
చంద్రబాబు, లోకేశ్‌లకు మాజీమంత్రి జోగి రమేష్ సవాల్
నకిలీ మద్యం కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అన్నీ బాబే
నిందితుడు జనార్దన్‌తో తప్పుడు వీడియో రిలీజ్ చేయించి నన్ను జైలుకు పంపే కుట్ర
మీ దుర్మార్గాలను ఎండగడుతున్నామని దిగజారుడు రాజకీయాలు
గతంలో ప్రశ్నించేందుకు వెళ్లానని చంద్రబాబు కక్ష సాధింపు
మీ తప్పుడు కేసులకు బెదిరేదే లేదు.. ప్రజలంతా గమనిస్తున్నారు
ఇబ్రహీంపట్నం: నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తనపై వచ్చిన ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని.. మరి చంద్రబాబు, లోకేశ్‌లు కూడా సిద్ధమా.. అని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దన్‌రావుతో తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబేనని స్పష్టం చేశారు. ‘వారం రోజులుగా నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సిట్ విచారణకు ఆదేశించారు. బాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. అనేలా సాగేది విచారణ కాదు. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలు కావడంతో దిక్కుతోచక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపారు. ఇందులో భాగంగానే నా పేరు తీసుకొచ్చారు. ఈ కేసులో నా పాత్ర ఉంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమే’ అని తెలిపారు. ఈ సందర్భంగా జోగి రమేష్ ఇంకా ఏమన్నారంటే..
రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు
‘నకిలీ లిక్కర్ కేసులో నా ప్రమేయం లేదని నేను దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. నేను నా భార్యా బిడ్డలతో వస్తాను. చంద్రబాబు, లోకేశ్‌లకు దమ్ముంటే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా? పోనీ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేస్తారా? ఈ ఛాలెంజ్‌కు మీరు సిద్ధమా? కల్తీ మద్యం కేసుతో నాకు ఏ రకమైన సంబంధం లేదు. నారా వారి సారాను రాష్ట్రంలో ఏరులై పారిస్తున్నారు. ప్రతి మద్యం షాపులో, బెల్టు షాపుల్లో.. చివరకు ఇంటింటికీ రేషన్ పంపిణీలా నకిలీ మద్యాన్ని పంపిస్తున్నారు.
ఇదంతా బయట పడటంతో డైవర్షన్ కోసం జనార్దన్‌తో వీడియో విడుదల చేయించారు. వాస్తవానికి రిమాండ్ రిపోర్టులో నా పేరు ఎక్కడా లేదు. అయినా పోలీసు కస్టడీలో ఉన్న అతనితో నా పేరు చెప్పించడం ద్వారా అత్యంత దిగజారుడు రాజకీయాలకు దిగారు. మీ దుర్మార్గాలను ఎండగడుతున్నానన్న అక్కసుతో ఈ కేసులో నన్ను అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు దుష్ట ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోంది.
గతంలో చంద్రబాబు ఇంటి దగ్గరకు నేను ప్రశ్నించడానికి బయలుదేరానని, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ నన్ను ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు. నెలో రెండు నెలలో నన్ను జైలులో పెట్టి మీ క్షణికానందం తీర్చుకున్నంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. లోకేశ్.. ఎల్లకాలం అధికారంలో ఉంటామని భ్రమల్లో ఉండొద్దు. మీరు సీటు ఇచ్చి తంబళ్లపల్లెలో పోటీకి నిలబెట్టిన జయచంద్రారెడ్డే కల్తీ మద్యానికి ఆద్యుడు.
తప్పుడు కేసులకు భయపడేది లేదు
ఒక తప్పుడు వీడియోను సృష్టించి, నన్ను జైల్లో పెట్టడం ద్వారా మీ రాక్షసానందం తీరవచ్చు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. దమ్ముంటే ధైర్యంగా నేరుగా ఎదుర్కోండి. మీరు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు.. భయపడేదీ లేదు. మీ దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటాం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అత్యంత చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మీ రెడ్ బుక్‌కు ఫైర్ పుట్టించడం ఖాయం. దమ్ముంటే నా సవాలుకు స్పందించండి.
కల్తీ లిక్కర్ స్కామ్‌లో అక్రమ మద్యం నిల్వలను స్వయంగా నేను మీడియాకు.. ‘ఇదే నారా వారి సారా’ అని చూపిస్తే, ఈ కేసులో నిందితుడైన జనార్దన్‌ను అడ్డుపెట్టుకుని నా పేరు మీద వీడియో విడుదల చేయించారు. జనార్దన్‌తో నాకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఇది కేవలం చంద్రబాబు సృష్టించిన కట్టు కథ మాత్రమే. ప్రజలంతా గమనిస్తున్నారు’ అని స్పష్టం చేశారు.