
ఈ వారంలో అగ్ర రాజ్యానికి వాణిజ్య బృందం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొలి దశ సాకారానికి వీలుగా అమెరికా, భారత్ మధ్య ఈ వారంలో మరో విడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత వాణిజ్య బృందం అమెరికాకు వెళ్లనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్ నాటికి తొలి దశ ఒప్పందం కుదుర్చుకోవాలన్నది ప్రణాళిక కాగా, ఇప్పటి వరకు ఐదు విడతలుగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగాయి. అనుకున్న సమయానికి తొలి దశ బీటీఏపై చర్చలను ముగించేందుకు రెండు దేశాలు సానుకూల దృక్పథంతో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన అధికారుల బృందం గత నెలలో న్యూయార్క్‌లో చర్చలు నిర్వహించడం తెలిసిందే. వీలైనంత త్వరలో పరస్పర ఆమోదయోగ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలను కొనసాగించాలని నిర్ణయించడం గమనార్హం. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, యూఎస్ రాయబారి సెర్గియో గోర్‌తో మంత్రి గోయల్ చర్చలు నిర్వహించారు. 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ప్రధాని మోదీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగీకారానికి రావడం తెలిసిందే.
కీలక అంశాలపై చర్చలు
కీలక ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు, నియంత్రణపరమైన సహకారం, ఇందనం, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంపుపై ఈ విడతలో చర్చలు ఉంటాయని తెలుస్తోంది. అమెరికా నుంచి మరింతగా సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన వనరుల సాంకేతికతలను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఆసక్తి చూపిస్తోంది. ఇంధన సహకారం కీలక అంశంగా ఉందని, అమెరికా నుంచి దీర్ఘకాలానికి ఎల్‌ఎన్‌జీ దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.