
కర్నూలులో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసన హోరు
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అధికారులకు డిమాండ్ పత్రాలు
భారీగా తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు
జోరువానలోనూ మిన్నంటిన ఆందోళన
పలు చోట్ల అడ్డుకున్న పోలీసులు
సాక్షి, అమరావతి : నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొనడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణ చేపట్టిన పార్టీ శ్రేణులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు, ధర్నాలతో హోరెత్తించాయి. సర్కారు తీరును నిరసిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అన్నిచోట్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నకిలీ మద్యం.. ప్రభుత్వ పతనం తథ్యం అంటూ రాష్ట్రవ్యాప్తంగా నినదించారు. నందిగామలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావును అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకునే యత్నం చేయగా, వారు ఎక్కడా వెనక్కు తగ్గలేదు.

నకిలీ మద్యం గుట్టు తేల్చేందుకు వెంటనే రాష్ట్రంలో వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేపట్టి పెద్ద తలకాయలను అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐతో దర్యాప్తు జరపడంతోపాటు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొంది.
వైన్‌షాప్‌ల కేటాయింపులో అక్రమాలు గుర్తించి అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మద్యం విక్రయ వేళలు తగ్గించాలని.. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో నెలకొల్పిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు రద్దు చేసేలా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నేతలు నినదించారు.

నారావారి ‘సారా పాలన’.. నశించాలి
బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కుపై చేపట్టిన ఆందోళనలకు భారీ స్పందన లభించింది. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని నకిలీ మద్యంపై అనంతపురంలో నిర్వహించిన రణభేరిలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టుబట్టాయి. నకిలీ మద్యంపై కర్నూలులో పెద్ద ఎత్తున పోరుబాట నిర్వహించారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయకుండా ఆందోళనలు కొనసాగించారు. సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నారావారి సారాపాలన.. నశించాలి, నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి సర్కారు, ఎన్ బ్రాండ్ నకిలీ మద్యంతో జనం బలి, నకిలీ మద్యం మరణాలు.. పవన్‌కు కనపడవా? బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు.. అంటూ ప్లకార్డులతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు నిరసనల్లో పాల్గొని నినదించారు.

విచ్చలవిడిగా బెల్ట్ షాపులకు పచ్చజెండా ఊపి నకిలీ మద్యంతో కూటమి సర్కారు ప్రాణాలు హరిస్తోందని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామంలో బెల్ట్‌షాపు రూ.9 లక్షలు పలికిందంటే కూటమి సర్కారు పాలనలో ఎలా ఏరులై పారుతోందో ఊహించవచ్చని ప్రజాసంఘాలు, మహిళలు మండిపడ్డాయి.