
ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడటంతో 300కు ఒక్క పరుగు తక్కువ వద్ద ఆలౌటైంది.
ఐదో స్థానంలో వచ్చిన రాఘ్వి బిస్త్ (93) సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ.. భారత్‌ను సేఫ్ జోన్‌లోకి తెచ్చింది. తొమ్మిదో స్థానంలో వచ్చిన వీజే జోషిత (51) అనూహ్యంగా అర్ద సెంచరీతో సత్తా చాటింది.
ఏడో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ రాధా యాదవ్ (33), ఎనిమిదో స్థానంలో వచ్చిన మిన్నూ మణి (28), పదో స్థానంలో వచ్చిన టైటస్ సాధు (23) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. ఓపెనర్ షఫాలీ వర్మ 35 పరుగులతో రాణించింది.
ఆసీస్ బౌలర్లలో మైట్లాన్ బ్రౌన్, ప్రెస్ట్‌విడ్జ్ తలో 3 వికెట్లు తీయగా.. సియన్నా జింజర్, లిల్లీ మిల్స్, యామీ ఎడ్గర్, ఎల్లా హేవర్డ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సగం వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సైమా ఠాకోర్, రాధా యాదవ్ తలో 2 వికెట్లు తీసి ఆసీస్‌ను ఇబ్బంది పెట్టారు. టైటస్ సాధు కూడా ఓ వికెట్ తీసింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో రేచల్ ట్రెనామన్ 21, తహిల విల్సన్ 49, మ్యాడీ డార్కే 12, అనిక లియారాయ్డ్ 15, ఎల్లా హేవర్డ్ 0 పరుగులకు ఔట్ కాగా.. నికోల్ ఫాల్తుమ్ (30), సియన్నా జింజర్ (24) క్రీజ్‌లో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 141 పరుగులు వెనుకపడి ఉంది.
ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 23.2 ఓవర్లు మాత్రమే సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 93 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, కష్టాల్లో ఉండింది. అయితే రాఘ్వి, జోషిత్ అద్బుతంగా పోరాడి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
కాగా, మూడు టీ20లు, మూడు వన్డేలు, ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత ఏ మహిళల జట్టు.. టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యి, వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.