
సాలూరులో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లు
విధుల్లోకి చేరిన రెగ్యులర్ ఉపాధ్యాయులు
వీరి రాకతో రోడ్డునపడ్డ 1,143 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు
ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందంటూ మండిపాటు
మంత్రి సంధ్యారాణి ధోరణిపై ఆగ్రహం
పోరుబాటకు బాధితుల సమాయత్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 191 గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా దగా చేసింది. వీరి స్థానాల్లో సోమవారం డీఎస్సీ ద్వారా ఎంపికైన రెగ్యులర్ టీచర్లను విధుల్లోకి తీసుకుంది. దీంతో మొత్తం 1,143 మంది అవుట్ సోర్సింగ్ టీచర్లు రోడ్డునపడ్డారు. తమ పరిస్థితి ఏమిటంటూ వీరు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి మొరపెట్టుకున్నారు.
మీ పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లను నియమించామని, మిమ్మల్ని ఏమి తీసేయ్యలేదు కదా? అని మంత్రి బదులిచ్చారు. అయితే, ‘మీరేమో ఇలా చెబుతున్నారు.. గురుకులాల్లోని ప్రిన్సిపాల్స్, అధికారులు మాత్రం శాంక్షన్ పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లు చేరారని, అవుట్ సోర్సింగ్ టీచర్లు కొనసాగించలేమని పంపేశారు’.. అని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచి్చన హామీని మంత్రికి గుర్తుచేశారు. మంత్రి అసహనానికి గురై వారిని బయటకు పంపించేశారు. దీంతో బాధిత టీచర్లు అక్కడే రోడ్డుపై కొద్దిసేపు నిరసన వ్యక్తంచేశారు.
పోరుబాటకు సమాయత్తం..
మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వం తమను నమ్మించి గొంతు కోసిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఈ అవుట్ సోర్సింగ్ టీచర్లు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈనెల 15న విజయవాడలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్ తెలిపారు.
ఎస్టీ కమిషన్ సిఫార్సులు గాలికి..
గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్లను కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ ఇటీవల చేసిన సిఫార్సులను సైతం కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన హామీ అమలుచేయకుండా ఆ పోస్టులను డీఎస్సీలో చూపడంతో గతేడాది నవంబరులో వీరు రోడ్డెక్కారు.
మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింపజేశారు. అయితే, ఇవేవీ అమలుచేయకపోవడంతో బాధితులు జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. వారిని తొలగించవద్దని, ఉద్యోగ భద్రత కల్పించాలని చేసిన సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు.