచ్చింది. గతంలో అందించిన టెలీ మెడిసిన్ సేవలకే కలరింగ్ ఇస్తూ సమర్థంగా సేవలు అందించిన విలేజ్ క్లినిక్స్‌కు పాతరేసింది. వైద్య సేవల్లో ఇప్పుడేదో సరికొత్త వ్యవస్థను తెస్తున్నట్లు మభ్యపెడుతూ ‘డింక్’ పేరుతో రూ.350 కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టింది! సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం కేంద్ర బిందువుగా ‘పైలెట్’ ప్రాతిపదికన ఈ దోపిడీ వ్యవహారాలకు రంగం సిద్ధమైంది. కొద్ది నెలలుగా ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘డింక్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ‘డింక్’ ప్రాజెక్టులో భాగంగా రేషనలైజేషన్ పేరిట ఏకంగా 2,500 నుంచి 3 వేల విలేజ్ క్లినిక్‌లను మూసివేసేందుకు వైద్యశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్యాన్ని అందించిన వ్యవస్థలను నీరుగార్చి ప్రైవేట్ సంస్థల సేవల పట్ల మొగ్గు చూపడం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ఎన్నికైన ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. ఈ క్రమంలో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ వైద్యులే నేరుగా ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేలా విప్లవాత్మక రీతిలో ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి మరీ ప్రజలందరికీ హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు చికిత్సను పేదలకు ఉచితంగా అందించారు. వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తూ జీరో వేకెన్సీ విధానాన్ని అమలు చేశారు. ఏకంగా 54 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీ మాటే లేకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యుల కొరత 50% ఉంటే రాష్ట్రంలో కేవలం 1.4% మాత్రమే ఉంది. జాతీయ స్థాయిలో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61% ఉంటే ఏపీలో 6.2 శాతం మాత్రమే ఉండేది. కేవలం వైద్య నియామకాలే కాకుండా ఆస్పత్రుల్లో మందుల కొరతకు తావు లేకుండా చేశారు. ఇలా ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకుంటూ.. నిధులు దుర్వినియోగం కాకుండా 2019–24 మధ్య జగన్ వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేస్తే నేడు పీపీపీ ప్రాజెక్టుల రూపంలో చంద్రబాబు ప్రజారోగ్యానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేశారు. రోగులకు ఆరోగ్య ఆసరాను ఎగరగొట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులు దాదాపు రూ.నాలుగు వేల కోట్లు పెండింగ్‌లో పెట్టడంతో నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. ‘డింక్’ ప్రాజెక్టు ఏమిటంటే..?‘డింక్’ పేరిట కుప్పంలో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు అనుసంధానించారు. ఇక్కడికి వచ్చే రోగులకు డిజిటల్ హెల్త్ అకౌంట్ జారీచేసి ఈ సెంటర్ ద్వారా ఫోన్లో స్పెషలిస్ట్ వైద్యసేవలను అందచేస్తారు. అవసరం మేరకు వైద్యుడు వీడియో కాల్ చేసి రోగితో మాట్లాడి సలహాలు, సూచనలు ఇస్తారు. సెంటర్లో ఉండే ఆరోగ్య సిబ్బంది గర్భిణులు, బాలింతలు, ఇతరులకు ఆరోగ్య సంరక్షణపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. స్థూలంగా చెప్పాలంటే ‘డింక్’ ప్రాజెక్టు అచ్చు టెలీ మెడిసిన్ లాంటిదే. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కుప్పం పరిధిలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. దీన్ని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి రూ.350 కోట్ల మేర ఖర్చవుతుందని సంబంధిత సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. టెలీ మెడిసిన్‌తో అంతకంటే మెరుగ్గా..గత ప్రభుత్వం పైసా కూడా దుర్వినియోగం కాకుండా అంతకంటే మెరుగ్గా ప్రజలకు టెలీ మెడిసిన్ సేవలను అందించింది. 26 జిల్లాల్లో వైద్య కళాశాలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,400కిపైగా పీహెచ్‌సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ సూచించేవారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్‌లో ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పనిచేసింది. