విత్‌డ్రా నిబంధనలు మరింత సులభతరం
పాక్షిక ఉపసంహరణల పరిమితులు పెంపు
మూడు కేటగిరీలుగా విభజన
సెంట్రల్ బోర్డు కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు ఇకపై తమ ముఖ్యమైన అవసరాల కోసం భవిష్యనిధి నుంచి నూరు శాతం (తన వాటా, యాజమాన్యం వాటాలు) ఉపసంహరించుకోవచ్చు. కేంద్ర కారి్మక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన భేటీ అయిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సభ్యుల జీవనాన్ని సులభతరం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్షిక ఉపసంహరణల పరిమితులను సైతం పెంచింది. 13 క్లిష్టమైన నిబంధనలన్నింటినీ కలిపేసి ఒక్కటిగా మార్చింది. నిత్యావసరాలు (అనారోగ్యం, విద్య, వివాహ అవసరాలను), గృహావసరాలు, ప్రత్యేక అవసరాలు పేరుతో ఉపసంహరణలను మూడు కేటగిరీలుగా వర్గీకరించింది.
విద్యావసరాల కోసం 10 పర్యాయాలు భవిష్యనిధిని వెనక్కి తీసుకోవచ్చు. వివాహం కోసం 5 పాక్షిక ఉపసంహరణలకు ఇకపై అనుమతి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ రెండింటి కోసం మూడు పర్యాయాలు మాత్రమే అనుమతించేవారు.
ఇకపై పాక్షిక ఉపసంహరణలకు 12 నెలల కనీస సర్వీస్ (పదవీకాలం) ఉంటే సరిపోతుంది.
ప్రత్యేక సందర్భాల్లో భవిష్యనిధి ఉపసంహరణకు గాను.. ప్రకృతి విపత్తు, సంస్థల మూసివేత/ఉద్యోగుల తొలగింపు, ఉపాధి లేకుండా ఉండడం, అంటువ్యాధి తదితర వాటిల్లో ఒక కారణాన్ని పేర్కొనాల్సి వచ్చేది. దీంతో ఉపసంహరణ దరఖాస్తులు కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురయ్యేవి. ఇకపై ప్రత్యేక అవసరాల కోసం చేసే పాక్షిక ఉపసంహరణకు కారణాన్ని వెల్లడించనక్కర్లేదు.
సభ్యులు తమ చందా మొత్తంలో 25% కనీస బ్యాలన్స్‌గా అన్ని సమయాల్లోనూ కొనసాగించాల్సి ఉంటుంది. తద్వారా అధిక వడ్డీ రేటు ప్రయోజనం, కాంపౌండింగ్ ప్రయోజనాలను పొందే వీలుంటుంది. ఒకవైపు తాత్కాలిక అవసరాలకు నిధుల సాయం పొందుతూ.. మరోవైపు రిటైర్మెంట్ సమయానికి కొంత నిధిని సమకూర్చుకునేందుకు వీలుగా దీన్ని ప్రవేశపెట్టారు. మిగిలిన వాటా నుంచి 100% తీసేసుకోవచ్చు.
ఈపీఎఫ్‌వో తుది సెటిల్‌మెంట్‌ను ప్రస్తుతం రెండు నెలల ముందుగా పొందడానికి అవకాశం ఉండగా, దీన్ని 12 నెలలకు పెంచారు. తుది పింఛను ఉపసంహరణ గడువును సైతం 2 నెలల నుంచి 36 నెలలకు పొడిగించారు.
ఈపీఎస్ 95 పింఛనుదారులు తమ ఇంటి నుంచే డిజిటల్ లైఫ్ సరి్టఫికెట్‌ను సమర్పించేందుకు వీలుగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో అవగాహన ఒప్పందానికి ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు పెన్షనర్లు ఒక్కొక్కరు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
జరిమానాలను క్రమబద్దీకరించడం ద్వారా వివాదాలను తగ్గించేందుకు ‘విశ్వాస్ స్కీమ్’ను ఈపీఎఫ్‌వో తీసుకొచి్చంది. పీఎఫ్ చందాలను సంస్థలు ఆలస్యంగా జమ చేయడం జరిమానాలకు ప్రధాన కారణమని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. 2025 మే నాటికి ఇలాంటి జరిమానాలు, నష్ట పరిహారం మొత్తం రూ.2,406 కోట్లుగా ఉంది. విశ్వాస్ స్కీమ్ కింద జరిమానా మొత్తాన్ని ఫ్లాట్ 1%కి తగ్గించారు.
కాగా, ఈపీఎఫ్‌వో డెట్ పెట్టుబడుల నిర్వహణకు నాలుగు ఫండ్ మేనేజర్ల (హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆదిత్య బిర్లా ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్) ఎంపికకు సైతం సెంట్రల్ బోర్డు ఆమోదముద్ర వేసింది.
ఇదీ చదవండి: బంగారం, వెండి కొనాల్సింది అప్పుడే: కమొడిటీ గురు జిమ్ రోజర్స్


