
మన భాగస్వామ్యం మరింత బలపడాలి
అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్గియో గోర్ ఆకాంక్ష
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ
న్యూఢిల్లీ: భారత్‌తో సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని సెర్గియో గోర్ చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. భారత్‌లో అమెరికా రాయబారిగా నిమితుడైన సెర్గియో గోర్ శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా సంతకం చేసిన చిత్రపటాన్ని మోదీకి బహూకరించారు.
రక్షణ, వ్యాపారం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారంపై మోదీ, సెర్గియో చర్చించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం సెర్గియో శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. తొలుత భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోపాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మోదీని కలుసుకున్నారు. సెర్గియోతో మా ట్లాడడం సంతోషంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
అమెరికా రాయబారిగా ఆయన నేతృత్వంలో భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రధాని నరేంద్ర మో దీ గొప్ప నాయకుడు, మంచి మిత్రుడు అంటూ డొ నాల్డ్ ట్రంప్ తరచుగా ప్రశంసిస్తుంటారని సెర్గియో గోర్ గుర్తుచేశారు. మోదీతో కీలక అంశాలపై చర్చించానని తెలిపారు. వరుస భేటీల అనంతరం ఆయన మీడియా మాట్లాడారు. రక్షణ, వాణిజ్యం, టెక్నాలజీ, ఖనిజాలు సహా ద్వైపాక్షిక వ్యవహారాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో భారత్–అమెరికాలు మరింత సన్నిహితంగా మారడం ఖాయమని అన్నారు. ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అని ఉద్ఘాటించారు.