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలు పొందడానికి కూడా ఆస్కారం కల్పించారు. స్మార్ట్‌ఫోన్ లేనివారు, వినియోగం తెలియని వారికి ఆశావర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసిన గత ప్రభుత్వం వాటన్నింటినీ హబ్‌లకు అనుసంధానించింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు, నిధుల దుర్వినియోగానికి ఏమాత్రం తావులేకుండా గత ప్రభుత్వంలో ప్రజలకు టెలీమెడిసిన్ సేవలు పారదర్శకంగా అందాయి.నాడు దేశానికే ఆదర్శంగా..నిధుల దుబారాకు అడ్డుకట్ట వేసి టెలీ మెడిసిన్ వైద్యసేవలు అందించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పీపీపీ ప్రాజెక్టుల రూపంలో రూ.వందల కోట్ల నిధులు దుబారా చేయకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటైన హబ్‌లను మరింత బలోపేతం చేసి టెలీవైద్య సేవలు అందించవచ్చని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు.ప్రివెంటివ్ కేర్ బలోపేతం.. వైఎస్ జగన్ పాలనలో 2019–24 మధ్య ప్రజారోగ్య పరిరక్షణలో అత్యంత కీలకమైన ప్రివెంటివ్ కేర్‌ను బలోపేతం చేశారు. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పట్టణాల్లో 562 యూపీహెచ్‌సీలను నెలకొల్పారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు/ఒక పీహెచ్సీ, ఒక సీహెచ్‌సీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు ప్రభుత్వ వైద్యులను సమకూర్చారు. అంతేకాకుండా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీలకు అధునాతన సౌకర్యాలతో భవనాలు, ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్యసేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్‌ను నెలకొల్పారు.వైద్యులే ప్రజల వద్దకు..వైద్యం కోసం ప్రజలు వ్యయప్రయాసలు పడాల్సిన పనిలేకుండా నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యులనే ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. విప్లవాత్మక రీతిలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా పీహెచ్సీ వైద్యులను గ్రామాలకు పంపి వైద్యసేవలు అందించారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి ఆరోగ్యాన్ని వాకబు చేసి వ్యాధులను ముందే గుర్తించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుచేశారు. ఇందులో భాగంగా ఊరూవాడా స్పెషలిస్ట్ వైద్యులతో క్యాంపులు నిర్వహించి అనారోగ్య బాధితులకు కొండంత భరోసా కల్పించారు. 16 రకాలు టెస్టులు ఉచితంగా చేశారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చేయి పట్టుకుని ముందుకు నడిపించింది. అంతేకాకుండా గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఇళ్ల వద్దే ఖరీదైన మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో మందులు అందచేశారు. అంత గొప్పగా ఉన్న ఆరోగ్య రంగాన్ని నాశనం చేసిన చంద్రబాబు సర్కారు నిధులను దోచిపెట్టే ప్రాజెక్టులకే జైకొడుతోంది. -
Andhra Pradesh: మా ఆస్పత్రి మారింది
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మౌలిక వసతులకు ఏ కొరతా లేకుండా నాడు–నేడు కింద ఆస్పత్రులు సకల హంగులతో రూపు మార్చుకుంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య రంగం బలోపేతం అయిందని ఏ మారుమూల గ్రామంలోకి వెళ్లి.. ఏ పీహెచ్‌సీని చూసినా ఇట్టే తెలుస్తోంది. ఇది వరకు ఆయా గ్రామాల్లోని ఆస్పత్రులు ఎప్పుడు తెరుచుకునేవో.. ఎప్పుడు వైద్యుడుంటాడో ఎవరికీ తెలిసేది కాదు. వైద్యుడి సంగతి అటుంచితే కనీసం నర్సు కూడా అందుబాటులో లేని దుస్థితి ఇప్పుడు సమూలంగా మారిపోయింది. ఆరోగ్య పరంగా ఏ చిన్న సమస్య వచ్చినా నిమిషాల వ్యవధిలో వైద్యం అందుతోందని గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరుకు చెందిన ఎస్.శిరీషది మధ్యతరగతి కుటుంబం. ఇటీవల ఇంటి వద్ద ఆడుకుంటుండగా శిరీష కుమారుడిని కుక్క కరిచింది. పిల్లవాడికి ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించడానికి వచ్చారు. వైద్య సిబ్బంది వేగంగా వివరాలు నమోదు చేసుకుని టీకా వేశారు. 15 నిమిషాల్లో వైద్య ప్రక్రియ ముగించారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీలో వైద్య సేవలపై ఆమెను ప్రశ్నించగా.. ‘ఈ మధ్యే మా ఆస్పత్రి మారింది. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఆస్పత్రి లోపలంతా అపరిశుభ్ర వాతావరణం ఉండేది. రోగులు కూర్చోడానికి వీలుండదు. తాగునీరు, మరుగుదొడ్లు కూడా ఉండేవి కాదు. సిబ్బంది కొరత ఉండేది. చిన్న చిన్న జబ్బులకు, వైద్య పరీక్షలకు కంకిపాడు ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేసే వారు. అక్కడికి వెళ్లినా లాభం ఉండేది కాదు. దీంతో 20 కిలోమీటర్ల మేర ప్రయాణించి వ్యయ ప్రయాసల కోర్చి విజయవాడకు వెళ్లే వాళ్లం. కుక్క కరిచి ఎవరైనా వస్తే ఇక్కడ టీకాలు ఉండేవి కావు. ఇక్కడి నుంచి కంకిపాడుకు వెళితే.. అక్కడా కొన్ని సార్లు టీకాలు ఉండవు. దీంతో విజయవాడకు వెళ్లక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేశారు. తగినన్ని మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు బయటకు వెళ్లే అవస్థ తప్పింది’ అని శిరీష సంతోషం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు పీహెచ్సీలో గతంలో కేవలం ఒకే ఒక్క నర్సు తప్ప ఎవరూ ఉండే వారు కాదని.. ఒంట్లో బాగోలేదని చూపించుకోవడానికి ఆస్పత్రికి వచ్చిన కె.శ్యామ్ చెప్పాడు. ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రిని బాగా అభివృద్ధి చేసిందన్నాడు. ఇప్పుడు ముగ్గురు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎన్‌వో/ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది ఉన్నారన్నాడు. ‘గతంలో డాక్టర్లు వేళకు వచ్చే వారు కాదు. వచ్చినప్పుడు కొద్దిసేపు ఉండి వెళ్లిపోయేవారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వాళ్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఈ కష్టాలు పడలేక కంకిపాడు, విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడా బాధలన్నీ తప్పాయి’ అని తెలిపాడు. – సాక్షి, అమరావతి అనూహ్య రీతిలో వసతుల కల్పన ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ సహా 12 మంది స్టాఫ్ ప్యాట్రన్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. కృష్ణా జిల్లా ఉప్పులూరు పీహెచ్‌సీనే తీసుకుంటే ఇద్దరు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ అయ్యాయి. అన్ని వసతులు కల్పించారు. దీంతో ఓపీ (ఔట్ పేషెంట్) సంఖ్య పెరిగింది. త్వరలో దీనికి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వాస్) గుర్తింపు రానుంది. యూపీహెచ్‌సీల్లోనూ ఉత్తమ వైద్యం గతంలో 259 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఉండేవి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అదనంగా మరో 301 కేంద్రాలు.. మొత్తంగా 560 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రానికి సొంతంగా భవనం ఉండేలా చర్యలు తీసుకుంటోంది. నాడు–నేడులో భాగంగా కొత్త భవనాలు, మరమ్మతుల కోసం రూ.399.2 కోట్లు ఖర్చు చేస్తోంది. 499 మంది వైద్యులను ఇప్పటికే నియమించారు. ఇతర సిబ్బందిని నియమిస్తున్నారు. ప్రస్తుతం 10 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. పీహెచ్‌సీల తరహాలోనే యూపీహెచ్‌సీల్లోనూ డాక్టర్లు, నర్సులు, సిబ్బంది, మందులు, వైద్య పరీక్షలకు కొరత లేకుండా చర్యలు తీసుకుంది. కాగా, రూ.16,255 కోట్ల భారీ నిధులతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన.. 16 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణం, 5 గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు మరికొన్ని ఆస్పత్రులను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.663 కోట్లతో నాడు–నేడు పీహెచ్‌సీల బలోపేతానికి ప్రస్తుత ప్రభుత్వం నాడు–నేడు కింద రూ.663 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,145 పీహెచ్‌సీలు ఉండగా, 1,125 ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు చేపడుతున్నారు. 977 పీహెచ్‌సీలకు మరమ్మతులు, 148 పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే 580 పీహెచ్సీలలో మరమ్మతులు, వసతుల కల్పన పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోపు మరమ్మతులు, వచ్చే ఏడాది జూన్‌లోపు కొత్త భవనాల నిర్మాణం పూర్తి కానుంది. నాడు–నేడు కింద జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వసతులు కల్పిస్తున్నారు. దీంతో దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు ఎన్‌క్వాస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ – కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటుంది) గుర్తింపు ఉన్న రాష్ట్రంగా ఏపీ సత్తా చాటింది. 