పెట్టుబడులతో రండి!  | Need to tap full potential of trade and investment ties | Sakshi
Sakshi News home page

పెట్టుబడులతో రండి! 

Aug 22 2025 5:23 AM | Updated on Aug 22 2025 5:38 AM

Need to tap full potential of trade and investment ties

భారత్‌తో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి  

రష్యా పారిశ్రామికవేత్తలకు విదేశాంగ మంత్రి జైశంకర్‌ పిలుపు  

రష్యా ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్‌ మంతురోవ్‌తో భేటీ  

మాస్కో: సంక్లిష్టమైన భౌగోళిక సవాళ్లు ఎదుర్కోవడానికి భారత్‌–రష్యా కలిసికట్టుగా పనిచేయాలని, ఇందుకోసం సృజనాత్మక, నూతన మార్గాలు అన్వేషించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ పిలుపునిచ్చారు. రెండు దేశాలు పరస్పర సహకార ఎజెండాను మరింత విస్తృతపర్చుకోవాలని, వైవిధ్య భరితంగా మార్చుకోవాలని చెప్పారు. మరిన్ని ఉమ్మడి కార్యక్రమాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యంలో వైవిధ్యం కృషి చేయాలని అన్నారు.

 భారత్‌–రష్యా సంబంధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం, విభిన్నమైన వాణిజ్య సంబంధాలు నెలకొల్పడం మనం ఆశయం కావాలని స్పష్టం చేశారు. జైశంకర్‌ బుధవారం మాస్కోలో రష్యా ఫస్ట్‌ డిప్యూటీ ప్రైమ్‌మినిస్టర్‌ డెనిస్‌ మంతురోవ్‌తో సమావేశమయ్యారు. భారత్‌–రష్యా సంబంధాలు, తాజా పరిణామలపై చర్చించారు. 

ఇండియా–రష్యా ఇంటర్‌–గవర్నమెంటల్‌ కమిషన్‌ ఫర్‌ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్, టెక్నాలాజికల్, కల్చరల్‌ కో–ఆపరేషన్‌(ఐఆర్‌ఐజీసీ–టీఈసీ) ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా ఈ చర్చలు జరిగాయి. భారత్‌పై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్‌–రష్యా సంబంధాల ఆవశ్యకతను జైశంకర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా ఇరుదేశాల నడుమ ఆర్థిక బంధం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పనిచేద్దాం 
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని రష్యా పారిశ్రామికవేత్తలకు జైశంకర్‌ విజ్ఞప్తి చేశారు. వ్యాపార అభివృద్ధికి భారత్‌లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, వీటిని ఉపయోగించుకోవాలని చెప్పారు. నూతన రంగాల్లోనూ స్నేహ సంబంధాలను విస్తరింపజేసుకోవాలని సూచించారు. వ్యాపార, పెట్టుబడుల సంబంధాల్లో పూర్తి సామర్థ్యం మేరకు కలిసి పని చేద్దామని కోరారు. 

ఇందుకోసం కొన్ని లక్ష్యాలు, గడువులు నిర్దేశించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమున్నత లక్ష్య సాధన కోసం మనకు మనమే సవాలు విసురుకోవాలని వ్యాఖ్యానించారు. చేతులు కలిపి ఉమ్మడిగా పనిచేస్తే నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి సాధించవచ్చని స్పష్టంచేశారు. 

ఐఆర్‌ఐజీసీకి సంబంధించిన వేర్వేరు వర్కింగ్‌ గ్రూప్‌లు, బిజినెస్‌ ఫోరమ్‌ మధ్య సహకారం కోసం ఒక యంత్రాంగం ఏర్పాటు చేసుకుందామని ప్రతిపాదించారు. ఒకరి ఆలోచనలను మరొకరితో పంచుకోవాలన్నారు. ఇండియా, రష్యాలోని వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఐఆర్‌ఐజీసీ తోడ్పడుతుందని తెలిపారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కారి్మకులను రష్యాకు పంపించబోతున్నట్లు జైశంకర్‌ చెప్పారు.  

సెర్గీ లావ్‌రోవ్‌తో సమావేశం  
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల, స్థిరమైన విధానంలో విస్తరింపజేసుకోవాలని భారత్, రష్యా నిర్ణయించుకున్నాయి. వాణిజ్యం విషయంలో నియంత్రణలు, అవరోధాలను వేగంగా పరిష్కరించుకోవాలని జైశంకర్‌ చెప్పారు. ఆయన రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌తో భేటీ అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో స్థిరంగా కొనసాగుతున్న అతిపెద్ద సంబంధాల్లో భారత్‌–రష్యా సంబంధాలు కూడా ఉన్నాయని తెలిపారు. వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవాలని జైశంకర్, లావ్‌రోవ్‌ నిర్ణయానికొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement