
న్యూయార్క్: భారత్‌పై అమెరికా సర్కార్ 50 శాతం టారిఫ్ భారం మోపడంతో ఇరుదేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రులు న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. లొట్టె న్యూయార్క్ ప్యాలెస్‌లో సోమవారం ఉదయం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలు సమావేశమయ్యారు. భారత్‌పై అమెరికా 50శాతం టారిఫ్ విధించాక ఇరునేతలు కలవడం ఇదే తొలిసారి. ‘‘ద్వైపాక్షిక అంశాలుసహా మారుతున్న అంతర్జాతీయ పరిణా మాలపై విస్తృతస్థాయిలో చర్చించుకున్నాం.
కీలక అంశాల్లో పురోగతి కోసం నిరంతరం సంప్రతింపులు ముఖ్యమని ఇద్దరం భావించాం’’అని భేటీ తర్వాత జైశంకర్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ఇదే నగరంలో అమెరికా వాణిజ్యమంత్రితో భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూశ్ గోయెల్ బృందం భేటీకానుంది. పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం ఖరారు కోసం ఈ సమావేశం జరగనుంది. అమెరికా పత్తి, డెయిరీ, తదితర వ్యవసాయ ఉత్పత్తులను భారతీయ మార్కెట్లోకి తేవాలని ట్రంప్ యత్నిస్తుండగా అవి వస్తే భారతీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని భారత్ వాదిస్తోంది. దీంతో ఏకాభిప్రాయం కుదరక ఇంకా ఈ ఒప్పందం ఖరారుకాలేదు.