320 పీహెచ్‌సీలకు ఈ గుర్తింపుతో ఏపీ తొలి స్థానంలో, 191తో గుజరాత్ రెండో స్థానంలో, 134తో కేరళ మూడో స్థానంలో ఉంది. అందుబాటులో స్పెషలిస్ట్ వైద్యం ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల కోసం స్పెషలిస్ట్ వైద్య సేవలను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9 స్పెషాలిటీల్లో 1,278 మంది వైద్యులను నియమిస్తోంది. వీరు వారంలో ఆరు రోజుల పాటు రోజుకు రెండు పీహెచ్‌సీలకు వెళ్లి స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 276 పోస్టులు భర్తీ అయ్యాయి. ‘నాడు–నేడు’తో మార్పులు ఇలా.. ► ప్రతి ఆస్పత్రిలో సిటిజన్ చార్టర్ విధిగా అమలవుతోంది. దీని ప్రకారం ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు సమయానికి అందుతున్నాయి. ఆస్పత్రిలో వసతులు/గదులకు సంబంధించిన సైన్ బోర్డులు ఏర్పాటయ్యాయి. ► నిబంధనల మేరకు అగ్నిమాపక ధ్రువీకరణ పత్రాలు, కాలుష్య నియంత్రణ మండలి సర్టిఫికెట్లు ఉన్నాయి. రక్త పరీక్షలన్నీ అక్కడే జరిగేలా అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతులతో కూడిన ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయి. ప్రతి 3–4 గంటలకు ఒకసారి పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యవసర మందులు అందుబాటులో ఉండేవి కాదు. ప్రస్తుతం 240 రకాల ఎసెన్షియల్ మందులు పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంటున్నాయి. ► చాలా ఆస్పత్రుల్లో గతంలో ఒకే వైద్యుడు ఉండేవాడు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులను తప్పనిసరి చేసింది. ఇందుకు తగ్గట్టుగా ఇప్పటికే 645 మంది డాక్టర్లు, 1,113 నర్సులు, 403 ల్యాబ్ టెక్నీషియన్లు సహా 2,964 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరో 264 డాక్టర్, 1,269 ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో, ఇతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తోంది. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ► గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పనివేళలు ఉండేవి. ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒకరు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒకరు ఓపీ చూస్తారు. రాత్రి 8 గంటల తర్వాత అత్యవసర సేవల్లో భాగంగా ఫోన్ చేస్తే ఆస్పత్రికి వస్తారు. ► వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు మందుల సరఫరా, వైద్య పరీక్షల శ్యాంపిల్స్ సేకరించి పీహెచ్‌సీలకు తరలించడం కోసం ప్రతి పీహెచ్‌సీకి ఒక స్కూటీని త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. ► మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 176 కొత్త పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్నఓగిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ఈ ఫొటోలో కనిపిస్తున్న గిరిజనుడు మల్లూరి రాముకు 65 ఏళ్లు. విజయనగరం జిల్లా పార్వతీపురం వాసి. రిక్షా నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లాలంటే 150 కిలోమీటర్లు ప్రయాణించాలి. వృద్ధాప్యంలో అంత దూరం ప్రయాణించడం ప్రయాసే. రాము తరహాలో మరెవ్వరూ ఇబ్బంది పడకూడదని రాష్ట్రంలో ఐదు గిరిజన మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం పూనుకుంది. రూ. 246 కోట్లతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని బుట్టాయగూడెం, కర్నూలు జిల్లా శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం జిల్లా దోర్నాలల్లో ఈ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులు, సిబ్బంది కోసం క్వార్టర్స్ కూడా నిర్మిస్తున్నారు. ఇబ్బందులు ఉండవు మా ప్రాంతంలోనే అన్ని వసతులతో ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతుండటం శుభ పరిణామం. తద్వారా రోడ్డు ప్రమాదాలు, ఇతర అనారోగ్య పరిస్థితుల్లో సరైన సమయంలో మెరుగైన వైద్యం అందక సంభవించే మరణాలు తగ్గుతాయి. – కొవ్వాసి నారాయణ, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి