
నవ్వుతూ, నవ్విస్తూ, ఆలోచింపజేసిన దయామయ జడ్జి ఫ్రాంక్ కాప్రియో
ప్రోవిడెన్స్(అమెరికా): కోర్టుహాల్ అనగానే ఎంతటి సీనియర్ న్యాయవాదికి అయినా జడ్జి అంటే ఒకింత భయం, అమిత గౌరవం. ఏ మాట తూలితే ఎక్కడ కోర్టు ధిక్కారం ఉత్తర్వులు, శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందోన్న భయం. ఇక నిందితుల సంగతి చెప్పనక్కర్లేదు. వంగి వంగి దణ్ణాలు పెడుతూ మమ్మల్ని క్షమించండి జడ్జి గారూ అనే సన్నివేశాలూ ఇప్పటికీ కొన్ని జిల్లా కోర్టుల్లో కని్పస్తాయి. ఆ ఘటనలకూ పూర్తి అతీతంగా అమెరికాలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో, ఎంతో సరదాగా, మరెంతో హాస్యం జోడించి తీర్పులు చెప్పే న్యాయమూర్తిగా పేరుతెచ్చుకున్న కురువృద్ధుడు, జడ్జి ఫ్రాంక్ కాప్రియో తుదిశ్వాస విడిచారు. తనదైన వాక్‌చాతుర్యం, అపార న్యాయశాస్త్ర అనుభవంతో న్యాయకోవిదుడిగా, ప్రజారంజక తీర్పులకు చిరునామాగా మారిన జడ్జి ఫ్రాంక్ 88 ఏళ్ల వయసులో బుధవారం పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారని ఆయన అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో ఒక ప్రకటన ద్వారా స్పష్టమైంది.
100 కోట్ల వీక్షణలు
అమెరికాలోని రోడ్‌ఐలాండ్ రాష్ట్రంలోని ప్రోవిడెన్స్ సిటీలో చీఫ్ మున్సిపల్ జడ్జిగా చాన్నాళ్లు పనిచేసి రిటైర్ అయినఫ్రాంక్ ఆ తర్వాత అచ్చం కోర్టుహాల్ సెటప్‌లో పలు కేసుల వాదోపవాదనల ఎపిసోడ్‌లు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన చేసిన వీడియోలు యూట్యూబ్‌లో ఏకంగా 100 కోట్ల వీక్షణలు దాటాయంటే ఆయన ఎంత హృద్యంగా, సుతిమెత్తగా, సూటిగా తీర్పులు చెప్తారో అర్థంచేసుకోవచ్చు. శిక్షను ఎదుర్కొంటున్న నిందితులతోపాటు నిందితుల కుటుంబసభ్యులతోనూ నేరుగా సహానుభూతితో మాట్లాడి కేసుకు సరైన న్యాయం చేస్తూ తీర్పు చెప్పే విధానం కోట్లాది మందిని మెప్పించింది. చిన్నచిన్న తప్పులు చేసి నిందితులుగా ముద్రపడిన వ్యక్తులను సున్నితంగా, నవ్వుతూ మందలిస్తూ కేసులు కొట్టేసిన సందర్భాలు కోకొల్లలు.
ఈయన చీఫ్ మున్సిపల్‌జడ్జిగా 1985 నుంచి రిటైర్ అయ్యేదాకా అంటే 2023ఏడాదిదాకా ఏకంగా 40 ఏళ్లపాట సేవలందించారు. చిన్నపాటి తప్పిదాలు చేసిన మీ తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధించాలో నువ్వే చెప్పు అంటూ వాళ్ల చిన్నారులకే ధర్మాసనం వద్దకు పిలిపించి వారితోనే తీర్పులు చదివించిన సందర్భాలూ ఉన్నాయి. ఎంతో దయతో తీర్పులు చెప్పే జడ్జిగా ఆయన పేరు మార్మోగిపోయింది. 2018 నుంచి 2020 ఏడాదిదాకా ‘కాట్ ఇన్ ప్రోవిడెన్స్’ పేరుతో ఆయన కోర్టు సీన్లతో టీవీ సిరీస్ చేశారు. ఆ సిరీస్‌ల ఆన్‌లైన్ వీక్షణలు కోట్లు దాటేశాయి. పారదర్శకత, దయతో తీర్పులు ఇవ్వాలని జడ్జి ఎప్పుడూ చెబుతుండేవారు.