
బంగారం, వెండి కొనే విషయంలో భారతీయ మహిళలను చూసి నేర్చుకోవాలంటున్నారు ప్రముఖ కమోడిటీ ఇన్వెస్టర్ జిమ్ రోజర్స్. పెట్టుబడి పాఠాలకు సంబంధించి ఆయన రాసిన పుస్తకం ‘స్ట్రీట్ స్మార్ట్స్: అడ్వెంచర్స్ ఆన్ ది రోడ్ అండ్ ఇన్ ది మార్కెట్స్’ (Street Smarts: Adventures on the Road and in the Markets) చాలా ప్రసిద్ధి చెందింది.
ఇటీవల జిమ్ రోజర్స్ (Jim Rogers) బిజినెస్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బంగారం, వెండిని కలిగి ఉన్నానని, కానీ వాటిని అమ్మే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ధరల వద్ద కొత్తగా కొనుగోలు చేసే ఆలోచన తనకు లేకపోయినా, ధరలు తగ్గితే మరింత కొనడానికి ఆసక్తిగా ఉన్నానని తెలిపారు.
రోజర్స్ పెట్టుబడి తత్వం ఇదే..
తాను మార్కెట్ భవిష్యత్తు గురించి లెక్కలు వేస్తూ కూర్చోనని, ఎప్పుడైతే వస్తువుల ధరలు పడిపోతాయో అప్పుడే ఎక్కువగా కొనుగోలు చేస్తానని జిమ్ రోజర్స్ చెప్పుకొచ్చారు. బంగారం (gold), వెండి (silver) వంటి విలువైన లోహాలు తన వద్ద ఉన్నాయని, అవి తన పిల్లలకు మిగలాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఇటీవల వెండి ధరలు దూసుకుపోతున్న తరుణంలో తానూ కొంత వెండి కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు.
ప్రపంచంలోని చాలా దేశాలు భారీగా డబ్బును ముద్రిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో బంగారం వంటి లోహాలు కరెన్సీ డీ-వాల్యుయేషన్ నుండి తమను తాము రక్షించుకునేందుకు మంచి మార్గమని రోజర్స్ చెప్పారు. ‘భారతీయ మహిళలు శతాబ్దాలుగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. వారికి ఉన్న తెలివితేటలు నేనూ నేర్చుకుంటున్నాను’ అని ఉదహరించారు.
మార్కెట్లపై దృష్టి
చైనా మార్కెట్లో కొంత ఈక్విటీ ఎక్స్‌పోజర్ ఉన్నప్పటికీ, తన ఇతర పోర్ట్‌ఫోలియోలో చాలా భాగం విక్రయించానన్నారు. ఇటీవల స్టాక్ మార్కెట్లు బలంగా ఉండటాన్ని చూస్తే, తన అభిప్రాయం ప్రకారం ఇది అమ్మే సమయం అని చెప్పారు. జిమ్ రోజర్స్ తరచూ మార్కెట్‌లో వేచి చూసే పెట్టుబడిదారుల సరసన నిలబడతారు. వారు చెబుతున్నది స్పష్టం.. ధరలు పడితేనే కొనండి, ఎప్పుడూ ట్రెండ్‌ను అనుసరించవద్దు. బంగారం, వెండిలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలన్నది ఆయన సలహా.
ఇదీ చదవండి: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ నుంచి 10 శక్తివంతమైన డబ్బు పాఠాలు