జిల్లా వేగంగా పూర్తి చేస్తాం రాష్ట్రంలో ఐదు చోట్ల గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అవార్డ్ చేశాం. వాళ్లు పనులు ప్రారంభించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – మురళీధర్‌రెడ్డి, ఏపీఎంఎస్ఐడీసీ వైస్ చైర్మన్, ఎండీ ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్నదే లక్ష్యం ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వైద్య రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా అడుగులు ముందుకు వేస్తున్నాం. నాడు–నేడు కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అత్యధిక ఎన్‌క్వాస్ గుర్తింపు కలిగిన పీహెచ్‌సీలతో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నాం. దేశానికి ఏపీ రోల్ మోడల్ అవ్వాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. – ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు మా ఊళ్లోనే మంచి వైద్యం నాకు 70 ఏళ్లు. మా గ్రామంలోనే పీహెచ్సీ ఉంది. గతంలో ఇక్కడ సేవలు సరిగా లేనందున ఉయ్యూరులో ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు వెళ్లే వాడిని. డాక్టర్ ఫీజు, మందులు కలిపి రూ.500 అయ్యేది. ఇప్పుడు మా ఊళ్లోనే ప్రభుత్వ ఆస్పత్రి బాగుండటంతో మంచి వైద్య సేవలు అందుతున్నాయి. క్రమం తప్పకుండా ఇక్కడికే వచ్చి, మధుమేహం, ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని మందులు తీసుకువెళ్తున్నాను. వైద్యులు, సిబ్బంది బాగా చూస్తున్నారు. – బి.కోటేశ్వరరావు, చినఓగిరాల, కృష్ణా జిల్లా ఇదివరకు ఆర్ఎంపీ వైద్యమే గతి గతంలో మా ఊరికి సమీపంలోని రాకోడు పీహెచ్సీలో వైద్యుడు అందుబాటులో ఉండేవాడు కాదు. దీంతో పెద్దాస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లలేక ఊర్లోనే ఆర్ఎంపీతో చూపించుకునే వాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇద్దరు వైద్యులను నియమించారు. ఎప్పుడూ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటున్నారు. ఆస్పత్రికి వెళితే ప్రేమగా పలకరిస్తూ వైద్యం చేస్తున్నారు. – పి.అప్పలనాయుడు, పెదవేమలి, విజయనగరం -
పక్కాగా పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీలు, వాటి అనుబంధ బోధనాసుపత్రుల్లో పని చేసే వైద్యులకు శుభవార్త. వారికి ఇక నుంచి నిర్ణీతకాలంలో పదోన్నతులు లభిస్తాయి. గతేడాదే ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినా సాంకేతిక కారణాలతో అది అమలుకాలేదు. ఆ తర్వాత వరుసగా ఎన్నికలు రావడంతో ఇప్పటివరకు ఆ ఉత్తర్వులు సవరణకు నోచుకోలేదు. సవరణలు కోరుతూ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అందుకు సంబంధించిన ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి నరహరి ‘సాక్షి’కి తెలిపారు. 2016 యూజీసీ వేతన సవరణను అనుసరించి ఉత్తర్వులు వెలువడతాయని ఆయన ప్రకటించారు. తాజా నిర్ణయం ప్రకారం.. బోధనాసుపత్రుల్లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ల సర్వీసు నాలుగేళ్లు నిండితే యథావిధిగా వారికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఆరేళ్లు సర్వీసు నిండితే యథావిధిగా వారికి ప్రొఫెసర్‌గా పదోన్నతి లభిస్తుంది. మరోవైపు అసోసియేట్ ప్రొఫెసర్లకు మూడేళ్లు నిండాక స్కేల్లో మార్పు తీసుకొస్తారు. అంటే వారికి మధ్యలో ఒక ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. పదోన్నతుల కోసం ఎదురుచూపు... ప్రస్తుతం పదోన్నతులు అత్యంత అశాస్త్రీయంగా ఉన్నాయన్న విమర్శ ఉంది. ఎవరైనా రిటైరయ్యాకే అంటే ఖాళీలు ఏర్పడ్డాకే పదోన్నతులు లభిస్తున్నాయి. ఖాళీలు కొన్నే ఉంటే కొందరికే పదోన్నతులు లభిస్తున్నాయి. దీంతో పదోన్నతుల కోసం ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అందుకోసం ఫైరవీలు జరిగి లక్షలకు లక్షలు సమర్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వైద్యులు ఆవేదన చేస్తున్నారు. ఒక్కోసారి పదేళ్లకు, పదిహేనేళ్లకు పదోన్నతులు వచ్చినవారూ ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చాలని వైద్యులు ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నిర్ణీతకాల పదోన్నతులను అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 3 వేల మంది వైద్యులకు ప్రయోజనం కలుగనుంది. అంతేకాదు వారికి పదోన్నతి వచ్చిన ప్రతీసారి కూడా స్కేల్స్‌ల్లోనూ మార్పులుంటాయి. ప్రొఫెసర్‌గా ఉన్న వారికి తదుపరి పదోన్నతి లేకపోయినా మధ్యమధ్యలో స్కేల్స్‌లో నిర్ణీత సమయం ప్రకారం మార్పులు జరుగుతుంటాయి. ఇక వైద్యులకు ఖాళీలు లేకపోయినా నిర్ణీత కాలంలో పదోన్నతులు ఇవ్వడంతో ఒక్కోసారి వారి హోదా మారుతుందే కానీ పనిలో మార్పు ఉండదు. ఖాళీలు ఏర్పడ్డాకే వారు ఇతర పోస్టులకు మారుతారు. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఖాళీలు లేకపోయినా నాలుగేళ్లకు అసోసియేట్‌గా పదోన్నతి లభిస్తే, అతను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానే విధులు నిర్వహిస్తారు. అక్కడ ఖాళీ ఏర్పడితేనే అతని విధులు మారుతాయి. ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినందున త్వరలోనే సవరణ ఉత్తర్వులు వెలువడతాయన్న ఆశాభావాన్ని డాక్టర్ నరహరి వ్యక్తం చేశారు. -
పాపం... జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్య రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్న జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్టైపెండ్ పెంచకపోవడంతో రోజువారీ జీవనం కష్టమవుతోంది. అరకొర స్టైపెండ్ డబ్బులతో వీరు ఇబ్బందులు పడుతున్నారు. చేసే పనికి, ప్రభుత్వం ఇచ్చే స్టైపెండ్‌కు పొంతన ఉండటం లేదు. జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల నుంచి ఎక్కువ సేవలు పొందుతున్న ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల కంటే తక్కువ స్టైపెండ్ ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ స్టైపెండ్‌ను పెంచాలని జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి స్టైపెండ్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అయినా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్టైపెండ్ తక్కువ.. జాప్యం ఎక్కువ.. వైద్య విద్యలో ఎంబీబీఎస్ కోర్సు తర్వాత మరో ఏడాది సదరు విద్యార్థులు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో సేవలు అందిస్తారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ పీజీ వారు సైతం ఇలాగే సేవలు అందిస్తారు. ఇలా హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లుగా పేర్కొనే వీరి సేవలను వినియోగించుకుంటున్నందుకు ప్రభుత్వం నెలవారీగా స్టైపెండ్ ఇస్తుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో ఈ స్టైపెండ్ చాలా తక్కువగా ఉంటోంది. దీని చెల్లింపులోనూ జాప్యం జరుగుతోంది. తెలంగాణలోనూ స్టైపెండ్‌ను ఒకసారి పెంచారు. 2016 నుంచి కొత్త స్టైపెండ్ అమల్లోకి వచ్చింది. 2018 జనవరి నుంచి పెంచిన స్టైపెండ్ అందించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. ప్రతి రెండేళ్లకోసారి 15 శాతం చొప్పున పెంచాలని నిర్ణయించారు. దీనిని 40 శాతానికి పెంచాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారు. కర్ణాటక, కేరళలో అధికం.. జూనియర్ డాక్టర్లకు ఇచ్చే స్టైపెండ్ కర్ణాటక, కేరళలో ఎక్కువగా ఉంది. సూపర్ స్పెషాలిటీ మూడో సంవత్సరం వారికి కేరళలో రూ.50 వేలు, కర్ణాటకలో రూ.54 వేలు ఉంది. హౌస్ సర్జన్లకు కేరళలో రూ.20 వేలు ఉంది. తెలంగాణలోనే తక్కువ స్టైపెండ్ ఉండటంతో జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల జీవనం ఇబ్బందిగా ఉంటోంది. కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసేందుకు కొందరు మొగ్గుచూపుతున్నారు. ఇది ప్రభుత్వ ఆస్పత్రులలోని వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. -
మెట్టు దిగని ప్రభుత్వం..పట్టువీడని జూనియర్ డాక్టర్లు
-
వైద్య రంగం ప్రైవేటీకరణకు కుట్ర:విమలక్క
భోలక్‌పూర్: ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అరుణోదయ సంస్థ కన్వీనర్ విమలక్క విమర్శించారు. గత 38 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలకు విమలక్క సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత నియామకాలను చేపట్టాలని, జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు క్రాంతి చైతన్య, నాయకులు నాగార్జున, అనిల్ తదితరులు పాల్గొన్నారు.